‘గిరిజనులకు’ ప్రత్యేక శిక్షణా కేంద్రాలు

14 Jun, 2018 01:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గిరిజన విద్యార్థుల్లోని ప్రతిభ, మేధో సంపత్తిని వెలికి తీసేందుకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు గిరిజనాభివృద్ధి, సాంస్కృతిక మంత్రి అజ్మీరా చందూలాల్‌ తెలిపారు. ఐఐటీ, ఎన్‌ఐటీ, నీట్‌ వంటి జాతీయ సంస్థల్లో ప్రవేశం పొందిన గిరిజన విద్యా సంస్థల విద్యార్థులను బుధవారం సచివాలయంలో మంత్రి సత్కరించారు. ప్రతిష్టాత్మకమైన జాతీయ సంస్థల్లో గిరిజన విద్యార్థులు ప్రవేశం పొందేలా ఉన్నత పాఠశాల స్థాయి నుంచే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

గత విద్యా సంవత్సరంలో 47 మంది విద్యార్థులు ఐఐటీ, ఎన్‌ఐటీ, మెడికల్‌ పరీక్షల్లో ప్రవేశం పొందగా, ఇటీవల జరిగిన ఐఐటీ పరీక్షల్లో ఎస్టీ కేటగిరీలో వందలోపు మూడు ర్యాంకులను సాధించడం గొప్ప విషయమన్నారు. 24 మంది గిరిజన విద్యార్థులు నీట్‌ పరీక్షలో మంచి ర్యాంకును సాధించి డాక్టర్లు కాబోతున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఖమ్మం, వరంగల్‌ కేంద్రాల్లో పాఠశాల ఎక్స్‌లెన్సీ కేంద్రాలున్నాయని, భవిష్యత్తులో పాత జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఇతర దేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

>
మరిన్ని వార్తలు