మన ఫ్లైఓవర్లు పదిలమేనా?

5 Jul, 2018 11:24 IST|Sakshi

ముంబై అంధేరి ఘటనతో ఉలిక్కిపడుతున్న నగర ప్రజలు  

సాక్షి,సిటీబ్యూరో: ముంబై అంధేరి స్టేషన్‌లోని బ్రిడ్జి కూలిన ఘటనతో నగరంలోని ఫ్లై ఓవర్లు, బ్రిడ్జిల పటిష్టత, భద్రత అంశం నగరంలో చర్చనీయాంశంగా మారింది. జీహెచ్‌ఎంసీలో 30కి పైగా ఫ్లై ఓవర్లున్నాయి. వీటిని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలు నిర్మించాయి. ఆ తర్వాత మాత్రం నిర్వహణను మరచిపోవడంతో వీటిల్లో నాలుగైందింటి పరిస్థితి దారుణంగా ఉందని, తక్షణ మరమ్మతులవసరమని ఇంజినీర్లు భావిస్తున్నారు. వీటికి మరమ్మతులవసరమని దాదాపు ఐదేళ్ల క్రితమే గుర్తించినప్పటికీ ఇప్పటి వరకు పనులు చేపట్టలేదు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. వర్షాకాలానికి ముందు, తర్వాత కూడా ఫ్లై ఓవర్ల స్థితిగతులను పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేయాల్సి ఉండగా, నగరంలో ఆ పని జరగడం లేదు. నగరంలో నిర్మించిన ఫ్లై ఓవర్లలో ఇప్పటివరకు ఒక్క డబీర్‌పురా ఫ్లై ఓవర్‌కు మాత్రం పూర్తిస్థాయి మరమ్మతులు చేశారు. ప్రస్తుతం లాలాపేట్‌ ఫ్లై ఓవర్‌ మరమ్మతులు  జరుగుతున్నాయి.

దాదాపు రూ.5.8 కోట్లతో  నెలన్నర క్రితం చేపట్టిన  పనులు పూర్తయ్యేందుకు మరో నాలుగైదునెలల సమయం పట్టనుంది. ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌కు నాలుగేళ్ల క్రితం స్వల్ప మరమ్మతులు మాత్రం చేశారు. పూర్తి మర్మతులు చేయకపోవడంతో ప్రస్తుతం దాంతోపాటు తెలుగుతల్లి, హఫీజ్‌పేట, మాసాబ్‌ట్యాంక్‌ ఫ్లై ఓవర్లకు కూడా మరమ్మతులు అవసరమని ఇంజినీర్లు భావిస్తున్నారు. నగరంలో ట్రాఫిక్‌ మళ్లింపు, తదితర కారణాలతో ఎప్పటికప్పుడు ఈ మరమ్మతు పనుల్ని వాయిదా వేస్తున్నారు. సాధారణంగా ఫ్లై ఓవర్లలోని గర్డర్స్‌ ప్రాంతాల్లో కాంక్రీట్‌ దెబ్బతింటుంది. బేరింగులు అరిగిపోతాయి. ఎక్స్‌పాన్షన్‌ జాయింట్స్‌ వదులై బలహీనంగా మారుతుంది. స్తంభాల పైభాగాలు(పయర్‌ క్యాప్స్‌) తుప్పుపడుతాయి. బాక్స్‌గర్డర్స్‌ ఏటవాలు గోడల్లో పగుళ్లు ఏర్పడుతాయి. నిర్ణీత వ్యవధుల్లో వీటికి మరమ్మతులు చేయాల్సి ఉన్నప్పటికీ ఆపని జరగడం లేదు. ఒక్కో ఫ్లై ఓవర్‌కు దాదాపు 15–20 స్పాన్‌లుంటాయి. వాటిల్లో ఉండే బేరింగ్‌లను జాకీలు ఏర్పాటుచేసి మార్చాల్సి ఉంటుంది.

వాస్తవానికి వీటి నిర్వహణ బాధ్యతలు చూడటంతోపాటు నిర్ణీత వ్యవధుల్లో తగిన మరమ్మతులు చేపట్టేందుకు స్పెషల్‌ డివిజన్‌ ఉండాలి. కానీ నగరంలో అది లేదు. జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్‌ విభాగానికి ఉన్నబోలెడు పనులతో వీటిపై దృష్టి సారించే పరిస్థితి లేదు.  ఏ సంస్థ నిర్మించిన ఫ్లై ఓవర్ల మరమ్మతుల్ని ఆ సంస్థే చేయాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు. దాదాపు 15 సంవత్సరాల వరకు మరమ్మతులు చేసే అవసరం రాకున్నా..15 ఏళ్ల తర్వాత మాత్రం తప్పనిసరిగా పరిశీలించి పనులు చేయాలని ఇంజినీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. నగరంలోని ఫ్లై ఓవర్లలో దాదాపు పది ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చి దాదాపు ఇరవయ్యేళ్లు అవుతోంది. అలాంటి  వాటిల్లో  బేగంపేట, బషీర్‌బాగ్, తార్నాక, హరిహరకళాభవన్, సీటీఓ,  మాసాబ్‌ట్యాంక్‌ తదతరమైనవి ఉన్నాయి. వీటన్నింటిని కూడా పరిశీలించి మరమ్మతులు చేయాల్సి ఉంది. ఫ్లై ఓవర్లపై పడే గుంతల్ని పూడ్చేందుకు పైపొరలుగా కోటింగ్స్‌ వేస్తూ పోతుండటంతో  కొన్ని ఫ్లై ఓవర్ల మందం  ఎంతో ఎత్తు పెరిగిపోయింది. దీని వల్ల కూడా ఫ్లై ఓవర్లు ప్రమాదకరంగా మారే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. నగరంలోని ఫ్లై ఓవర్లకు మరమ్మతులు చేపట్టే యోచనలో ఉన్నామని,  పెరిగిన మందాన్ని పూర్తిగా తొలగించే ఆలోచన కూడా ఉందని అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రమాదాలు జరగక ముందే మరమ్మతులు చేయాల్సిన అవసరముంది.

మరిన్ని వార్తలు