పెద్ద పులిని కాపాడుకుందామా !

3 Mar, 2020 11:17 IST|Sakshi

నేడు ప్రపంచ వన్య ప్రాణుల దినోత్సవం

సాక్షి, నిర్మల్‌ : బెబ్బులిని చూస్తే అడవి భయపడుతుంది. అలాంటి పులి ఇప్పుడు మనిషిని చూసి బెదురుతోంది. జాతీయ జంతువు అన్న భయం.. కనికరం కూడా లేకుండా.. ఎక్కడ కరెంటు షాక్‌ పెట్టి చంపుతాడో.. ఎందులో విషం కలిపి ఉసురు తీస్తాడో.. అని దట్టమైన అడవిలో గుండె దిటవు చేసుకుని బతుకు జీవుడా.. అంటోంది. గత కొన్నేళ్లుగా అడవుల జిల్లాగా పేరుగాంచిన ఉమ్మడి ఆదిలాబాద్‌లో పదుల సంఖ్యలో పులులు వేటగాళ్ల ఉచ్చులకు, స్మగ్లర్ల స్కెచ్‌లకు బలయ్యాయి. 2018 చివరలోనే వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ ఉమ్మడి జిల్లాపై దృష్టిపెట్టి అటవీశాఖ ప్రక్షాళన చేపట్టారు. అప్పటి నుంచి కొంతలో కొంత మార్పు కనిపిస్తోంది. వనంతో వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తున్నారు. నేడు(మార్చి–3) ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా కవ్వాల్‌ పులులపై కథనం.

పెరుగుతున్న పులుల సంఖ్య  
రాష్ట్రంలోని రెండు అభయారణ్యాల్లో ఒకటైన మన కవ్వాల్‌ పులుల అభయారణ్యంలో వాటి సంఖ్య పెరుగుతున్నట్లు కేంద్రం చెబుతోంది. ప్రతీ నాలుగేళ్లకోసారి కేంద్ర అటవీ శాఖ పరిధిలోని నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ(ఎన్‌టీసీఏ) రాష్ట్రాల్లోని పులుల సంఖ్యను లెక్కిస్తుంటుంది. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన వివరాల ప్రకారం తెలంగాణలో 26 పులులు ఉన్నట్లు తేలింది. అప్పటి నుంచి పోలిస్తే వీటి సంఖ్య మరింత పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని కవ్వాల్‌ అభయారణ్యంలో 10–12 పులులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గతంతో పోలిస్తే పెరిగిన పులులను కాపాడేందుకు చర్యలు చేపడుతున్నానీ  చెబుతున్నారు. 

నాలుగేళ్లలో  
నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ(ఎన్‌టీసీఏ) ప్రతి నాలుగేళ్లకోసా పులుల సంఖ్యను వెల్లడిస్తోంది. రాష్ట్రం ఏర్పడ్డాక గతేడాది తొలిసారి ఈ వివరాలు వెల్లడయ్యాయి. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు, టైగర్‌ రిజర్వ్‌లు ఇలా అటవీ ప్రాంతాలన్నింటిలో పులులను అంచనా వేసేందుకు 2018 జూన్‌లో ఓ వారంపాటు అధ్యయనం జరిపారు. పులి పాదాల గుర్తులు, అడవుల్లో పెట్టిన కెమెరాలు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం లెక్కించారు. ఏడాదిపాటు శాస్త్రీయ సర్వే చేసిన తర్వాత వివరాలు వెల్లడించారు. వాటి ప్రకారం.. 2014లో ఉమ్మడి రాష్ట్రంలో పులుల సంఖ్య 68 ఉండగా, అప్పుడు తెలంగాణలో 20 ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని కవ్వాల్‌ అభయారణ్యంలో 3 పులులు ఉన్నట్లు అంచనా వేశారు. ప్రస్తుత లెక్కల ప్రకారం కవ్వాల్‌లో 10–12వరకు పులులు ఉండొచ్చని అటవీ అధికారులు అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.  

గతంలో ఖతం  
కవ్వాల్‌ అభయారణ్యానికి గతంలో వచ్చిన పులి.. వచ్చినట్లే ఖతమైంది. వేటగాళ్ల ఉచ్చులతో, స్మగ్లర్లు వేసిన స్కెచ్‌లతో పెద్దపులులు ప్రాణాలు కోల్పోయాయి. రెండేళ్లక్రితం వరుసగా కవ్వాల్‌ అభయారణ్యంలోని పులులను హతమార్చారు. వైల్డ్‌ లైఫ్‌ క్రైం సెంట్రల్‌ టీమ్‌ సభ్యులు ఇచ్చోడలో పులిచర్మం పట్టుకోవడం అప్పట్లో సంచలనమైంది. ఈ కేసులో కూపీ లాగగా, పెంబి మండలం తాటిగూడకు చెందిన గుగ్లావత్‌ ప్రకాశ్‌ అదే మండలంలోని పుల్గంపాండ్రి అడవుల్లో ఆ పులిని చంపినట్లు తేలింది. పుల్గంపాండ్రి గ్రామానికి చెందిన హలావత్‌ మున్యాతో కలిసి విద్యుత్‌ ఉచ్చుతో పులిని హతమార్చాడు.

మాంసాన్ని కాల్చివేసి, దాని చర్మాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తూ దొరికిపోయాడు. ఆ తర్వాత పాత మంచిర్యాల బీట్‌లో చిరుతను హతమార్చడం, అదే క్రమంలో శివ్వారం బీట్‌లో ఏకంగా రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ను మట్టుబెట్టడం తీవ్ర సంచలనం సృష్టించింది. కవ్వాల్‌ అడవుల్లోకి వచ్చిన పులిని వచ్చినట్లే చంపుతుండటంపై సర్కారు సీరియస్‌ అయ్యింది. ఏకంగా కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌(సీఎఫ్‌)తో పాటు నాలుగు జిల్లాల్లోని పలువురు డీఎఫ్‌ఓలు, ఎఫ్‌ఆర్‌ఓలు, ఎఫ్‌ఎస్‌ఓలు, ఎఫ్‌బీఓలను బదిలీ చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. 

కవ్వాల్‌ ‘గుడ్‌’ 
కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఉమ్మడి జిల్లాలోని నాలుగు అంటే..నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల పరిధిలోకి వస్తోంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో భాగంగా ఉండే కొండలు, దట్టమైన అడవులతో ఉంటుంది. 2012లో కేంద్రంలో దేశంలో 41వ, రాష్ట్రంలో రెండో పులుల అభయారణ్యంగా ప్రకటించింది. దాదాపు 2,020 చదరపు కిలోమీటర్‌ మేర విస్తరించి ఉంది. ఇందులో 897 చ.కిలోమీటర్లు పెద్ద పులి సంచరించే కోర్‌ ఏరియాగా, 1,123 చ. కి. వేటాడే బఫర్‌ ఏరియాగా విభజించారు. తెలంగాణ ఏర్పడక ముందు ఇక్కడ పులులు శాతం చాలా తక్కువ. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మెరుగైన నిర్వహణ పద్ధతులను అవలంబిస్తుండటంతో పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది.

గతంతో పోలిస్తే ఎన్‌టీసీఏ జాబితాలో 60.16 శాతంతో కవ్వాల్‌ రేటింగ్‌ ‘ఫెయిర్‌’నుంచి ‘గుడ్‌’స్థానానికి పెరిగింది. గతంతో పోలిస్తే.. ప్రస్తుతం అనువైన వాతా వరణం కారణంగా క్రమంగా పులుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలు ఫలిస్తున్నాయి. గతంలో కవ్వాల్‌కు వచ్చిన ఒక్క ఫాల్గుణ పులి ఏడు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తిప్పేశ్వర్, తాడోబా తదితర ఏరియాల నుంచి పులులు కవ్వాల్‌ వైపు వస్తున్నాయి.  

‘బచావో’లో భాగంగా  
అడవులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఏళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై బదిలీ వేటు వేసిన సర్కారు వారి స్థానాల్లో కఠినంగా వ్యవహరించే వారిని నియమించింది. ‘జంగిల్‌ బచావో– జంగిల్‌ బడావో’నినాదంతో అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు చేపడుతోంది. సీఎం సీరియస్‌గా ఇచ్చి న ఆదేశాలతో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో సంస్కరణలు కొనసాగుతున్నాయి. అడవులతో పాటు ఇప్పుడు జాతీయ జంతువైన పులిని కూడా రక్షించాల్సిన అవసరం ఉంది.

ఇందులో భాగంగా సీఎఫ్‌ వినోద్‌కుమార్‌ ఆధ్వర్యంలో అభయారణ్యంలో పలు చర్యలు చేపడుతున్నారు. అభయారణ్యంలోకి పులి రాకకు అడ్డంకులుగా మారుతున్న వాటిపై దృష్టిపెట్టారు. నిర్మల్‌ జిల్లా కడెం మండలంలో అభయారణ్యం పరిధిలో ఉన్న రాంపూర్, మైసంపేట్‌ గ్రామాలను మైదాన ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇప్పటికే ఈ గ్రామాల పునరావాసం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.8 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తనవంతు నిధులు ఇవ్వాల్సి ఉంది.  

మరిన్ని వార్తలు