గురితప్పని షూటర్‌ కొండపల్లి శ్రియారెడ్డి .. 

13 Sep, 2019 09:59 IST|Sakshi
షూటింగ్‌ చేస్తున్న దృశ్యం; శిక్షకుడు శ్యామ్‌సుందర్‌తో కొండపల్లి శ్రియారెడ్డి

రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహమతుల కైవసం

తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్న చిన్నారి

సాక్షి, ఖమ్మం:  కృషి.. పట్టుదల.. తల్లిదండ్రుల ప్రోత్సాహం.. మెరుగైన శిక్షణ.. ఉంటే చాలు ఎంతటి ఉన్నత శిఖరాలైన ఆధిరోహించవచ్చని నిరూపిస్తోందీ బాలిక. పాఠశాలలో నేర్చుకున్న ఎన్‌సీసీ శిక్షణ ద్వారానే సత్తా చాటుతోంది. రాష్ట్ర, జాతీయస్థాయిలో పతకాలు సాధిస్తోంది.

నగరంలోని హార్వెస్ట్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న కె.శ్రియారెడ్డి షూటింగ్‌లో ప్రతిభ చూపుతోంది. గతేడాది నుంచి ఎన్‌సీసీలో శిక్షణ పొందిన బాలిక ఎన్‌సీసీ కేడెట్లకు గౌరవప్రదమైన రిపబ్లిక్‌ పరేడ్‌కు ఎంపికైంది. 45 రోజుల పాటు వివిధ అంశాల్లో శిక్షణ పొందింది. ప్రతిభ చాటి 2019 జనవరి 26వ తేదీన ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్‌ డే పరేడ్‌లో రాష్ట్రంనుంచి ఎంపికైంది. శ్రియారెడ్డి ప్రతిభను గమనించిన ఎన్‌సీసీ అధికారులు షూటింగ్‌లో శిక్షణ పొందితే బాగుంటుందని సూచించారు. దీంతో శ్రియా తల్లిదండ్రులు కొండపల్లి రవీందర్‌రెడ్డి, చైతన్యరెడ్డిలు హైదరాబాద్‌లోని సెంట్రల్‌ యూనివర్సిటీలో గల షూటింగ్‌ రేంజ్‌లో దాదాపు నాలుగు నెలలపాటు కె.శ్యామ్‌సుందర్‌ వద్ద శిక్షణ ఇప్పించారు.

30–50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌పొజిషన్‌లో శిక్షణ పొందిన శ్రియా అనతికాలంలోనే 50 మీటర్ల విభాగంలో రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ మహిళల కేటగిరీ రైఫిల్‌ ప్రోన్‌పొజిషన్‌లో 518 పాయింట్లతో తృతీయస్థానం సాధించింది. రాష్ట్రస్థాయిలో కాంస్య పతకం దక్కించుకుంది. దక్షిణ భారత రైఫిల్‌ షూటింగ్‌ పోటీలకు అర్హత సాధించింది. గత ఆగస్టు 23 నుంచి 30వ తేదీ వరకు జరిగిన 11వ సౌత్‌ జోన్‌ రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో రాష్ట్ర జట్టు నుంచి ప్రాతినిధ్యం వహించింది. మెరుగైన ప్రతిభ చాటి ఐదో స్థానం దక్కించుకుంది. 50 రైఫిల్‌ ప్రోన్‌పొజిషన్‌లో మొదటిస్థానంలో నిలిచిన బాలిక 570 పాయింట్లు సాధించగా కొండపల్లి శ్రియారెడ్డి 563 పాయింట్లు కైవసం చేసుకుని ఐదో స్థానంలో నిలవడం విశేషం.  

శ్రియారెడ్డి సోదరుడు కూడా..  
చెల్లి రైఫిల్‌ షూటింగ్‌లో సత్తా చాటుతుంటే అన్న కొండపల్లి నీరజ్‌రెడ్డి రాష్ట్రస్థాయి రైఫిల్‌ షూటింగ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందేందుకు నిరంతరం సాధన చేస్తున్నాడు. ఓపెన్‌ జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఈ నెల 16నుంచి 23వ తేదీ వరకు గుజరాత్‌ రాష్ట్రంలో అహ్మదాబాద్‌లో జరిగే జాతీయస్థాయి రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో పాల్గొననున్నాడు. నీరజ్‌రెడ్డి 25 మీటర్ల సెంటర్‌ ఫైర్‌ పిస్టల్‌ విభాగంలో ప్రాక్టీస్‌ చేస్తున్నాడు.

అంతర్జాతీయ టోర్నీలో పాల్గొంటా  
జాతీయస్థాయి రైఫిల్‌ షూటింగ్‌లో సత్తా చాటి అంతర్జాతీయస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. రాష్ట్రానికి మరిన్ని పతకాలు తెచ్చేందుకు కృషి చేస్తా. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే జాతీయస్థాయిలో రాణిస్తున్నా.  
–కొండపల్లి శ్రియారెడ్డి

మరిన్ని వార్తలు