సై..జై

30 Nov, 2018 09:23 IST|Sakshi

ప్రచారానికి ఎవరు పిలిచినా రెడీ

గంటల చొప్పున ప్యాకేజీలు

మహిళా సంఘాలు సైతం బిజీబిజీ

సాక్షి,సిటీబ్యూరో: మహానగరం ఎన్నికల ప్రచారంతో హోరెత్తుతోంది. పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న కొద్దీ ఆయా పార్టీల కార్యకర్తలు నేతల వెంట జోరుగా తిరుగుతున్నారు. అన్ని పార్టీలు బూత్, వార్డు కార్యాలయాలు ప్రారంభించడంతో కింది స్థాయి క్యాడర్‌ బిజీ అయిపోయింది. ఇక రోజువారీ పనుల కోసం అడ్డా మీదకు వచ్చే కూలీలు సైతం ఇప్పుడు ప్రచారంలో ప్రత్యక్షమవుతున్నారు. ఇదే ఇప్పుడు ఉపాధిగా మారింది. మహిళా సంఘాల సభ్యులు కూడా నేతలతో సమానంగా బిజీగా మారిపోయారు. దీంతో నగరంలో ప్రధాన అడ్డాల్లో కూలీలు సైతం దొరకని పరిస్థితి నెలకొంది. రోజు కూలీలు, వివిధ సంఘాల మహిళలు పార్టీ ఏదైనా, అభ్యర్థి ఎవరైనా.. పిలుపు రాగానే వెళ్లి ఆ రోజుకు ‘జై’ కొడుతున్నారు.

కూలీలు కావాలని అడ్డాల్లోకి వెళితే.. ‘ఇప్పుడు మేమంతా బిజీ.. ఏదైనా ఎన్నికల తర్వాతే’ అంటూ బైబై చెబుతున్న ఘటనలు ఉంటున్నాయి. నిత్యం కూలీలతో రద్దీగా ఉండే హరిబౌలి, పత్తర్‌ఘట్టీ, డబీర్‌పురా, ఫిల్మ్‌నగర్‌ అడ్డాలను గురువారం పరిశీలిస్తే పని కోసం వచ్చిన కూలీలు చాలా తక్కువగా కనిపించారు. వచ్చిన వారు సైతం తాము ఇప్పుడు మట్టి పనులకు రాలేమని, ఎన్నికల ప్రచారానికి మాత్రమే వస్తామని చెప్పడం విశేషం. ప్రచారంలో కొత్త వాళ్లేతే పార్టీ, అభ్యర్థి, నినాదాల విషయంలో పది నిమిషాల పాటు శిక్షణ సైతం ఇస్తున్నారు. ఇందులో చాలా మంది గడిచిన వారం రోజులకే ఒకే పార్టీకి ప్రచారం చేస్తుండగా, భారీ బహిరంగ సభలు, రోడ్‌షోలకు జనం కావాల్సిన సమయాల్లో మాత్రం ఇతర పార్టీల్లోనూ ప్రత్యక్షమవుతున్నారు.  

‘షో’ను బట్టి ప్యాకేజీలు..
ప్రచారంలో పాల్గొనే జనానికి ‘షో’ వారిగా ప్యాకేజీలు అమలవుతున్నాయి. జెండా, టోపీలతో రోజంతా ప్రచారం చేయాల్సి వస్తే ఉదయం టిఫిన్‌ నుంచి మొదలై రాత్రి 9 గంటలకు భోజనంతో ముగుస్తుంది. ప్రచారం మార్గ మధ్యలో లంచ్‌ సైతం వడ్డిస్తున్నారు. ఇలా వస్తున్న మహిళలకు రూ.300, పురుషులైతే రూ.500 చొప్పున చెల్లిస్తున్నారు. పురుషులు నినాదాలివ్వటండం, సందడి సృష్టించే బాధ్యతలు తీసుకుంటున్నారు. ఇక వాహనంతో వస్తే రూ.500 చొప్పున చెల్లిస్తున్నారు. అయితే, ప్రచారంలో మహిళలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్న పార్టీలు, ప్రతి పది మంది మహిళలకు ఒక గ్రూప్‌ లీడర్‌ చొప్పున బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఏ రోజుకారోజే నగదు చెల్లింపులు చేస్తున్నారు. ఇక బూత్‌ల వారిగా వేసిన కమిటీలకు ప్రధాన పార్టీలు రూ.5000 చొప్పున రోజూ పంపిణీ చేస్తుండడంతో అన్ని ప్రాంతాల్లో రాజకీయ పండగే కనిపిస్తోంది. 

మరిన్ని వార్తలు