‘గాంధీ’ ఘటనలపై సర్కారు సీరియస్‌ 

16 Feb, 2020 02:34 IST|Sakshi

బాధ్యులైన ఒక కీలకాధికారిపై చర్యలకు సన్నాహాలు 

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రత్యేక సమీక్ష 

మందుల ధరలు మన రాష్ట్రంలో అధికంగా ఉండటంపై మండిపాటు

సాక్షి, హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆస్పత్రిలో ఇటీవల జరిగిన వివాదాస్పద ఘటనలు సీఎం కేసీఆర్‌ దృష్టికి కూడా వెళ్లడంతో వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ ఆరోపణలపై వాస్తవాలను నిర్థారించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల శనివారం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు.  

విమర్శలకు దారి తీసిన ఘటనలు.. 
ఇద్దరు చైనీయులకు కరోనా(కోవిడ్‌–19) వైరస్‌ సోకినట్లు గాంధీ ఆస్పత్రి నుంచి జరిగిన ప్రచారానికి ఓ వైద్యుడు బాధ్యుడంటూ ఆయన చర్యలు తీసుకోవడంతో ఆయన ఆత్మహత్యకుయత్నించారు. గాంధీ ఆస్పత్రిలో మందుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు, పారిశుద్ధ్య, భద్రత నిర్వహణ ఏర్పాట్లపై కొందరు రోగులు అసంతృప్తి వ్యక్తం చేయడం, ఇద్దరు కోవిడ్‌–19 అనుమానితుల నుంచి నమూనాలు సరిగ్గా సేకరించకపోవటం వంటి ఘటనలు ఉన్నత స్థాయిలో తీవ్ర విమర్శలకు దారి తీశాయి. రాష్ట్రస్థాయి కీలకాధికారి నిర్లక్ష్యం వల్లే ఈ ఘటనలు జరిగినట్లు వైద్య ఆరోగ్యశాఖ భావిస్తోంది.

పరిస్థితులను చక్కదిద్దడంలోనూ, పర్యవేక్షణలోనూ సదరు అధికారి విఫలం కావడంతో ఆయనపై వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది. ఈ ఘటనలపై శనివారం గాంధీ ఆస్పత్రిలో మంత్రి ఈటల సమీక్ష నిర్వహించి ఈ ఘటనలపై పూర్తి స్థాయి నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వ్యక్తుల కంటే వ్యవస్థే కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. హౌస్‌సర్జన్లకు సంబంధించిన రికార్డులు, భద్రత, పారిశుద్ధ్యం పనితీరుకు సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. డీఎంఈ రమేశ్‌రెడ్డి, సూపరింటిండెంట్‌ డాక్టర్‌ శ్రవణ్‌కుమార్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

మందుల ధరలు ఇక్కడే ఎందుకు ఎక్కువ? 
మన రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రులన్నింటికీ అవసరమైన మందులను కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. అయితే గుజరాత్, తమిళనాడు తదితర రాష్ట్రాలతో పోలిస్తే, మన రాష్ట్రంలో కొన్ని రకాల మందుల ధరలు అధికంగా ఉన్నాయని, ఇదేంటని ఈటల ఆ సమావేశంలో సంబంధిత అధికారులను నిలదీశారు. ఒకరకపు మాత్రను ఆ రెండు రాష్ట్రప్రభుత్వాలు కాంట్రాక్టర్ల నుంచి రూ. 20కు కొనుగోలు చేస్తే, అదే మందును మన రాష్ట్రం రూ.32కు కొనడం ఏంటని మంత్రి నిలదీశారు. అనేక మందుల ధరలు ఇలాగే అధికంగా ఉన్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. ఇకనుంచి ప్రభుత్వాస్పత్రులకు అవసరమైన వాటిని కొనుగోలు చేసేటప్పుడుగానీ, ఇతరత్రా టెండర్‌ కాంట్రాక్టులను ఫైనల్‌ చేసేప్పుడు కానీ తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. బోధనాస్పత్రుల్లో మెరుగైన సేవల కోసం ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలన్నారు. 

బడ్జెట్‌ రూ. 6 వేల కోట్లు
రానున్న రాష్ట్ర బడ్జెట్లో వైద్య ఆరోగ్యశాఖ బడ్జెట్‌ రూ.6 వేల కోట్లు ఉండే అవకాశం కనిపిస్తుంది. అధికారులు రూ.8,500 కోట్లకు ప్రతిపాదనలు పంపించగా, రూ.6వేల కోట్లకు కుదించినట్లు సమాచారం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రతి రోగి అనుభవం ఎలా ఉందో తెలుసుకునేలా రూపొందించిన ‘మై క్రిటిక్‌’ఫీడ్‌బ్యాక్‌ యాప్‌ను మంత్రి ఈటల ప్రారంభించారు. ఇలాంటివి ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలందించేందుకు దోహదపడతాయన్నారు. డాక్టర్లు ఎన్నిసార్లు చూడ్డానికి వచ్చారు, వారు ఏ విధంగా చికిత్స అందించారు, ఆస్పత్రిలో పరిశుభ్రత ఎలా ఉంది అనే వివరాలు ఈ యాప్‌లో నమోదు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు