చావలే.. బతికే ఉంది?

10 May, 2020 04:11 IST|Sakshi

అమెరికా, రష్యా ల్యాబ్‌లలో 40 ఏళ్లుగా భద్రంగా మశూచీ వైరస్‌

భవిష్యత్తులో మళ్లీ మహమ్మారి విజృంభిస్తే వ్యాక్సిన్‌ తయారీకి

వూహాన్‌ ఉదంతంతో.. ఆ వైరస్‌ను ధ్వంసం చేయాలంటూ ఇతర దేశాల ఒత్తిడి

కరోనా విషయంలోనూ ఇలాగే భద్రపరిచే అవకాశం

ప్రధాన దేశాల ల్యాబ్‌లలో కరోనా వైరస్‌ను నిల్వచేసే యోచన 

సాక్షి, హైదరాబాద్‌: 2019 సెప్టెంబర్‌ 16.. రష్యా లోని కోత్సోవో పట్టణం.. భారీ శబ్దం, ఓ భవనం ఐదో అంతస్తులో ఎగిసిపడ్డ అగ్నికీలలు.. అంతే ఒక్క సారిగా భయం.. ఆ ప్రాంతంలో కాదు, వివిధ దేశాల్లో ఆందోళన మొదలైంది. అది మామూలు గ్యాస్‌ సిలిండర్‌ పేలటంతో ఏర్పడ్డ ప్రమాదమని, ఎలాంటి ప్రాణ నష్టం లేదని, ఆస్తి నష్టం కూడా జరగలేదని తేలింది. కానీ కొన్ని దేశాల్లో మాత్రం భయం వీడలేదు. ఇప్పుడు ఆ భయం మరింత పెరిగింది. కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో, నాటి పేలుడు ప్రకంపనలు ఇప్పుడు మొదలయ్యాయి. చివరకు డబ్ల్యూహెచ్‌వో దీనిపై త్వరలో అత్యున్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించే దాకా వెళ్లింది.

ఎందుకింత భయం.. 
ప్రపంచంలో మూడింట ఒకవంతు జనాన్ని పొట్టన పెట్టుకున్న తొలి అంటు రోగం.. దాదాపు మూడున్నర వేల ఏళ్ల కిందటే పుట్టి.. ఒక్క 20వ శతాబ్దంలోనే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మందిని బలి తీసుకున్న మశూచీ (స్మాల్‌ పాక్స్‌) వైరస్‌ ఆ భవనంలో ఇప్పటికీ ‘బతికి ఉండట’మే ఆ భయానికి కారణం.

40 ఏళ్ల కిందటే అంతం..
మశూచీని మసి చేశాం.. అని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. వేల ఏళ్లపాటు మనిషిని గడగడలాడించిన మశూచీని అంతం చేసినట్టే కరోనాను కూడా కాలరాస్తామని ఇప్పుడు చెప్పుకుంటున్నాం. సరిగ్గా 40 ఏళ్ల క్రితం.. అంటే 1980లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ప్రకటన చేసింది. విశ్వంలో తొలి అంటురోగాన్ని అంతం చేశామని, ఇక జనం ఊపిరిపీల్చుకోవచ్చని వెల్లడించింది. 1978లో యూకే బర్మింగ్‌çహామ్‌లో జనెత్‌ పార్కర్‌ అనే యువతి మశూచీకి బలైన చివరి బాధితురాలని వెల్లడించింది. కానీ అమెరికా, రష్యా, బ్రిటన్, దక్షిణాఫ్రికా.. ఈ నాలుగు దేశాలు మశూచీ వైరస్‌ను భద్రపరుచుకున్నాయి. భవిష్యత్తులో మళ్లీ ఆ మహమ్మారి విజృంభిస్తే వేగంగా టీకా తయారు చేసుకునేందుకు అలా భద్రపరిచినట్లు వెల్లడించాయి.

కానీ ఏమాత్రం తేడా వచ్చినా ఆ వైరస్‌ లీకయ్యే ప్రమాదం ఉండటంతో యూకే, దక్షిణాఫ్రికాలు 1984లో ఆ వైరస్‌ను ధ్వంసం చేశాయి. అమెరికా, రష్యాలు మాత్రం కాపాడుకుంటున్నాయి. అట్లాంటాలోని ‘స్టేట్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌’ల్యాబ్‌లో అమెరికా, మాస్కో సమీపంలోని ‘ది రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ వైరల్‌ ప్రిపరేషన్స్‌’ల్యాబ్‌లో రష్యా ఆ వైరస్‌ను భద్రపరిచాయి. 1999లో రష్యా ఆ వైరస్‌ను కోత్సోవో పట్టణం శివారులోని ‘స్టేట్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆఫ్‌ వైరాలజీ అండ్‌ బయోటెక్నాలజీ’లోకి మార్చింది. మైనస్‌ 80 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో అత్యంత పకడ్బందీ రక్షణ వలయంలో వైరస్‌ను ఉంచారు. ఈ రెండు దేశాలు వైరస్‌ను భద్రపరచటాన్ని కొన్ని ఇతర దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. అయితే ఈ రెండు ల్యాబ్‌లు కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ అధీకృతమైనవి కావటంతో భయాన్ని కొంత వదులుకున్నాయి. కానీ, ఎప్పటికైనా ఇది ప్రమాదకరమే కానుందని పలు పర్యాయాలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఫిర్యాదు చేశాయి.

టీకా కోసమట! 
మశూచీ అంతరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన తర్వాత మశూచీ టీకా వాడట్లేదు. దీంతో 1980 తర్వాత పుట్టిన వారిలో చాలా మందికి ఈ టీకా వేయించలేదు. 1972లోనే అమెరికాలో ఆ రోగం అంతరించినందున ఆ తర్వాత తరానికి ఈ వ్యాక్సిన్‌ వేయించలేదు. దీంతో వీరిలో ఆ వైరస్‌ను చంపేసే నిరోధకత శరీరంలో ఉండదు. ఉన్నట్టుండి వైరస్‌ ప్రబలితే వెంటనే లక్షల మంది మళ్లీ దాని బారినపడే ప్రమాదం ఉంటుందని, వైరస్‌ సిద్ధంగా ఉంటే వెంటనే వ్యాక్సిన్‌ రూపొందించే అవకాశం ఉంటుందని ఆ దేశాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా లైవ్‌ వైరస్‌తో ఓరల్‌ వ్యాక్సిన్‌ రూపొందించే అవకాశం ఉంటుందని, ఇది వేగంగా వ్యాధిని అంతం చేస్తుందని ఆ దేశాలు వాదిస్తున్నాయి.

5 పర్యాయాలు ధ్వంసం చేయాలని..
ప్రమాదకర వైరస్‌ కావటంతో ఏ క్షణాన్నయినా లీక్‌ అయ్యే పరిస్థితి ఉంటుందని, వెంటనే దాన్ని నిర్మూలించాలని ప్రపంచ దేశాల విజ్ఞప్తితో తొలిసారి 1986లో ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు ల్యాబ్‌లలోని వైరస్‌ను ధ్వంసం చేయాలని నిర్ణయించింది. కానీ, ఆ ప్రయత్నం విరమించుకుని 1993లో మరోసారి ధ్వంసం చేసే యోచన చేసింది. మళ్లీ ఆ రెండు దేశాల ఒత్తిడితో వెనకడుగు వేసింది. 1999, 2002లో కూడా ఇలాగే నిర్ణయించి ఉపసంహరించుకుంది. వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ ఆధ్వర్యంలో ఏర్పడ్డ అత్యున్నత కమిటీ దీనిపై సమావేశమై, నిర్ధారిత పరిశోధనల కోసం తాత్కాలికంగా ఆ వైరస్‌ను ఉంచుకునేందుకు అనుమతించింది. 2010లో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి నిపుణులతో కమిటీ వేసి పరిశీలించింది. ఆ వైరస్‌ ఉండాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కరోనా వైరస్‌ నేపథ్యంలో వెంటనే మశూచీ వైరస్‌ను ధ్వంసం చేయాలన్న ఒత్తిడి పెరిగింది.

వూహాన్‌ ఉదంతంతో ఆందోళన..
కరోనా చైనాలోని వూహా న్‌లో పుట్టింది. వూహాన్‌ వైరాలజీ ల్యాబ్‌లో చైనానే తయారు చేసిందని చాలా దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. జీవాయుధంగా తయారుచేసే క్రమంలో లీక్‌ అయిందన్న ప్రచా రం జరుగుతోంది. ఇప్పుడు ఈ భయమే కొన్ని దేశాలు అమెరికా, రష్యా వైపు చూసేందుకు కారణమవుతున్నాయి. మశూచీని ఈ రెండు దేశాలు ల్యాబ్‌లలో ఉంచటం వెనుక జీవాయుధం కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కరోనా వైరస్‌ను భద్రపరుస్తాయా?
కరోనా వైరస్‌ సృష్టిస్తున్న ఉత్పాతాన్ని అంతం చేసేందుకు అన్ని ప్రధాన దేశాలు వ్యాక్సిన్‌ తయారీలో తలమునకలయ్యాయి. ఇప్పటికే కొన్ని దేశాలు సానుకూల ఫలితాలు వచ్చినట్లు ప్రకటించి, త్వరలో టీకా అందుబాటులోకి వస్తుందని పేర్కొంటున్నాయి. అయితే ఈ వైరస్‌ సమసిపోయినా, కొన్ని దేశాలు కరోనా వైరస్‌ను భద్రపరిచే అవకాశం కనిపిస్తోంది. ఈ రోగం మళ్లీ భవిష్యత్తులో తిరగబెడితే వ్యాక్సిన్‌ రూపొందించేందుకు వీలుగా వైరస్‌ను కాపాడుకుంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరోనా అన్ని దేశాల్లో ఒకే రకంగా లేదు. తనను తాను మార్చుకుంటోంది. ఒకే వ్యాక్సిన్‌ ఉంటే, మరో రకమైన రూపంలోని వైరస్‌పై ప్రభావం చూపదు. దీంతో వేర్వేరు ప్రాంతాల్లో, వేర్వేరు రూపాల్లో ఉన్న వైరస్‌ను భద్రపరిచే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు