ఎక్కడికి పోతావు చిన్నవాడా!

20 Sep, 2019 04:42 IST|Sakshi

ఆకతాయిలు వారి నిఘా దాటి పోలేరు

ఐదున్నరేళ్లలో  2,500 కేసులు, 5,500 పెట్టీ కేసులు

సాక్షి, హైదరాబాద్‌: ‘చెరపకురా చెడేవు..’అనేది నానుడి. ‘ఏడిపించకురా ఏడిచేవు..’అన్నది ’న్యూ’నుడి. ఆడపిల్లలను వేధించే పోకిరీలకు షీ టీమ్స్‌ పరోక్షంగా ఇచ్చే సందేశం ఇదే. మఫ్టీలో సేఫ్టీ.. పెట్టీ కేసులు.. ఆనక ‘పిడి’కిలి.. ఇదీ షీటీమ్స్‌ వ్యూహం. మహిళారక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీ–టీమ్స్‌ నిఘా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. 2014లో హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ‘షీ–టీమ్స్‌’మంచి ఫలితాలు ఇస్తున్నాయి. మహిళలు, బాలికలు, యువతులు, విద్యార్థినులను వేధిస్తున్న ఘటనలపై 100కు డయల్, ఫోన్, వాట్సాప్, సోషల్‌ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదులకు నిమిషాల్లోనే స్పందిస్తున్నాయి. షీటీమ్స్‌ను క్రమంగా తెలంగాణలోని 33 జిల్లాలకు విజయవంతంగా విస్తరించారు. తొలిసారి తెలిసీ తెలియకుండా ఆడవారిని వేధించేవారిని హెచ్చరించి, కౌన్సెలింగ్‌ ఇచ్చి విడిచిపెడతారు. కావాలని ఏడిపించినవారిపై పెట్టీ కేసులు పెడుతున్నారు. మరింత తీవ్రమైన నేరం చేస్తే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కోర్టుకు పంపుతున్నారు. పదేపదే నేరాలను పునరావృతం చేసినవారిపై ప్రివెంటివ్‌ డిటెన్షన్‌(పి.డి.)యాక్ట్‌ అమలుకు సిద్ధమవుతున్నారు. కేసుల రికార్డు నిర్వహణకు షీ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు.  ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో సరి్టఫికెట్‌ కోర్సు కూడా నిర్వహిస్తున్నాయి.

నివారణమార్గాలు వెతుకుతున్నాం
ఆడవారిని ఏడిపించడం, ఇబ్బంది పెట్టడం అనే దానిని కేవలం సామాజిక సమస్యగానే కాదు, మానసిక, ఆరి్థక, సాంస్కృతిక కోణాల్లోనూ పరిగణిస్తున్నాం. సమస్య తలెత్తాక స్పందించడం కంటే నివారణ మార్గాలు వెతుకుతున్నాం. పకడ్బందీ నిఘావ్యవస్థను ఏర్పాటు చేశాం. ఎన్జీవోలు, మానసిక నిపుణులతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. 
– స్వాతి లక్రా, ఐజీ, విమెన్‌ సేఫ్టీ వింగ్‌ 

నిమిషాల్లో వాలిపోతాం
33 జిల్లాల్లో మా బృందాలు చాలా యాక్టివ్‌గా ఉన్నాయి. ఆడవారిని ఏడిపించాలనుకున్న వారు ఎక్కడున్నా.. మా నిఘాను దాటిపోలేరు. కేసు నమోదు దగ్గర నుంచి నిందితులకు శిక్ష పడేంత వరకు నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది.– సుమతి, ఎస్పీ(సీఐడీ), విమెన్‌ సేఫ్టీ వింగ్‌ 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు