-

చుక్‌ చుక్‌  బండి వచ్చింది!

15 Mar, 2019 00:21 IST|Sakshi

మళ్లీ ఆన్‌ అయిన నిజాం రైల్వే తొలితరం ఇంజన్‌.. రైల్‌ నిలయం ఎదుట నిత్యం కనువిందు

‘సర్‌ అలెక్‌’ ఇంజన్‌ను తీర్చిదిద్దిన రైల్వే.. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు ప్రత్యేక ఏర్పాటు

కూ.. చుక్‌.. చుక్‌.. అంటూ గంభీరమైన శబ్దం.. దిక్కులు పిక్కటిల్లేలా కూత.. పొగమంచు కమ్మిన అనుభూతి కలిగించేలా ఆవిరి.. దట్టమైన నల్లటి పొగ.. రైలుబండి అసలు స్వరూపమిదే కదా. కానీ ఆధునిక రైలింజన్లలో ఆ శబ్దం మారింది.. పొగ మాయమైంది.. ఆవిరి ఊసే లేదు.. కానీ సాయంత్రం 6తర్వాత సికింద్రాబాద్‌ సంగీత్‌ చౌరస్తా నుంచి మెట్టుగూడ వైపు వెళ్తుంటే అలనాటి రైలు కూత, ఇంజన్‌ శబ్దం, ఆవిరి, పొగ.. అన్నింటినీ ఆస్వాదించవచ్చు. వందేళ్ల కింద పట్టాలపై పరుగు లెట్టిన రైలింజన్‌ దర్జాగా కొలువుదీరి.. అప్పటి ‘రైలు అనుభూతి’ని సాక్షాత్కరిస్తోంది.    – సాక్షి, హైదరాబాద్‌ 

దర్జాగా  ‘సర్‌ అలెక్‌’ ఇంజన్‌..
నిజాం స్టేట్‌ రైల్వేలో తొలితరం రైలింజనే ‘సర్‌ అలెక్‌’లోకోమోటివ్‌. ఇంగ్లండ్‌కు చెందిన ‘కిట్సన్‌ అండ్‌ కొ’దీన్ని 1907లో రూపొందించింది. నిజాం స్టేట్‌ రైల్వేలో భాగంగా సికింద్రాబాద్‌ నుంచి వాడీ మధ్య ప్రారం భమైన తొలి మార్గంలో ఈ ఇం జన్‌ పరుగుపెట్టింది. బార్సీ లైట్‌ రైల్వే న్యారో గేజ్‌ సిస్టంలో దీన్ని విని యోగించారు. ఆ తర్వాత భారతీయ రైల్వేలో ఇది విలీనమైంది. కొన్ని దశాబ్దాల సేవల అనంతరం దీన్ని రైల్వే సర్వీసుల నుంచి ఉప సంహరించారు. ఆ తర్వాత షెడ్డుకు పరిమిత మైంది. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ ఆవిర్భవించాక దాని కేంద్ర కార్యాలయం రైల్‌ నిలయం ఎదుట ఆకర్షణగా దీన్ని ఏర్పాటు చేశారు.దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌గా నాలుగేళ్ల కింద పనిచేసిన రవీంద్ర గుప్తా దానికి పెయింట్‌ వేయించి అందంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు అది పట్టాలపై పరుగుపెట్టే అనుభూతి కలిగించేలా మార్చారు.సాంకేతిక సమస్యలు సరిదిద్ది ఇంజన్‌ ఆన్‌ అయ్యేలా చేశారు. ముందువైపు  నక్షత్రం పైన ఉండే భారీ లైటు వెలగటం, ఆ తర్వాత తొలితరం ఇంజన్‌ శబ్దం, కూత మొదలు కావటం, ఆ వెంటనే ఆవిరి, పొగ రావడం.. ఒక్కసారిగా కొన్ని దశాబ్దాల కిందటి రైలును కళ్లారా చూసినట్లే అనిపిస్తుంది. సాయంత్రం 6 గంటల నుంచి 9 వరకు ఈ ఇంజన్‌ పనిచేసేలా కృత్రిమ ఏర్పాటు చేశారు.

ట్రామ్‌ ఇంజన్‌ కూడా సిద్ధం..
హైదరాబాద్‌లో ట్రామ్‌ రైలు తిరిగిందనే విషయం కొద్దిమందికే తెలుసు. నిజాం సాక్షిగా రోడ్లపై పరుగుపెట్టిన ట్రామ్‌ తాలూకు ఇంజన్‌ కూడా ఇప్పుడు దర్జా ఒలకబోస్తోంది. జాన్‌ మోరిస్‌ ఫైర్‌ ఇంజన్‌గా పిలుకునే ఇది పట్టాలపై కాకుండా రోడ్డుపై పరుగుపెట్టేది. దీనికి బస్సు తరహాలో సాధారణ టైర్లే ఉంటాయి. 1914లో రూపొందిన ఈ ఇంజన్‌కు విఖ్యాత ష్రాస్‌బరీ అండ్‌ చాలెంజర్‌ కంపెనీ ఒరిజినల్‌ టైర్లు వాడారు. ఈ టైర్లు వాడిన ట్రామ్‌ ఇంజన్‌ ఇదే కావటం విశేషం. లాలాగూడ వర్క్‌ షెడ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ఈ ఇంజన్‌కు నాటి ఒరిజినల్‌ విడిభాగాలన్నీ అలాగే ఉన్నాయి. ఇటీవలే దాన్ని పూర్తిస్థాయిలోమరమ్మతు చేసి రంగులతో ముస్తాబు చేశారు. ఇటీవల జరిగిన రైల్వే వింటేజ్‌ ర్యాలీలో హొయలు ఒలకబోసి మొదటి బహుమతి గెలుచుకుంది. 1886లో తయారైన చెక్క బోగీలు, 1970 నాటి మీటర్‌ గేజ్‌ బోగీ, 1920లో బర్మింగ్‌హామ్‌ అండ్‌ వ్యాగన్‌ కంపెనీ సిద్ధం చేసిన బీజీ వ్యాగన్, 1925లో తయారైన 83 కిలోల బరువున్న ఇత్తడి ఫైర్‌ అలారమ్‌ బెల్‌ ఉన్నాయి. కాగా, వీటన్నింటినీ ప్రజలు వీక్షించే వీలు ఉంది. కానీ అందుకు ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది. 

అది మన వారసత్వ సంపద  దక్షిణ మధ్య రైల్వే
‘మన రైల్వే ప్రారంభమైన సమయంలో ప్రజలకు సేవలందించిన ఇంజన్లు, బోగీలు, ఇతర వస్తువులను వారసత్వ ఆస్తిగా భావిస్తాం. ప్రపం చంలోనే గొప్ప రైల్వేగా ఉన్న భారతీయ రైల్వే సేవలకు ఇవి గుర్తులు.అందుకే వాటిని కాపాడి భావి తరానికి చూపేం దుకు ఈ ఏర్పాటు చేశాం.’
– సీహెచ్‌ రాకేశ్, సీపీఆర్‌ఓ  

మరిన్ని వార్తలు