సంక్షేమానికి మత్స్య అభివృద్ధి పథకం

8 Apr, 2018 11:18 IST|Sakshi

ఖమ్మంవ్యవసాయం : మత్స్యరంగ సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం మత్స్య సహకార సంఘాల సమాఖ్య ద్వారా సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని అమలు చేస్తోందని జిల్లా మత్స్య శాఖ అభివృద్ధి అధికారి ఎన్‌.హన్మంతరావు తెలిపారు. నగరంలోని టీఎన్‌జీవోస్‌ ఫంక్షన్‌ హాల్‌లో జిల్లాలోని మత్స్య సహకార సంఘ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంపై అవగాహన కార్యక్రమాన్ని వివరించారు. ఈ సందర్భంగా హన్మంతరావు మాట్లాడుతూ సమీకృత మత్స్య అభివృద్ధి పథకానికి ప్రభు త్వం రూ.వెయ్యి కోట్లు కేటాయించిందన్నారు. ఇందులో భాగంగా జిల్లాకు రూ.30కోట్ల మేర కు నిధులు కేటాయించే అవకాశం ఉందన్నా రు. ఆ నిధులను ప్రాథమిక మత్స్య సహకార సంఘాలకు, మహిళా మత్స్య సహకార సంఘాలకు, మత్స్యకార మార్కెటింగ్‌ సహకార సంఘాలకు, ఆయా సంఘాల సభ్యుల ప్రయోజనానికి ఖర్చు చేయనున్నట్లు తెలిపా రు.

చేప పిల్లల ఉత్పత్తిని పెంచటం, చేపల వేటకు పరికరాలు అందించటం, మార్కెటింగ్, ప్రాసెసింగ్‌కు సహాయం అందించటం, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఈ పథకాన్ని వినియోగిస్తామని తెలిపారు. వ్యక్తిగత లబ్ధిదారులకు చేపల అమ్మకానికి ద్విచక్ర వాహనం, ప్లాస్టిక్‌ చేపల క్రేట్లు, వలలు, క్రాప్టు లు, లగేజీ ఆటోతో చేపల అమ్మకం, సంచార చేపల అమ్మకం వాహనం, కొత్త చేపల చెరువుల నిర్మాణం, రీ సర్క్యులేటరీ ఆక్వా కల్చర్‌ యూనిట్, అలంకరణ చేపల యూనిట్, విత్తన చేపలపెంపకం చెరువులకు దరఖాస్తు చేసుకో వచ్చన్నారు. వీటికి ప్రభుత్వం 75నుంచి 90 శాతం వరకు సబ్సిడీ ఇస్తుందన్నారు. లబ్ధిదారులు రూ.4వేల నుంచి రూ.25లక్షల వరకు కూడా రుణాలు పొందవచ్చని తెలిపారు.

గ్రూపులకు రూ.4లక్షల నుంచి రూ.76లక్షల వరకు సబ్సిడీపై పరికరాలు, రుణాలు ఇస్తున్న ట్లు తెలిపారు. సహకార సంఘాల స్థాయిలో, జిల్లా సంఘం స్థాయిలో కూడా పెద్ద ఎత్తున సబ్సిడీపై రుణాలు, పరికరాలు అందజేయనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన మత్స్యకారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు యడవల్లి చంద్రయ్య, నీలాల గోపి, ఖమ్మం, వైరా మత్స్య అభివృద్ధి అధికారులు వరదారెడ్డి, శివప్రసాద్, మత్స్యకారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు