మీదే బాధ్యత

3 Apr, 2020 07:58 IST|Sakshi

ఐసోలేషన్‌ నుంచి అంత్యక్రియల దాకా..

‘కరోనా’ మృతదేహాల నిర్వహణ తప్పనిసరి

మార్చురీ, అంబులెన్స్, శ్మశాన వాటికల సిబ్బంది ప్రత్యేక శిక్షణ, రక్షణ చర్యలు తీసుకోవాలి   

ఆదేశాలు జారీ చేసిన మున్సిపల్‌ పరిపాలన శాఖ

సాక్షి, సిటీబ్యూరో:  కరోనా వ్యాధితో కాని, వైరస్‌ అనుమానంతో కాని మరణించిన వారి మృతదేహాలకు సాధారణ పద్ధతుల్లో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం లేదు. వ్యాధి నిర్ధారణ అయ్యే వరకు క్వారంటైన్లలో ఉంచుతుండగా,  కరోనా లక్షణాలతో, లేదా నిర్ధారణ అయ్యాక చికిత్స పొందుతూ మరణిస్తే.. ఐసోలేషన్‌ వార్డు నుంచి శ్మశానవాటికలో అంత్యక్రియల నిర్వహించేవరకు కొన్ని జాగ్రత్త చర్యలు పాటించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి ఆదేశాలు జారీ చేసింది. ఆయా మార్గదర్శకాల ప్రకారం ఐసోలేషన్‌ వార్డులు, మార్చురీ, అంబులెన్స్, శ్మశాన వాటికల్లో విధులు నిర్వహించే సిబ్బంది దాకా అందరూ ప్రత్యేక శిక్షణ తీసుకోవడంతో పాటు ప్రత్యేక రక్షణ చర్యలు పాటించాల్సి ఉంటుంది. 

ఇవి తప్పని సరి..  
అంటువ్యాధుల నియంత్రణ పద్ధతుల్ని వైద్య సిబ్బంది తప్పక పాటించాలి. చేతుల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) వినియోగించాలి. ఇందులో భాగంగా ఆప్రాన్, గ్లౌజ్స్, మాస్కు, కళ్లజోడు వంటివి తప్పనిసరిగా వాడాలి. మృతదేహంతోపాటు పేషెంట్‌ వినియోగించిన  దుప్పటి, పరికరాలు తదితరాలను 1 శాతం హైపోక్లోరైట్‌ ద్రావణంతో శుభ్రం చేయాలి. బయోమెడికల్‌ వేస్ట్‌  నిబంధనల్ని పాటించాలి.  శవ పరీక్షలు నిర్వహించరాదు. ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వహించినా, ప్రత్యేక నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. 

లీక్‌ ప్రూఫ్‌ ప్లాస్టిక్‌ బ్యాగ్‌..
మృతదేహాన్ని లీక్‌ ప్రూఫ్‌ ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో ఉంచాలి. బ్యాగ్‌ వెలుపలి భాగాన్ని కూడా ఒక శాతం  హైపో క్లోరైట్‌తో శుభ్రం చేయాలి. బాడీ బ్యాగ్‌ను మార్చురీ షీట్‌తో లేదా కుటుంబ సభ్యులు తెచ్చిన షీట్‌లో కాని చుట్టి బంధువులకు అప్పగించాలి. శ్మశాన వాటికకు తరలించిన అనంతరం సదరు  వాహనాన్ని కూడా ఒక శాతం సోడియం హైపో క్లోరైట్‌ ద్రావణంతో శుభ్రం చేయాలి. శ్మశాన వాటికలో అంత్యక్రియల సందర్భంగా ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. ముఖం వద్ద బాడీబ్యాగ్‌ జిప్‌ను తెరిచి సంబంధికులు కడసారి చూసేందుకు అనుమతించవచ్చు. శరీరాన్ని తాకకుండా మతపరమైన  ప్రార్థనలు చివరి కర్మలకు అనుమతించవచ్చు. స్నానం చేయించడం, ఆలింగనం, చుంబనం వంటివి నిషిద్ధం.

అంత్యక్రియల అనంతరం శ్మశానవాటిక సిబ్బందితోపాటు బంధువులు చేతులు శుభ్రం చేసుకోవడం తదితర రక్షణ చర్యలు పాటించాలి. చివరి కర్మల కోసం బూడిద సేకరించవచ్చు. సామాజిక దూరం పాటిస్తూ ఎక్కువమంది గుమికూడకుండా చూడాలి. కుటుంబ సభ్యుల మనోభావాల్ని గౌరవించడంతో పాటు పాటించాల్సిన పద్ధతులపై వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వాలి.  ఐసొలేషన్‌ రూమ్‌ నుంచి తరలించే ముందు రోగి కుటుంబ సభ్యులు  చూడాలనుకుంటే తగిన ప్రామాణికాలు పాటించాలి. ఐసోలేషన్‌ ప్రాంతంలోని అన్ని ఉపరితలాల్ని (ఫ్లోర్స్, బెడ్, రెయిలింగులు, సైడ్‌ టేబుళ్లు , ట్రాలీ, స్టాండ్స్‌ తదితరాలను సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంతో శుభ్రం చేయాలి. మార్చురీలో నిర్వహణకు  ప్రత్యేక ప్రమాణాలు పాటించాలి. మృతదేహాన్ని దాదాపు 4 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద  కోల్డ్‌ చాంబర్లలో ఉంచాలి. మృతదేహాన్ని  ఎంబామింగ్‌కు అనుమతించరాదు.  జీహెచ్‌ఎంసీ పరిధిలో మరణించిన వారి మృతదేహాల నిర్వహణకు ఎనిమిది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. 

మరిన్ని వార్తలు