తెలంగాణ నుంచి బయలుదేరిన రెండో రైలు

5 May, 2020 08:21 IST|Sakshi

సాక్షి హైదరాబాద్: లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెలంగాణ నుంచి వలస కార్మికులతో రెండో ప్రత్యేక రైలు బయలు దేరింది. 1250 మంది కార్మికులతో ఘట్‌కేసర్ నుంచి పట్నాకు మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల 20 నిమిషాలకు శ్రామిక్‌ ప్రత్యేక రైలు బయలుదేరినట్టు అధికారులు వెల్లడించారు. మేడ్చల్ కలెక్టర్‌తో పాటు రాచకొండ సీపీ, నోడల్ అధికారి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని బిహార్ కార్మికులను గుర్తించి ప్రత్యేక రైలులో వారిని పంపించారు. గత రెండు రోజుల నుంచి వివిధ పోలీసు స్టేషన్లలో పేర్లు నమోదు చేసుకున్న వారిని పంపించినట్టు అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం లింగంపల్లి నుంచి జార్ఖండ్‌లోని హతియాకు ప్రత్యేక రైలులో 1225 వలస కూలీలను తరలించిన సంగతి తెలిసిందే.

కాగా, తెలంగాణ నోడల్ అధికారి సందీప్ సుల్తానీయతో రైల్వే జీఎం గజానన్ మాల్యా ఈ ఉదయం భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు శ్రామిక్ ప్రత్యేక రైళ్లు నడపడంపై చర్చలు జరపనున్నారు. ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ షెల్టర్స్, పోలీసు స్టేషన్లలో, ప్రభుత్వ సమాచార కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న వలస కార్మికుల వివరాల ఆధారంగా కార్యాచరణ చేపట్టనున్నారు. రేపటి నుంచి పూర్తిస్థాయిలో వలస కార్మికులను తరలించే అవకాశముందని సమాచారం. (బోయిన్‌పల్లి టు కాకినాడ.. ఓ తండ్రి పయనం)

మరిన్ని వార్తలు