శాంతి సౌధాలు..చారిత్రక సౌరభాలు

25 Dec, 2017 13:10 IST|Sakshi
అబిడ్స్‌: సెయింట్‌ జోసఫ్‌ చర్చి వద్ద యువతుల సెల్ఫీ

క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని చారిత్రక చర్చిలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. సికింద్రాబాద్, అబిడ్స్‌లోని ప్రార్థనాలయాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. ఆదివారం రాత్రి ప్రత్యేక క్రిస్మస్‌ ప్రార్థనల కోసం సిద్ధమైన అబిడ్స్‌లోని సెయింట్‌ జార్జి చర్చి..  

బ్రిటిషర్‌ జార్జి యూలే సతీమణి 1865లో అబిడ్స్‌లో ఈ చర్చిని నిర్మించారు. 1867లో అధికారికంగా ప్రారంభించారు. నిజాం ప్రధాన ఇంజినీర్‌ జార్జి విలియమ్‌ మర్రెట్‌ దీనికి రూపకల్పన చేశారు. నిజాం, బ్రిటిష్‌ రెసిడెన్సీ సిబ్బంది ఇచ్చిన విరాళాలతో ఇది నిర్మితమైంది. ఇలాంటి ఎన్నో చారిత్రక చర్చిలపై ప్రత్యేక కథనం..

గారిసన్‌ వెస్లీ..
1853లో తిరుమలగిరిలో గారిసన్‌ వెస్లీ చర్చి నిర్మాణాన్ని ప్రారంభించగా, 1883లో వినియోగంలోకి వచ్చింది. స్వాతంత్య్రానికి పూర్వం కేవలం ఆర్మీ అధికారుల కుటుంబీకులు మాత్రమే ఇక్కడ ప్రార్థనలు చేసేవారు.   

తొలి రోమన్‌ క్యాథలిక్‌ చర్చి..
సికింద్రాబాద్‌లోని సెయింట్‌ మేరీస్‌ తొలి రోమన్‌ క్యాథలిక్‌ చర్చి. ప్రతిష్టాత్మకంగా భావించే ‘బాసలికా’ హోదా కల్గిన పురాతన చర్చి. 2008లో ఈ గుర్తింపు దక్కింది. ఫాదర్‌ డేనియల్‌ మర్ఫి 1840లో నిర్మాణాన్ని ప్రారంభించగా, 1850లో పూర్తయింది. దీని ఆధ్వర్యంలో సెయింట్‌ ఆన్స్‌ హైస్కూలు కొనసాగుతోంది.

మెథడిస్ట్‌..
మెథడిస్ట్‌ ఎపిస్కోపల్‌ చర్చికి చెందిన మిషనరీస్‌ ఆధ్వర్యంలో 1882లో సికింద్రాబాద్‌లో మెథడిస్ట్‌ చర్చిని నిర్మించారు. దీనిని 2001లో పునర్నిర్మించాక మిలీనియమ్‌ మెథడిస్ట్‌ చర్చిగా నామకరణం చేశారు.

సెయింట్‌ జోసెఫ్‌ క్యాథడ్రల్‌  
సెయింట్‌ జోసెఫ్‌ క్యాథడ్రల్‌ చర్చిని గన్‌ఫౌండ్రీలో నిర్మించేందుకు 1870లో పునాది రాయి వేశారు. ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ నిర్మాణానికి మార్బల్‌ బహూకరించారు. 1891లో దీని నిర్మాణం పూర్తయింది.  

అద్దె రూమ్‌లో ప్రారంభం..  
రాంనగర్‌ డివిజన్‌\ బాకారంలోని వెస్లీ చర్చి 10 మంది భక్తులతో ప్రారంభమైంది. 1930లో ఇంగ్లండ్‌కు చెందిన రెవరెండ్‌ ఈబర్‌ ప్రెస్లీ ఇక్కడ రూమ్‌ అద్దెకు తీసుకొని ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేశాడు. 1938లో ఇంగ్లండ్‌కు చెందిన మెగ్నిల్‌ అదే ప్రాంతంలో చిన్న ఇళ్లులా నిర్మించారు. 1961లో పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం వెయ్యికి పైగా భక్తులు ఇక్కడ ప్రార్థనలు చేసుకునే వీలుంది.  

సేవా విస్తరణ..
గాంధీనగర్‌లోని బాలాజీ ఇంద్రప్రస్థాన్‌ సమీపంలో 1969లో సెయింట్‌ గ్రెగోరియన్‌ చర్చిని నిర్మించారు. కేరళకు చెందిన పరుమళ కొచిర్‌ తిరుమనేని రెవరెండ్‌ జీనన్‌ దీనిని స్థాపించారు. ఇందులో గ్రెగోరియన్‌ ఆర్థటిక్స్‌ స్కూల్‌నూ ఏర్పాటు చేశారు. నగరంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరో నాలుగు చర్చిలు నిర్మించారు.  

పంజాబీ నిర్మించిన హెబ్రోన్‌  
క్రైస్తవ బోధకుడిగా మారిన పంజాబీ భక్తసింగ్‌ 1954లో నగరానికి వచ్చి, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ సమీపంలోని గోల్కొండ క్రాస్‌ రోడ్డులో హెబ్రోన్‌ చర్చిని ఏర్పాటు చేశాడు. తర్వాత దేశవ్యాప్తంగా హెబ్రోన్‌ చర్చిలు వెలిశాయి. భక్తసింగ్, అగస్టిన్, బెంజుమన్‌లు ఇందుకు కీలకంగా పనిచేశారు. ఇక్కడ ప్రతి ఆదివారం అన్నదానం చేస్తారు. క్రిస్మస్‌ ప్రత్యేక ప్రార్థనల్లో సుమారు 5వేల మంది పాల్గొంటారు.

వెస్లీ చర్చి..
సికింద్రాబాద్‌లోని క్లాక్‌టవర్‌ దగ్గర బ్రిటిష్‌ మిషనరీస్‌ రెవరెండ్‌ విలియం బర్గెస్, రెవరెండ్‌ బెంజిమిన్‌ ప్రాట్‌ల ఆధ్వర్యంలో 1916లో వెస్లీ చర్చిని నిర్మించారు. సీఎస్‌ఐ అనుబంధంగా కొనసాగుతోంది.

అతి పురాతనం.. సెయింట్‌ బాప్టిస్టు
జంటనగరాల్లోనే అతి పురాతన చర్చి సికింద్రాబాద్‌లోని సెయింట్‌ బాప్టిస్టు. 1813లో దీనిని నిర్మించారు. 1998లో హెరిటేజ్‌ అవార్డు దక్కించుకుంది. దీనికి అనుబంధంగా స్కూల్, కాలేజీ కొనసాగుతున్నాయి. చర్చి అధీనంలో సుమారు 100 ఎకరాలు ఉండేది. కాలక్రమేణా చాలా వరకు స్థలం అన్యాక్రాంతమైంది.  

ఆర్మీ స్పెషల్‌.. ఆల్‌ సెయింట్స్‌
ఆర్మీ అధికారుల కోసం ప్రత్యేకంగా తిరుమలగిరిలో 1860లో చర్చి ఆఫ్‌ ఇంగ్లండ్‌ ఆధ్వర్యంలో ఆల్‌ సెయింట్స్‌ చర్చిని నిర్మించారు. స్వాతంత్య్రానంతరం సీఎస్‌ఐ (చర్చి ఆఫ్‌ సౌతిండియా) పరిధిలోకి వచ్చింది. తిరుమలగిరిలో ఏర్పాటైన తొలి శాశ్వత కట్టడం ఇదే కావడం గమనార్హం.  

సెయింట్‌ జాన్స్‌
సికింద్రాబాద్‌లోని సెయింట్‌ జాన్స్‌ చర్చికి 200ఏళ్ల చరిత్ర ఉంది. 1813లో దీనిని నిర్మించారు. ఇది 1998లో హెరిటేజ్‌ అవార్డు దక్కించుకుంది.  

సెంటినరీ బాప్టిస్టు  
బాప్టిస్ట్‌ చర్చిగా ప్రసిద్ధి చెందిన సికింద్రాబాద్‌లోని సెంటినరీ బాప్టిస్టు చర్చిని రెవరెండ్‌ డబ్ల్యూడబ్ల్యూ క్యాంప్‌బెల్‌ ఆధ్వర్యంలో 1875లో నిర్మించారు. 1975లో పునర్నిర్మాణం చేపట్టగా 1991లో పూర్తయింది. దీని ఆధ్వర్యంలో జంటనగరాల్లో 35 చర్చిలు కొనసాగుతున్నాయి.  

వందేళ్ల చరిత్ర..  
ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ సమీపంలోని గోల్కొండ క్రాస్‌ రోడ్డులో ఉన్న ఎంబీ చర్చికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. 1898లో మిషనరీస్‌ ఆధ్వర్యంలో ఈబర్ట్‌ దంపతులు మలక్‌పేట్‌లో చర్చి ఏర్పాటు చేశారు. ఇది ప్రస్తుతం మలక్‌పేట్‌ ఏరియా పోలీస్‌ ఆసుపత్రిగా కొనసాగుతోంది. తర్వాత నగరంలో విద్యా, వైద్య సేవలు విస్తరించాలని రెవరెండ్‌ ఫాంక్రాట్స్‌ ఆధ్వర్యంలో 1904లో ఇక్కడి గాంధీనగర్‌లో చర్చి, గోల్కొండ చౌరస్తాలో స్కూల్‌ను ప్రారంభించారు. అయితే 1952లో చర్చిని కూడా గోల్కొండ చౌరస్తాకు తరలించారు.   

లూథరన్‌ చర్చి
1990లో రెవరెండ్‌ సి.ఏసుపాదం లక్డీకాపూల్‌లో కొండపై లూథరన్‌ చర్చికి పునాది వేశారు. ఆంధ్రా ఇవాంజలికల్‌ లూథరన్‌ చర్చి (గుంటూరు) కేంద్రంగా ఇది కొనసాగుతోంది. ఒకేసారి 2వేల మంది ప్రార్థనలు
చేసుకునే విధంగా విశాల ప్రార్థనా మందిరం ఉంది. ఇక్కడ 5వేల మంది భక్తులు సభ్యత్వం తీసుకున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు