ఈ ఐస్‌క్రీం వెరీ కాస్ట్లీ

17 Feb, 2018 09:48 IST|Sakshi

సిటీలో గోల్డెన్‌ ఐస్‌క్రీమ్‌   ధర రూ.1100

భారత్‌లోనే ఖరీదైన ఐస్‌క్రీమ్‌ ఇదే..  

ఈ ఐస్‌క్రీమ్‌ మీరు తిన్నారా.? పోనీ.. దీని గురించి విన్నారా.? ఇది హైదరాబాద్‌ స్పెషల్‌ ఐస్‌క్రీమ్‌. దేశంలో మరెక్కడా లేని గోల్డెన్‌ ఐస్‌క్రీమ్‌. భారత్‌లోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌. ధర ఎంతో తెలుసా.? జస్ట్‌ రూ.1100 మాత్రమే. అంతేనా... దీని పేరు వెనకో పురాణ గాథ దాగుంది. అసలేంటీ ఐస్‌క్రీమ్‌... ఎందుకింత స్పెషల్‌? ‘సాక్షి’ వీకెండ్‌లో... 

సాక్షి, సిటీబ్యూరో  ; వెనీలా, చాక్లెట్, స్ట్రాబెరీ, బటర్‌ స్కాచ్‌... ఇలా చాలా రకాల ఐస్‌క్రీమ్‌లు మీరు తిని ఉంటారు. కానీ.. గోల్డెన్‌ ఐస్‌క్రీమ్‌ తిన్నారా.? భారత్‌లోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌ ఇది అని మీకు తెలుసా.? దీని వెనకో పురాణ గాథ ఉందని ఊహించగలరా? అసలేంటి ఐస్‌క్రీమ్‌ అంటారా.. అదే ‘మైటీ మిదాస్‌.. ది గోల్డెన్‌ ఐస్‌క్రీమ్‌’. బంజారాహిల్స్‌లోని హ్యూబర్‌ అండ్‌ హోలీ రెస్టారెంట్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఐస్‌క్రీమ్‌ ఇది. 

‘పురాతన కాలంలో ‘మిదాస్‌’ అనే అత్యాశ గల ఒక మహారాజు ఎన్నో ఏళ్లు తపస్సు చేయగా, భగవంతుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకొమ్మని అంటాడు. అప్పుడు మహారాజు తాను తాకినదల్లా బంగారమైపోయేలా వరం ఇవ్వాలని కోరుకుంటాడు. తధాస్తు.. అని దీవించి దేవుడు మాయమైపోతాడు. ఆ తర్వాత రాజు సింహాసనాన్ని తాకినా, చెట్లని తాకినా, పండ్లు ఫలహారాలను తాకినా... ఇలా దేన్ని తాకినా బంగారమైపోతాయి. చివరికి తన ప్రాణానికి ప్రాణమైన కూతురు దగ్గరికి ఆప్యాయంగా పలకరిస్తూ రాగా.. పట్టుకోవడంతో చిన్నారి సైతం బంగారు విగ్రహంలా మారిపోతుంది. ఆ రాజు పేరు మీదుగానే ఈ హైదరాబాదీ ఎక్స్‌క్లూజివ్‌ ఐస్‌క్రీమ్‌కు ‘మైటీ మిదాస్‌ గోల్డెన్‌ ఐస్‌క్రీమ్‌’ అని పేరు పెట్టాన’ని చెప్పారు నిర్వాహకులు శ్రీనివాస్‌రెడ్డి.  

సెలబ్రిటీలూ ఫిదా...  
ఇందులో 18 రకాల సీక్రెట్‌ ఇంగ్రిడియంట్స్, మూడు రకాల టాపింగ్స్, రెండు రకాల సాసెస్, ఇంపోర్టెడ్‌ ఫ్రూట్‌ సిరప్స్‌ మాత్రమే కాకుండా 23 క్యారట్‌ ఎడిబుల్‌ గోల్డ్‌ లీఫ్‌ సైతం ఉంటుంది. దీని ధర రూ.1100. ఏడు స్కూప్‌లలో నిండి ఉండే ఈ ఐస్‌క్రీమ్‌ దేశంలోనే అత్యంత ఖరీదైనదని చెప్పారుశ్రీనివాస్‌రెడ్డి. మంచు లక్ష్మి, చార్మి, అనూష్క తదితర సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఈ ఐస్‌క్రీమ్‌కు దాసోహులే. ఇందులోని బంగారు పూతతో రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ముఖంలో తేజస్సు వస్తుందన్నారు.   

సూపర్‌ కాన్సెప్ట్‌...  
నేను ఫుడ్‌ లవర్‌ని. సిటీలో ఏర్పాటు చేసే వెరైటీ ఫుడ్‌ టేస్ట్‌ చేస్తుంటాను. ఇక్కడి గోల్డెన్‌ ఐస్‌క్రీమ్‌ చాలా నచ్చింది. పూర్వం రాజుల కాలంలో బంగారు బిందెలతో నీరుపట్టి తాగేవారని, అలా తాగడంతోనే ఎలాంటి రోగాలు లేకుండా ఎక్కువ కాలం బతికే వారని మా అమ్మమ్మ చెప్పేది. ఇప్పుడు అదే బంగారాన్ని ఐస్‌క్రీమ్‌పై పూతగా వేసి సర్వ్‌ చేయడమనే కాన్సెప్ట్‌ సూపర్బ్‌.    – నిహాల్, మంగళూర్‌  

న్యూ ఫ్లేవర్‌...  
ఐస్‌క్రీమ్స్‌లో అన్ని ఫ్లేవర్స్‌ ట్రై చేస్తుంటాను. ఈ ఫ్లేవర్‌ చాలా కొత్తగా ఉంది. మా ఫ్రెండ్స్‌తో తరచూ ఇక్కడికి వస్తాను. ఒక్క ఐస్‌క్రీమ్‌ని నలుగురం తినొచ్చు. ఈ గోల్డెన్‌ ఐస్‌క్రీమ్‌ ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఆనందానికి ఆనందం. ఇందుకోసమైనా ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేయొచ్చు. 

మరిన్ని వార్తలు