ఓ అతిథీ..రేపు రా...!

28 Mar, 2020 04:36 IST|Sakshi

కరోనాతో ప్రవాసీల దుస్థితి

సాక్షి, హైదరాబాద్‌: కొన్నేళ్ల కిందట తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఇళ్ల గోడలపై ‘ఓ స్త్రీ రేపు రా’అని రాయించే వారు.  ఎవరో స్త్రీ వచ్చి వారిని బెదిరిస్తోందనే ప్రచారం సాగి ఆమెను చూసే ధైర్యం లేక గోడలపైనే ఇలా రాయించుకొని ఆమె ఎంచక్కా అది చదువుకొని వెళ్లిపోతుందనే నమ్మకం ప్రబలి చాలా ఇళ్ల గోడలపై ఈ స్లోగన్‌ కనిపించేది. సరిగ్గా అలాంటి దుస్థితే కరోనా తెచ్చిపెడుతోంది. ఆఖరికి దగ్గర బంధువులైన ప్రవాసులను సైతం దూరం.. దూరం అని చెప్పేస్తున్నారు. మళ్లీ కలుద్దాంలే..అని మాట మారుస్తున్నారు. ప్రవాస భారతీయులు అంటే అమెరికా..ఆస్ట్రేలియా.. బ్రిటన్‌.. ఇలా ఏ దేశంలో తమ బంధువులో..సన్నిహితులో ఉన్నా.. ఆ కుటుంబానికి సమాజంలో దక్కే గౌరవమే వేరు. విదేశాల్లో ఉన్నవారికి అదో స్టేటస్‌ సింబల్‌. ఇప్పుడు వారి పట్ల అనుమానపు చూపులు పడుతున్నాయి. కరోనా వైరస్‌ ప్రవాసులను ఇలా దూరం చేస్తోంది. ఒకప్పుడు విదేశాల నుంచి వారు వస్తే ఘనంగా ఆహ్వానించే కుటుం బీకులు, సన్నిహితులు వారిని నేడు గుట్టుగా క్వారంటైన్‌కో , పరీక్షలకు ఆస్పత్రికో తరలిస్తున్నారు. విదేశంనుంచి వారు రాగానే.. ఇట్టే వాలిపోయే బంధుగణం, మిత్ర బృందం ఇప్పు డు వారివైపు కన్నెత్తి చూడటానికే సాహసించడంలేదు. ఈ నేపథ్యంలో పక్షం రోజుల స్వీయ నిర్బంధానికే ప్రాధాన్యమిస్తున్నారు.

బావమరిది రాక..బావ పోక.. 
ఇలా ప్రవాసభారతీయుల మాట వింటేనే ప్రజానీకం వణికిపోతోంది. తమ పొరుగు ఇంటికి విదేశీ వ్యక్తులెవరైనా వస్తే గుట్టుచప్పుడు కాకుండా.. వేరే ఇంటికి చెక్కేస్తున్నారు. మియాపూర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఇలాంటి సంఘటనే వెలుగు చూసింది. అద్దె ఫ్లాట్‌లో నివసించే ఓ ఉద్యోగి ఇంటికి కొద్దిరోజుల కిందట విదేశాలనుంచి ఆయన బావమరిది వచ్చారు. ఆ వ్యక్తి ఆ ఇంటి అడ్రస్‌లో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు పొద్దున్నే ఆ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. ఫలానా ఫ్లాట్‌లో ఒక విదేశీ వ్యక్తి ఉన్నారని, ఆయన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేందుకు వచ్చామని చెప్పారు.

ఈ విషయం తెలిసి ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగిని నిలదీస్తే... తన బావమరిది వైద్యుడని, ఆరోగ్యంగా ఉన్నారని సమాచారం ఇచ్చారు. సీను కట్‌ చేస్తే... రెండ్రోజుల తర్వాత బావ కనబడకుండా పోయారు. బావమరిదికి సరిపడా నిత్యావసరాలు సమకూర్చిన ఆయన సొంతూరుకు చెక్కేశారు. కలిసి ఉంటే తనకు కూడా కరోనా వైరస్‌ వస్తుందనే ఆందోళనతో బావమరిదిని అక్కడే వదిలి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇలా నాడు రాజభోగం అనుభవించిన వారు నేడు కరోనా ముద్రతో బయటకు రాలేకపోతున్నారు. ఆత్మీ యుల ఆదరణ కోల్పోతున్నారు.

మరిన్ని వార్తలు