ఇలా చేద్దాం...!

12 Dec, 2017 04:17 IST|Sakshi

తెలుగు భాషది ఎంతో గొప్ప చరిత్ర.. ప్రాచీన హోదా ఉంది. భాషా వైభవం ఇదని, మరే ఇతర ప్రపంచ భాషకూ తీసిపోని సంపూర్ణత్వం తెలుగు భాషకుందని చాటి చెప్పాలి. స్ఫూర్తి పంచాలి. కానీ, అది మాత్రమే సరిపోదు. ప్రభుత్వాలు ఈ నిజాన్ని గ్రహించాలి. భాషను భద్రంగా భవిష్యత్తరాలకు అందించాలంటే.... తెలుగు జాతికి ఒక నమ్మకం కలిగించాలి. తెలుగును నేర్చుకోవడం వల్ల, తెలుగే మాధ్యమంగా పిల్లలకు ప్రాథమిక విద్యాభ్యాసం చేయించడం వల్ల పూర్ణవికాసం సాధ్యమనే విశ్వాసం కలిగించాలి.

ఇంగ్లీషు మాధ్యమంగా ప్రాథమిక విద్య నేర్చిన వారి కన్నా తెలుగులో చదివితే ఏ విధంగాను నష్టపోము అన్న భరోసా తల్లిదండ్రులకు, సమకాలీన సమాజానికి కల్పించాలి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన అన్ని దేశాలూ మాతృభాషలోనే ప్రాథమిక విద్యనేర్పడం వల్ల అంతటి సృజన పరిఢవిల్లుతోందని శాస్త్రీయ పరిశోధనల్లో వెల్లడైన విషయాల్ని తెలియపరచాలి. అది సాకారం కావడానికి అవసరమైన వనరుల అందుబాటు, సాధన సంపత్తి సమకూర్చడం, ప్రోత్సాహకాలివ్వడం వంటివి ప్రభుత్వం నిరంతరం చేయాలి. ఇవి కొరవడటం వల్లే నమ్మకం సన్నగిల్లి అత్యధికులు తమ పిల్లలను తెలుగుకు దూరం చేస్తున్నారు.

ఇంగ్లీషులో పెంచుతున్నారు. తెలుగుపై ప్రేమ, అభిమానం ఉండీ... ఇంగ్లీషుతోనే భవిష్యత్తు అనుకుంటున్నారు. తెలుగు లేకపోయినా ఒరిగే నష్టం ఏమీ ఉండదని భావిస్తున్నారు. తెలుగు గొప్పతనం తెలియక కాదు. తెలుగుకింత వైభవముందని గ్రహించక కాదు. తెలుగులో తగిన సాంకేతిక సమాచారం లభించదు, పుస్తకాలుండవు, తర్జుమాలు–అనువాదాలు సరిగ్గా జరుగవు, పారిభాషిక పదకోశాలు దొరకవు, పరిశోధనలు లేవు. ఆధునికమైన ఏ అంశమూ తెలుగు భాషలో లభించదు... ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికి నమ్మకం కలుగుతుంది? ఆ నమ్మకం పెంచే కృషి నిరంతరం జరగాలి.
.
.: దిలీప్‌రెడ్డి

మరిన్ని వార్తలు