నేతలపై నిఘా నీడ!

3 Apr, 2019 03:04 IST|Sakshi

ఎక్కడికెళ్లినా సమాచారమివ్వాలని పోలీసుల సూచన 

వీఐపీలకు ప్రత్యేకభద్రత, షాడో టీంలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంటోంది. నామినేషన్ల పర్వం ముగిసిన దరిమిలా ఆయా పార్టీల అధినేతలు, అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు, బహిరంగసభలు, రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో పోలీసులు అప్రమత్తమై ప్రముఖుల భద్రతకు పక్కా ప్రణాళికలు రూపొందించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణహాని ఉన్న నేతలకు ప్రత్యేకంగా పలు సూచనలు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్రానికి వచ్చివెళ్లారు. సీఎం కేసీఆర్‌ వంటి వీవీఐపీల సభలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల సభలకు బందోబస్తు కల్పించడం పోలీసులకు సవాలుగా మారింది.

ఒకవైపు ప్రత్యేక బందోబస్తులతో నేతలకు రక్షణ కల్పిస్తూనే, మరోవైపు షాడో టీంలతో వారిని నీడలా వెంటాడుతున్నారు. నేతల అనుచరుల కదలికలపైనా నిఘా ఉంచుతున్నారు. అక్రమాలకు, ప్రలోభాలకు, నగదు పంపిణీకి తావు లేకుండా ఎక్కడికక్కడ డేగ కళ్లతో పర్యవేక్షిస్తున్నారు. కమిషనరేట్లలో ఏసీపీ, జిల్లాల్లో డీఎస్పీ స్థాయి అధికారులు వీఐపీల భద్రత, షాడో టీంల మోహరింపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పాల్గొనబోయే రాజకీయ కార్యక్రమాలు, పర్యటించే ప్రాంతాల వివరాలు ముందుగానే స్థానిక ఎస్పీ, కమిషనరేట్‌ల్లో ఇవ్వాలని ప్రాణహాని ఉన్న నేతలకు పోలీసులు సూచించారు. 400 చెక్‌ పాయింట్లు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు రూ.13 కోట్లకు చేరింది. 260 కంపెనీల కేంద్ర బలగాలు కావాలని తెలంగాణ పోలీసులు కేంద్రానికి నివేదించారు. 166 వరకు కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయి.

మరిన్ని వార్తలు