కరోనాపై పోరులో అలుపెరుగని యోధులు

1 Jul, 2020 05:23 IST|Sakshi

మంత్రి ఈటల రాజేందర్‌ నేతృత్వంలో కీలక బృందం

టీంలో డైరెక్టర్, డీఎంఈ, వీసీ ఇతర ఉన్నతాధికారులు

రాష్ట్రంలో వైరస్‌ కట్టడికి రేయింబవళ్లు పనిలో నిమగ్నం

నేడు ‘డాక్టర్స్‌ డే’ సందర్భంగా ప్రత్యేక కథనం

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. తెలంగాణలోనూ ఇప్పటికే పాజిటివ్‌ కేసుల సంఖ్య 16 వేలు దాటగా, 250 మందికిపైగా చనిపోయారు. కరోనా నాలుగు నెలలుగా ప్రజలకు, అధికార యంత్రాంగానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఈ వైరస్‌పై జరుగుతున్న యుద్ధంలో డాక్టర్లు, నర్సులు, ఇతర పారామెడికల్‌ సిబ్బంది ముందుండి పోరాడుతున్నారు. ఈ యుద్ధంలో వారూ వైరస్‌బారిన పడుతున్నారు. తెలంగాణలో వైరస్‌పై జరుగుతున్న యుద్ధంలో ముందుండి పోరాడుతున్న వారియర్స్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ నేతృత్వం వహిస్తుండగా, ఆయన సారథ్యంలో పెద్ద బృందమే పనిచేస్తోంది. బుధవారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఈ బృందం పనితీరుపై కథనం.
– సాక్షి, హైదరాబాద్‌

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ నేతృత్వంలోని ఈ బృందం లో వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, కమిషనర్‌ యోగితారాణా, ప్రజా రోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు, వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్‌ రమేష్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి ఉన్నారు. మంత్రికి నిరంతరం సలహాలిచ్చే ఉన్నతస్థాయి కమిటీ సభ్యులుగా కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి, నిమ్స్‌ నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ గంగాధర్‌ ఉన్నారు. ఈ బృందంలో కీలకస్థానం మంత్రిదే. కరోనా కట్టడి లో మంచైనా, చెడైనా వీరిదే బాధ్యతగా  భావిస్తుంటారు.

ఈటల:  సంధించిన బాణం
కరోనాపై జరుగుతున్న యుద్ధానికి సారథ్యం ఈయనదే. మార్చి నుంచి మొదలైన ఈ యుద్ధంలో ఏనాడూ ఆయన విశ్రాంతి తీసుకోలేదు. అర్ధరాత్రి వరకు సమీక్ష, పర్యవేక్షణ చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ నిర్వహించే సమావేశాలకు హాజరవుతూ, ఆయన ఆదేశాల మేరకు తన బృందానికి దిశానిర్దేశం చేస్తున్నారు. రోజూ ఉదయం ఫోన్‌ లేదా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులనడిగి పరిస్థితి తెలుసుకుంటారు. 

ఎత్తు‘గడల’న్నీ ఈయనవే..
ప్రజారోగ్య సంచాలకుడిగా డాక్టర్‌ గడల శ్రీనివాసరావుది కీలకపాత్ర. వైద్య సిబ్బందిని ముందుండి నడిపించడంలో శ్రీనివాసరావు కృషిపై ప్రశంసలు వస్తున్నాయి. రాష్ట్రస్థాయి నుంచి కిందిస్థాయి వరకు కరోనా కట్టడిలో తన బృందాన్ని నడిపిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే జిల్లా వైద్యాధికారులు పనిచేస్తుంటారు. ఐసోలేషన్‌ సెంటర్ల ఏర్పాటు, క్వారంటైన్‌ కేంద్రాల్లో వసతుల పర్యవేక్షణ, జిల్లాల నుంచి చురుకైన వైద్యులను డిçప్యుటేషన్‌పై రప్పించి పనిచేయించడం చేస్తున్నారు. రోజూ బులెటెన్‌ తయారుచేసేది ఈయనే. ఆయన కిందే రాష్ట్ర కరోనా నోడల్‌ వ్యవస్థ పనిచేస్తుంది. 104, 108కు వచ్చే ఫోన్‌కాల్స్‌పై సమీక్షిస్తారు. సీఎం నిర్వహించే సమావేశాల్లో పాల్గొంటూ క్షేత్రస్థాయి పరిస్థితిని చెబుతుంటారు. ఒకరకంగా చెప్పాలంటే కరోనా కట్టడిలో రథసార«థుల తర్వాత కీలక స్థానంలో ఉన్నారు.

డాక్టర్‌ రమేష్‌రెడ్డి: సంరక్షకుడు
వైద్యవిద్య సంచాలకుడు (డీఎంఈ)గానూ, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌గానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే బోధనాసుపత్రులు నడుస్తుంటాయి. కీలకమైన గాంధీ, ఉస్మానియా, ఫీవర్, నిలోఫర్‌ ఆసుపత్రులు ఈయన పరిధిలోనే ఉంటాయి. రాష్ట్రంలో కరోనా రోగులకు గాంధీ ఆసుపత్రిలోనే చికిత్స జరుగుతోంది. మొదట అక్కడే పరీక్షలు నిర్వహించేవారు. అనేకమంది కరోనా రోగులకు చికిత్స అందించి వారిని సురక్షితంగా పంపించడంలో రమేష్‌రెడ్డిది కీలకపాత్ర.

మంత్రికి వెన్నుదన్ను వీరిద్దరు..
కరోనా కట్టడికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి కమిటీలో వీరు సభ్యులు. డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌. డాక్టర్‌ గంగాధర్‌ నిమ్స్‌లో నెఫ్రాలజీ అధిపతి. జాతీయంగా, అంతర్జాతీయంగా కరోనాపై వచ్చే సమాచారాన్ని క్రోడీకరించి, విధాన నిర్ణయాలు తీసుకోవడంలో మంత్రికి సూచనలిస్తుంటారు. ఒకరకంగా వీరు మంత్రికి వెన్నెముకలాంటి వారు.

చంద్రశేఖర్‌రెడ్డి: సాధనాసంపత్తి
టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యుద్ధంలో సైన్యానికి అవసరమైన ఆయుధ సామగ్రి అందించే మాదిరి.. కరోనాపై పోరులో అవసరమైన వైద్య పరికరాలు, మాస్క్‌లు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, మందుల సరఫరాలో ఈయనే కీలకం. నామినేషన్‌ పద్ధతిలో వైద్య మౌలిక సదుపాయాల కల్పన, టిమ్స్‌ను సిద్ధం చేయడం తదితర విషయాల్లో ముందున్నారని వైద్యవర్గాలు చెబుతున్నాయి.

ఇద్దరూ ఇద్దరే
వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ యోగితారాణా.. ఇద్దరూ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు. వైద్య ఆరోగ్య యంత్రాం గాన్ని నడిపించాల్సిన కీలక బాధ్యత వారిదే. మంత్రి ఈట ల తర్వాత వీరే కీలకం. శాంతి కుమారి విధాన నిర్ణయాల్లో భాగస్వామిగా ఉంటున్నారు. సీఎంకు అవసరమైన నివేదికలు ఇస్తుంటారు. యోగితారాణాæ కమిషనర్‌గా తన సిబ్బందికి ఆదేశాలిస్తూ పనిచేయిస్తుంటారు.

పర్‌ఫెక్ట్‌ టీం
కరోనా సృష్టించిన ఉత్పాత పరిస్థితుల్లో  తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల ఆధ్వర్యంలోని బృందం తీసుకున్న విధాన నిర్ణయాలు మరువలేనివి. తెలంగాణలో ప్రతి 5,500 మంది జనాభాకు ఒక ప్రభుత్వ వైద్యుడు ఉన్నారు. వీరు సాధారణ విధులతో పాటు ప్రస్తుతం కరోనా భారాన్ని మోస్తున్నారు. ఈ రథసారథుల తోడ్పాటుతోనే డాక్టర్లుగా మేం ఈ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంటున్నాం. డాక్టర్ల దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది కరోనాపై పోరుసల్పడంలో డాక్టర్లంతా కృషిచేస్తున్నారు.     
– డాక్టర్‌ కిరణ్‌ మాదల, అసోసియేట్‌ ప్రొఫెసర్, నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీ

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా