పోలింగ్‌పై పోలీసుల నిఘా

1 Apr, 2019 18:03 IST|Sakshi
గ్రామాల్లో కవాతు నిర్వహిస్తున్న పోలీసులు(ఫైల్‌)   

నిర్భయంగా ఓటు హక్కు వినియోగం  

మోహరించిన ప్రత్యేక బలగాలు  

కొనసాగుతున్న బైండోవర్లు 

సాక్షి, వేములవాడ: పార్లమెంట్‌ ఎన్నికలు ఏప్రిల్‌ 11న జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించి ప్రతీ ఓటరు తన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వేములవాడ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, ప్రతీ గ్రామంలో ఓటర్లంతా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టారు. జిల్లా పోలీసు అధికారుల సూచనల మేరకు వేములవాడ డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక బృందాలు గ్రామగ్రామాన కవాతులు నిర్వహిస్తూ పోలీసులు ప్రజల రక్షణ కోసం ఉన్నారన్న సంకేతాలు అందజేస్తున్నారు. ఎవరి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోలీసులు ప్రజలకు రక్షణగా ఉంటారన్న భరోసాను ఇస్తున్నారు. ప్రత్యేక పోలీసుల బలగాలతో కవాతులు నిర్వహించి ప్రజలకు మరింత ధైర్యాన్ని ఇస్తున్నారని స్థానికంగా చర్చించుకుంటున్నారు.  


ప్రత్యేక బలగాల రాక 
పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ ప్రాంతానికి ప్రత్యేక బలగాలు వచ్చేశాయి. వీరితో నిత్యం కూడళ్ల వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోడ్‌ అమల్లో ఉండటంతో అందుకు అనుగుణంగా విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి వేళల్లోనూ తనిఖీలు నిర్వహిస్తూ పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. వాహనాల తనిఖీలు, బస్సులు తనిఖీలు, ముల్లెమూటల తనిఖీలు, నగదు తరలింపు అంశాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఇటీవల వేములవాడ శివారులో రూ.4 లక్షలు తరలిస్తున్న ఓ వ్యక్తిని సోదా చేసి పట్టుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా డబ్బులు తరలించవద్దన్న ఎన్నికల సంఘం నిబంధనలను ఇక్కడి పోలీసులు పాటిస్తున్నారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు మరింత ముమ్మరం చేస్తున్నారు.   


మద్యం పట్టివేత 
పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా నేరచరిత గల వ్యక్తులను పట్టుకుని తహసీల్దారు ముందు బైండోవర్‌ చేయడంతోపాటు ఎలాంటి చర్యలకు దిగినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన మ ద్యాన్ని పట్టుకుని సీజ్‌ చేస్తున్నారు. ఎన్నికల నియమావళికి లోబడి డబ్బుల తరలింపు అంశాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న డబ్బులను సీజ్‌ చేసి కోర్టులో డిపాజిట్‌ చేస్తున్నారు. 103 మందిని బైండోవర్‌ చేశారు. 58 లీటర్ల మద్యం పట్టుకున్నారు. 96 పోలింగ్‌ స్టేషన్లలో 70 నార్మల్‌ పోలింగ్‌ స్టేషన్లు, 26 క్రిటికల్‌ పోలింగ్‌ స్టేషన్లుగా గుర్తించారు. 141 లొకేషన్లలో 255 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఇందుకు రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్, 1 స్టాటిస్టిక్స్‌ అసెస్‌మెంట్‌ టీం గస్తీ తిరుగుతున్నారు.  

మరిన్ని వార్తలు