ఇది రుద్రమ మరణశాసనం

1 Jun, 2020 03:12 IST|Sakshi

కాకతీయ వీరనారి కాలం చేసింది 1289లో..

పాత అంచనాకు బలం చేకూరుస్తున్న ఆధారాలు

ఇటీవలే గుంటూరు జిల్లా పుట్టాలగూడెంలో శాసనం లభ్యం

చరిత్రకారుల్లో ఆసక్తి రేపుతున్న కొత్త ఆధారం

సాక్షి, హైదరాబాద్‌: రాణి రుద్రమదేవి.. ధీర వనిత, భారతావనిలో దేశాన్ని అత్యంత గొప్పగా పాలించిన మహారాణి. మహిళ అయి ఉండి ‘మగ’మహారాజుగా చరిత్రలో నిలిచిపోయిన ఓ విచిత్రం. తొలుత పురుష వేషధారణలో ఉండి, యువరాజుగా పేరు పొందినా.. తర్వాత మహిళగా రాజ్యపాలన చేసినా,  చరిత్రలో మాత్రం కాకతి రుద్రదేవ మహారాజుగా నిలిచిపోయారు. కాకతీయ పౌరుషం అనగానే ఠక్కున రుద్రమదేవి పేరు మదిలో మెదులుతుంది. సువిశాల గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి, ప్రజారంజక పాలనతో గుర్తింపు తెచ్చుకున్న ఈ మహాయోధురాలు ఎప్పుడు మృతిచెందారు? ఆమె మరణించిన కాలంపై భిన్న వాదనలు ఉన్నప్పటికీ, సూర్యాపేట జిల్లా చందుపట్లలో లభించిన ఓ శాసనంపై ఉన్న కాలాన్నే ఎక్కువ మంది అసలు మరణ తేదీగా భావిస్తారు. ఇప్పుడు ఆ శాసనాన్ని రూఢి చేసేలా మరో కొత్త శాసనం వెలుగు చూసింది. దాని ప్రకారం ఆమె మరణించిన సంవత్సరం 1289.

గుంటూరు జిల్లా పుట్టాలగూడెం శివారులో ఇటీవల ఓ శాసనం వెలుగు చూసింది. గతంలో ఇక్కడ బౌద్ధస్థూపం ఉండేదన్న ఆనవాళ్లు ఉన్నాయి. అక్కడి ఆయక స్తంభంపైనే ఈ శాసనం చెక్కి ఉండటం విశేషం. చాలాకాలంగా ఇది ఇక్కడే ఉన్నా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవలే దాన్ని పరీక్షించగా ఆ దేవాలయానికి భూమిని దానంగా ఇచ్చిన సందర్భంలో వేయించిన శాసనంగా తేలింది. అందులో రాణి రుద్రమదేవి వివరాలు వెలుగుచూశాయి. ఆమె చనిపోయిన సందర్భంలో ఈ భూదానం చేసినట్టు స్పష్టమవుతోంది.

శక సంవత్సరం 1210(1) విరోధినామ సంవత్సరం పౌష్య శుద్ధ విదియనాడు మకర సంక్రాంతి పుణ్యకాలంలో ఇది వేయించినట్టుగా ఉంది. దాని ప్రకారం క్రీ.శ. 1289 డిసెంబరు 15 అవుతోంది. కాకతీయ మహారాజు రుద్రదేవ మహారాజుకు ధర్మంగా ఒడ్ల కాలువ, సోమలవరి ఇడువ (పంటపొలం)ధర్మంగా ఇచ్చినట్టు ఉంది. కొన్ని పంక్తులు చెరిగిపోయి అస్పష్టంగా మిగిలాయి. అంతకుముందు కాకతీయ సేనానిగా పనిచేసిన గన్నమనాయకుడి కుమారుడైన సోమయ్య సాహిణి ఈ భూమిని దానం చేసినట్టుగా అందులో ఉంది. ఈయన రుద్రమదేవి పరిపాలన చివరి కాలంలో ఆమె వెంట ఉన్న వ్యక్తి.

తొలి శాసనానికి బలం చేకూర్చిన ఆధారం..
నేటి సూర్యాపేట జిల్లా చందుపట్ల సోమనాథ దేవాలయంలో లభించిన శాసనంలో రుద్రమదేవికి శివలోక ప్రాప్తి కోరుతూ దేవాలయానికి భూమిని దానం చేసినట్టు ఉంది. ఈ శాసనాన్ని 1289 నవంబరు 25న వేయించినట్టు వివరాలు చెబుతున్నాయి. వారు మరణించిన దశదిన కర్మ జరిగేలోపు వేయించి ఉంటారని, అంటే అందులోని తేదీకి కాస్త అటూ ఇటూగా పక్షం రోజుల ముందు ఆమె చనిపోయి ఉంటుందని అంచనాగా చరిత్రకారులు చెబుతారు.

గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలోని ఈవూరు గోపాలస్వామి దేవాలయం ముందు స్తంభంపై గతంలో మరో శాసనం లభించింది. ఇందులో రుద్రమదేవితోపాటు అంగరక్షకుడు బొల్నాయినికి పుణ్యంగా స్వామికి భూమిని సమర్పించినట్టు ఉంది. ఈ శాసనం 1289 నవంబర్‌ 28న వేయించారు. ఈ రెండు శాసనాల్లో రాణి రుద్రమతోపాటు ఆమె సైన్యాధిపతి మల్లికార్జుననాయునికి, అంగరక్షకుడు బొల్నాయినికి కూడా శివలోక ప్రాప్తి కోరుతూ ఉండటంతో ముగ్గురూ ఒకేసారి మరణించారని చరిత్రకారులు అంచనాకొచ్చారు. అంటే యుద్ధంలోనో, అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్న సమయంలోనో మరణించి ఉంటారని అంచనా.

మరణించే నాటికి 80 ఏళ్లు?
రుద్రమదేవి మరణించే సమయానికి ఆమెకు 80 ఏళ్ల వయసు ఉంటుందని ప్రముఖ చరిత్రకారులు పరబ్రహ్మశాస్త్రి గతంలోనే ఓ అంచనాకొచ్చారు. ఆమె తండ్రికి సంబంధించి వెలుగు చూసిన శాసనాలు, రుద్రమదేవికి సంబంధించిన ఆధారాలను అధ్యయనం చేసి ఆయన ఈ అంచనాకొచ్చారు. 80 ఏళ్ల వయసులో ఆమె యుద్ధం చేయటం కష్టమైన పనే. అందుకే ఆమె మరణించిన సమయంలో నేరుగా యుద్ధంలో పాల్గొన్నారా, లేక యుద్ధానికి సంబంధించిన పర్యవేక్షణకు వచ్చిన సమయంలో శత్రువుల చేతిలో చనిపోయారా అన్నది మాత్రం స్పష్టం కాలేదు.

మొదటి రెండు శాసనాలు దాదాపు ఒకే సమయంలో వేయించినట్టు స్పష్టంగా ఉంది. ఇప్పుడు కొత్తగా వెలుగుచూసిన శాసనాన్ని తొలిసారి నేనే చదివాను. ఇందులో 1289 డిసెంబరు 15 అని ఉంది. వెరసి ఆమె అదే సంవత్సరంలో మరణించారని దాదాపు స్పష్టమైంది. మన చరిత్రలో మహా అధ్యాయాన్ని లిఖించుకున్న గొప్ప యోధురాలు రుద్రమదేవి మరణ సమయంపై దాదాపు స్పష్టత వచ్చినట్టయింది .
–శ్రీరామోజు హరగోపాల్, చరిత్రకారులు

మరిన్ని వార్తలు