కార్మికుల కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్

1 Dec, 2014 01:36 IST|Sakshi
కార్మికుల కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్
  •  కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ
  • హైదరాబాద్: దేశంలోని అన్నిరంగాల కార్మికులను ఒకే వేదికపైకి తెచ్చేందుకు ప్రత్యేకంగా వెబ్ పోర్టల్ ప్రారంభించి వారికి, సంక్షేమ కార్యక్రమాలను నేరుగా అందించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని గ్రాండ్ మినర్వా హోటల్‌లో యూనియన్ ఫర్ ఐటీ ప్రొఫెషనల్స్(యునైట్స్) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

    కొత్త వెబ్ పోర్టల్‌కు కార్మికుల వివరాలు, ఆధార్ కార్డు నంబర్‌ను అనుసంధానించనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. హైదరాబాద్ నగరంలోని 2వేల సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో 10లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని అన్నారు. వీరంతా పరస్పరం ఆలోచనలు పంచుకుని మంచి ఫలితాలతో దేశ పురోభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. ఏపీ సర్కిల్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ బీవీ సుధాకర్ మాట్లాడుతూ దేశంలో 1.65 లక్షల పోస్టాఫీసులతో తమ శాఖ విస్తృత సేవలందిస్తోందని చెప్పారు.

    త్వరలోనే ప్రారంభం కానున్న కొత్త పథకాల ద్వారా 325 రకాల సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని వివరించారు. డెబిట్, క్రెడిట్ కార్డు సేవలను ప్రారంభించనున్నామని చెప్పారు. ఐటీ రంగంలో ఉద్యోగ భద్రత, ఆరోగ్యం, సరైన వేతనాలు తదితర అంశాలపై తమ సంస్థ పని చేస్తుందని యునైట్స్ ప్రధాన కార్యదర్శి కార్తీక్ శేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా యునైట్స్ కవర్ పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి, రీజినల్ సెక్రటరీ క్రిష్టోఫర్, పోస్టల్ సీనియర్ సూపరింటెండెంట్ శిల్ప తదితరులు పాల్గొన్నారు.
     
    జమ్మూ, కశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ వైపే ముస్లింలు

    జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో అక్కడి ముస్లింలు బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు.  ఆదివారం దత్తాత్రేయ హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో పార్టీ మైనారిటీ మోర్చా వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హజ్ యాత్రికుల కోసం మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదులో ముస్లింలను ఎక్కువ సంఖ్యలో పార్టీలో చేర్పించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కార్యకర్తలకు సూచించారు. గజల్ గాయకుడు పండిట్ విఠల్‌రావును పద్మశ్రీ పురస్కారానికి సిఫారసు చేయాలని పార్టీ మైనారిటీ మోర్చా అధ్యక్ష ఉపాధ్యక్షులు హనీఫ్ అలీ, అబ్దుల్ వహీద్ కేంద్ర మంత్రి దత్తాత్రేయను కోరారు.
     

మరిన్ని వార్తలు