దండకారణ్యంలో యుద్ధ మేఘాలు! 

12 Feb, 2020 08:37 IST|Sakshi

సాక్షి, చర్ల(ఖమ్మం): దండకారణ్యంలో యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. చర్ల మండల సరిహద్దున ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో గల పామేడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎర్రపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టుతో పాటు ఇద్దరు జవాన్లు మృతి చెందిన విషయం విదితమే. కాగా, ఈ ఎదురుకాల్పుల్లో పాల్గొని తప్పించుకున్న మావోయిస్టులను పట్టుకోవాలన్న కృతనిశ్చయంతో ప్రత్యేక పోలీసు బలగాలు దండకారణ్యంలోకి పెద్దఎత్తున చొచ్చుకుపోతున్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు అటు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సీఆర్‌పీఎఫ్, స్పెషల్‌ పార్టీ, కోబ్రా, డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, గ్రేహౌండ్స్‌ బలగాలు సరిహద్దుకు చేరుకొని దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి.

సరిహద్దున బీజాపూర్‌ జిల్లాలో ఉన్న ఎర్రపల్లి, డోకుపాడు, తెట్టెమడుగు, యాంపు రం, జారుపల్లి, గుండ్రాయి, పాలచలమ తది తర గ్రామాలకు చెందిన ఆదివాసీలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎర్రపల్లి ఎదురుకాల్పుల నేపథ్యంలో సరిహద్దులో ఉన్న తోగ్గూడెం, తిప్పాపురం, ధర్మపేట, ఎలకనగూడెం, మారాయిగూడెం, పామేడు ప్రాంతాల్లో ఉన్న బేస్‌క్యాంపులతో పాటు డీఆర్‌జీ, ఎస్టీఎఫ్‌ క్యాంపుల్లో భద్రతను పెంచారు. ఆయా క్యాంపులకు అదనపు బలగాలను తరలిస్తున్నారు. ఆకు రాలే కాలం కావడంతో ఇక నుంచి పెద్ద ఎత్తున కూంబింగ్‌ ఆపరేషన్లు ఆరంభం కానుండగా, ఎప్పుడు, ఎక్కడ ఏ ప్రమాదం వచ్చి పడుతుందోనని సరిహద్దు జనం భయకంపితులవుతున్నారు.

మరిన్ని వార్తలు