చేనేత, జౌళి రంగాలను ఆదుకోవాలి

11 May, 2020 03:18 IST|Sakshi

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి మంత్రి కేటీఆర్‌ లేఖ 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా సంక్షోభం నేపథ్యంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే చేనేత, వస్త్ర, దుస్తుల తయారీ పరిశ్రమలపై దృష్టి కేంద్రీకరించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు సూచించారు. తక్కువ ఖర్చు, తక్కువ భూ వినియోగంతో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే శక్తి ఈ రంగాలకే ఉందన్నారు. చేనేత, టెక్స్‌టైల్, అపరెల్‌ పరిశ్రమలపై ఆధారపడిన వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి రాసిన లేఖలో కేటీఆర్‌ పేర్కొన్నారు. దేశం నుంచి ఎగుమతి అయ్యే వస్త్రాల విలువ రూ.36 బిలియన్‌ డాలర్లు కాగా, బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలతో పోటీ నెలకొందన్నారు. చైనాలో పెట్టుబడుల వికేంద్రీకరణపై బహుళ జాతి కంపెనీలు దృష్టి పెడుతున్న నేపథ్యంలో, వాటిని అందిపుచ్చుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు.

వస్త్ర పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీ.. 
వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న వారికి 6 నెలలు 50% కూలీ ఇవ్వడంతో పాటు, బంగ్లాదేశ్‌ తరహాలో దీర్ఘకాలిక రుణ సౌకర్యం కల్పించాలని కేంద్రాన్ని కేటీఆర్‌ కోరారు. అంతేకాకుండా 3 నెలల పాటు పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి వాటిని కేంద్రమే చెల్లించాలన్నారు. అదనంగా బ్యాంకు రుణాలు, ప్రస్తుత రుణాలపై వడ్డీ మాఫీ లేదా మారటోరియం ఏడాది పొడిగించాలని, ఎన్‌పీఏ నిబంధనలను సవరించాలన్నారు. టెక్స్‌టైల్‌ ఎగుమతులపై ఏడాది పాటు అదనపు ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. పత్తి కొనుగోలు మద్దతు ధరకు సంబంధించి రైతులకు నేరుగా వారి ఖాతాల్లోనే సబ్సిడీలు వేయాలన్నారు.

భారీ టెక్స్‌టైల్‌ జోన్లకు ఆహ్వానం.. 
దేశంలో భారీ టెక్స్‌టైల్‌ జోన్ల ఏర్పాటును స్వాగతించిన కేటీఆర్‌.. తెలంగాణలో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు ను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని తన లేఖలో ప్రస్తావించారు. లాక్‌డౌన్‌ మూలంగా కార్మికుల వద్ద పేరుకు పోయిన చేనేత ఉత్పత్తులను ఈ కామర్స్‌ ద్వారా అమ్మకాలు జరపాలని కోరారు. చేనేత వస్త్రాలను కేవీఐసీ, కాటేజ్‌ ఇండస్ట్రీస్‌ ద్వారా కొనుగోలు చేయాలన్నారు.   50% యార్న్‌పై సబ్సిడీ ఇవ్వాలని, రెండేళ్ల పాటు చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపులు ఇవ్వాలని కోరారు.

ప్రతి ఆదివారం పదినిమిషాలు కేటాయించండి 
పది ఆదివారాలు పది నిమిషాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే సీజనల్‌గా వచ్చే డెంగ్యూ, చికున్‌ గున్యా, మలేరియా వంటి కీటక వ్యాధులను అరికట్టవచ్చని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. సీజనల్‌ వ్యాధుల నివారణ కోసం ‘ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు’అనే ప్రత్యేక కార్యక్రమాన్ని మంత్రి తన నివాసంలో ప్రారంభించారు. కేటీఆర్‌ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తన ఇంటి లోని పూల కుండీలు, ఇతర ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకున్నారు.

సీఎం కేసీఆర్‌ అధికారిక నివాసం ప్రగతిభవన్‌ ప్రాంగణంలో కలియతిరిగిన మంత్రి కేటీఆర్, జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం అధికారుల సలహా మేరకు యాంటీ లార్వా మందులను చల్లారు. ప్రజలందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఏర్పడిందని, వర్షాకాలం నాటికి దోమల వలన కలిగే సీజనల్‌ వ్యాధుల నివారణకు ఇప్పటి నుంచే ప్రజలందరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మేయర్‌ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రగతిభవన్‌లో యాంటీ లార్వా మందును చల్లుతున్న మంత్రి కేటీఆర్‌. చిత్రంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌

మరిన్ని వార్తలు