కార్మికులకు భద్రత ఏది..?

1 May, 2019 07:27 IST|Sakshi

నగరానికి ఏటా  పెరుగుతున్న కార్మికుల వలస

అమలు కాని కార్మిక చట్టాలు

నేటికీ అందని సంక్షేమ ఫలాలు

మేడే సందర్భంగా ప్రత్యేక కథనం

కార్మికుల శ్రమకు తగ్గ ఫలితమే కాదు.. కనీస భద్రత లేకుండా పోయింది. ప్రపంచ కార్మికుల పండుగ మే డే వస్తోంది.. పోతోంది. ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. కానీ కార్మికుల బతుకుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఉపాధి, భద్రత కలగానే మిగులుతోంది. కండల్ని కరిగించినా కనీస వేతనం వారికి దక్కడం లేదు. సమాన వేతనాలు.. క్రమబద్ధమైన పనివేళలు..వారంతపు సెలవులు ఇలాంటివి నేటికీ వారికి అందని ద్రాక్షగానే  మిగిలాయి. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ నేపథ్యంలో కార్మిక హక్కులు కనుమరుగవుతున్నాయి. లక్షలాది మంది కార్మికుల ఉపాధికి గండిపడుతోంది.కార్మిక దినోత్సవం‘మే’ సందర్భంగా ప్రత్యేక కథనం

సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్‌ మహానగరం కార్మికులకు అడ్డాగా మారింది. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉపాధి కోసం క్యూ కడుతున్నారు. గుండు సూది నుంచి క్షిపణిలో ఉపయోగించే పరికరాల వరకు ఉత్పత్తిలో హైదరాబాద్‌ పరిశ్రమలు ఖ్యాతి గాంచాయి. నగరానికి వలస వచ్చే ప్రతి ఒక్కరికి ఇక్కడ పని లభిస్తోంది. ఉపాధి దోరుకుతుంది. కానీ, శ్రమశక్తి మాత్రం దోపిడీకి గురవుతోంది. మహానగర పరిధిలో చిన్న, మధ్య తరహా  పరిశ్రమలు సుమారు 45 వేలు ఉంటాయన్న అంచనా. ప్రధానంగా నగర పరిధిలో సనత్‌నగర్, అజామాబాద్, చందూలాల్‌ బారాదరి పారిశ్రామిక వాడలు ఉండగా, రంగారెడ్డి జిల్లా నగర శివారులో ఉప్పల్, మౌలాలి, జీడిమెట్ల, కాటేదాన్, నాచారం, గాంధీనగర్, బాలనగర్, వనస్ధలిపురంలలో పారిశ్రామికవాడలో వివిధ  పరిశ్రమల్లో పెద్ద ఎత్తున కార్మికులు పనిచేస్తున్నారు. మరోవైపు భవన నిర్మాణ రంగంలో ఒడిషా, బిహార్, కర్ణాటక నుంచి కార్మికుల వలుసలు పెరిగాయి. నగర ‡పరిధిలోని హైదరాబాద్‌–రంగారెడ్డి–మేడ్చల్‌ జిల్లా పరిధిలో పరిశ్రమల్లో  రెండు లక్షలకుపైగా పైగా కార్మికులు ఉండగా,  షాపులు, ఇతరాత్ర వ్యాపార సంస్ధల్లో పనిచేస్తున్న వారు సుమారు ఐదారు లక్షల వరకూ ఉంటారన్నది అంచనా.  

నైపుణ్య సిబ్బంది కొరత..
 విశ్వ నగరంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలి వస్తుండటంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నా.. నైపుణ్యం కలిగిన శ్రామికుల లేమి ఆందోళన కలిగిస్తోంది. నైపుణ్యత పెంచుకుంటే తప్ప ఉపాధి లభించే అవకాశాలు  కానరావడం లేదు. ప్రస్తుత అవçసరమైన  డిమాండ్‌ను బట్టి నైపుణ్యత కలిగి సిబ్బంది 40 శాతం మించిలేనట్లు జాతీయ నైపుణ్య అభివృద్ధి మిషన్‌ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.  మహా నగరంలోని వివిధ పరిశ్రమలు,వృత్తుల్లో నైపుణ్యత కలిగిన సిబ్బంది 2.97 లక్షల మంది అవసరం. అయితే నైపుణ్యత సాధించిన సిబ్బంది 1.20 లక్షలకు మించి లేరు.  అంటే 1.77 లక్షల మంది నైపుణ్యత కలిగిన సిబ్బంది కొరత ఉన్నట్లు స్పష్టమవుతోంది.  

నైపుణ్యం లేనివారిలో పోటీ..
నైపుణ్యత లేని పనుల్లో ఉపాధి అవకాశాలకు పోటీ పెరిగింది. నిపుణులకు సహాయకులకుగా అన్‌స్కిల్‌ సిబ్బంది అధికంగా ఉన్నారు. నైపుణ్యత లేని కార్మికులు మాత్రం ఐదున్నర లక్షల వరకు ఉంటారు. నిర్మాణ రంగం, పర్యాటకం, హోటల్, అతిథ్యం, రావాణ, ప్యాకేజింగ్, ఐటీ సంబంధిత  బ్యాకింగ్, ఆర్థికం, వైద్యం, విద్య, స్థిరాస్తి, పన్నులు, ఇతర సేవలు, ఆహార శుద్ధి, ఫార్మ, రబ్బర్, ప్లాస్టిక్, ఆటో మైబెల్, చేనేత, కాగిత ఉత్పత్తుల్లో అధికంగా ఉపాధి పొందుతున్నారు.

కార్మిక సంక్షేమం
కార్మిక శాఖ భవన నిర్మాణ కార్మికుల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు ప్రభుత్వం ఇచ్చే ఫీజులు, ఉపకార వేతనాలకు తోడుగా ఐఐటీ, ఎంబీబీఎస్‌తో పాటు, సివిల్స్‌ మెయిన్స్‌కు ఎంపికైన వారికి కూడా సంక్షేమ బోర్డు  గ్రాంటును అందిస్తోంది. ప్రసూతి, అంత్యక్రియలకు ఆర్థిక సాయం, కార్మికుల మృతదేహం స్వగ్రామానికి  తరలించడానికి రవాణా ఖర్చు, ప్రమాద భీమా, ఎక్స్‌గ్రేషియా వంటివి అమలు చేస్తోంది. సంక్షేమ పథకాలు కార్మికులకు అందని దాక్షగానే మారాయి.

మరిన్ని వార్తలు