హ్యాట్రిక్‌ వీరులు!

3 Nov, 2018 14:27 IST|Sakshi

వరుసగా మూడుసార్లు గెలిచిన ఏడుగురు నేతలు

ఇప్పటి వరకు ఆయనదే రికార్డు

 చంద్రశేఖర్‌ వరుసగా ఐదుసార్లు అసెంబ్లీకి.. 

 మాణిక్‌రావు, ఇంద్రారెడ్డి, హరీశ్వర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి నాలుగుసార్లు గెలుపు 

 లక్ష్మీనరసయ్య, టి.దేవేందర్‌గౌడ్‌ మూడు పర్యాయాలు విజయం 

సాక్షి, రంగారెడ్డి జిల్లా  : ఆ నేతలు ఒక్కసారి కాదు..రెండుసార్లు కాదు.. ఏకంగా ఐదు, నాలుగు, మూడుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ బరిలో ఒక్కసారి నెగ్గడమే కొందరికి మహాకష్టం. అటువంటిది ఈ నేతలు వరుసగా మూడుసార్లు శాసనసభలో అడుగుపెట్టి తమ సత్తా చాటారు. మరికొందరు ఐదు, నాలుగుసార్లు కూడా నెగ్గి ప్రజాసేవలో తరించారు. జిల్లా పరిధిలో హ్యాట్రిక్‌ ఘనత ఏడుగురు నేతలకు దక్కింది. ఈ జాబితాలో వికారాబాద్‌కు చెందిన ఎ.చంద్రశేఖర్‌ అందరి కంటే ముందు ఉన్నారు. ఏకంగా వరుసగా ఐదుసార్లు విజయదుందుభి మోగించి రికార్డులకెక్కారు.   

మేడ్చల్‌లో దేవేంద్రుడు 
టీడీపీ సీనియర్‌ నేత తూళ్ల దేవేందర్‌గౌడ్‌ మూడు వరుస విజయాలు నమోదు చేశారు. మేడ్చల్‌ సెగ్మెంట్‌ నుంచి 1994, 1999, 2004 ఎన్నికల్లో విజయదుందుభి మోగించారు. ఈ స్థానం నుంచి మూడుసార్లు బరిలో నిలిచిన ఆయన.. ఒక్కసారి కూడా ఓటమి ఎరుగలేదు. 1962 మినహా 1952 నుంచి 1983 వరకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గెలిచారు. 1985లో టీడీపీ ఖాతా తెరిచింది. కాంగ్రెస్‌ అభ్యర్థి జి.సంజీవరెడ్డిపై కె.సురేంద్రరెడ్డి విజయం సాధించారు. ఈ తదుపరి నుంచి మూ డుసార్లు దేవేందర్‌గౌడ్‌ నెగ్గారు. ఆయన 2008లో టీడీపీని వీడారు. ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి నవ తెలంగాణ పార్టీ (ఎన్‌టీపీ)ని స్థాపించారు. అనతి కాలంలోనే ఎన్‌టీపీని.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేశారు. ఈ పార్టీ గుర్తుపై ఒకేసారి మ ల్కాజిగిరి పార్లమెంట్, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానానికి పోటీచేసి రెండు చోట్లా పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం ఆయన టీడీపీలో కొనసాగుతున్నారు.  

లక్ష్మీనరసయ్యది తొలి హ్యాట్రిక్‌ 
ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ నేత ఎంఎన్‌ లక్ష్మీనరసయ్య హ్యాట్రిక్‌ సాధించారు. 1957 నుంచి 1967 ఎన్నిక వరకు ఆయనకు తిరుగులేదు. వరుసగా మూడుసార్లు భారీమెజార్టీతో విజయం సాధించారు. 1957లో పీడీఎఫ్‌ అభ్యర్థిపై నె గ్గారు. ఆ తర్వాత 1962, 1967 లో స్వతంత్ర అభ్యర్థులు కేపీ.రెడ్డి, డి.మోహన్‌రెడ్డిపై గెలిచా రు. ఉమ్మడి జిల్లా పరిధిలో తొలిసారిగాహ్యాట్రిక్‌ విజయం నమోదు చేసింది ఈయనే.  

విజ‘ఇంద్రుడు’ 
చేవేళ్ల నియోజవర్గం నుంచి పట్లోళ్ల ఇంద్రారెడ్డి సరికొత్త రికార్డును సృష్టించారు. పార్టీ మారినా వరుసగా నాలుగుసార్లు విజయకేతనం ఎగురవేశారు. 1985 నుంచి 1999 వరకు విజయ పరంపర కొనసాగింది. 1983లో ఆయన తొలిసారిగా లోక్‌దళ్‌ పార్టీ నుంచి అసెంబ్లీకి పోటీచేసి ఇందిరా కాంగ్రెస్‌ అభ్యర్థి కె.లక్ష్మారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన ఆయన 1985 నుంచి 1994 వరకు కాంగ్రెస్‌ అభ్యర్థులను చిత్తు చేసి వరుస విజయాలు సాధించారు. ఈ సమయంలో హోంశాఖతో పాటు పలు మంత్రి పదవులు నిర్వహించారు. ఆ తర్వాత టీడీపీలో సంక్షోభం నెలకొనడంతో ఆ పార్టీని వీడిన ఇంద్రారెడ్డి 1999 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచారు. 

ఎదురులేని హరీశ్వర్‌రెడ్డి.. 
కె.హరీశ్వర్‌రెడ్డి పరిగి నియోజకవర్గంలో వరుసగా నాలుగుసార్లు విజయఢంకా మోగించారు. ఆ సెగ్మెంట్‌లో తొలిసారిగా కాంగ్రెసేతర పార్టీ అభ్యర్థి గెలుపొందడం హరీశ్వర్‌ రెడ్డితోనే మొదలైంది. 1994 నుంచి 2009 వరకు వరుస విజయాలు నమోదు చేశారు. రెండుసార్లు కాంగ్రెస్‌ తరఫున, ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన కమతం రామిరెడ్డిపైనే నెగ్గారు. చివరిసారిగా 2009లో ఇండిపెండెంట్‌ అభ్యర్థి టి.రాంమోహన్‌రెడ్డిపై ఘన విజయం పొందారు. అంతకుముందు 1985 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి షరీఫ్‌పై గెలిచారు. పరిగి నియోజకవర్గానికి మొత్తం 14 సార్లు ఎన్నికలు జరగగా.. ఐదుసార్లు హరీశ్వర్‌రెడ్డి విజయం సాధించడం విశేషం.  

మాణిక్‌ విజయ పరంపర.. 
తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎం.మాణిక్‌రావు కూడా విజయ పరంపర సాగించారు. వరుసగా నాలుగుసార్లు అసెంబ్లీలో అడుగుపెట్టిన ఘనత ఈయ న సొంతం. 1969లో జరిగిన ఉప ఎన్నిక మొదలు.. 1983 ఎన్నికల వరకు ఈయనదే విజయం. 1983లో రాష్ట్రమంతటా ఎన్టీఆర్‌ గాలి వీచినా ఇక్కడ మాణిక్‌రావు గెలుపును అడ్డుకోలేకపోయారు. 1972లో ఏకగ్రీవంగా ఎన్నికై రికా ర్డుల కెక్కారు. మిగిలిన మూడు ఎన్నికల్లో ప్రత్యర్థులపై భారీమెజార్టీ సాధించారు. పీవీ నర్సింహారావు, టి.అంజయ్య, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, భవనం వెంకట్రామిరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జల గం వెంగళరావు మంత్రివర్గాల్లో 14 ఏళ్లపాటు మంత్రిగా సేవలందించారు. రెం డు దఫాలుగా ఎమ్మెల్సీగా కొనసాగారు. 1969లో జరిగిన తొలి విడత తెలంగాణ ఉద్యమంలో కీలక పా త్ర పోషించిన మాణిక్‌రావు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవించారు. 1959లో తాండూరు పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై రాజకీయ ప్రవేశం చేసి న మాణిక్‌.. 2016లో భౌతికంగా దూరమయ్యారు.  

జయ‘కేతనం’ 
రాజకీయ దురంధరుడు, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి కల్వకుర్తి సెగ్మెంట్‌ నుంచి వరుసగా నాలుగుసార్లు జయకేతనం ఎగురవేశారు. తొలి రెండుసార్లు కాంగ్రెస్‌ తరఫున, ఆ తర్వాత రెండుసార్లు జనతా పార్టీ నుంచి గెలిచారు. 1969లో జరిగిన ఉప ఎన్నిక ద్వారా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన.. 1983 ఎన్నికల వరకు క్రమం తప్పకుండా విజయాలు నమో దు చేశారు. దీంతో పాటు నాలుగుసార్లు లోక్‌సభకు, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయారు. 2009లో చేవెళ్ల పార్లమెంట్‌ సభ్యుడిగా విజయం సాధించారు. కేంద్ర సమాచార, సాంస్కృతిక శాఖ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు.  

శేఖరుని జైత్రయాత్ర 
వికారాబాద్‌లో ఎ.చంద్రశేఖర్‌ జైత్రయాత్ర సాగించారు. ఈ సెగ్మెంట్‌ నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సరికొత్త రికార్డును సృష్టించారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా పరిధిలో ఈయన మినహా.. మరెవరూ ఐదుసార్లు గెలిచిన దాఖలాలు లేవు. 1985 నుంచి 2004 వరకు వికారాబాద్‌ సెగ్మెంట్‌లో ఓటర్లు ఇతరులకు అవకాశం ఇవ్వకపోవడం విశేషం. 23 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేయడం అరుదైన విషయంగా చెప్పవచ్చు. 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో ఇద్దరు చొప్పున కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు, ఇండిపెండెంట్లను ఓడించి శాసనసభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత పార్టీ మారిన ఆయన 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి బి.మధురవేణిపై నెగ్గారు. ఆ తర్వాత తెలంగాణ వ్యూహంలో భాగంగా 2008లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2009 ఎన్నికల్లోనూ పోటీచేసినప్పటికీ కాంగ్రెస్‌ అభ్యర్థి జి.ప్రసాద్‌కుమార్‌ చేతిలో ఓటమిని చవిచూశారు. 


 

మరిన్ని వార్తలు