తప్పుల సవరణకు అవకాశం

14 Dec, 2019 13:21 IST|Sakshi
కళాశాలకు వెళ్తున్న విద్యార్థులు (ఫైల్‌)

ఇంటర్‌ విద్యార్థులహాల్‌టికెట్లలో లోపాలసవరణకు ప్రత్యేక వెబ్‌సైట్‌  

ఈనెల 15వరకు అవకాశం

ఉమ్మడి పాలమూరుజిల్లాలో 35వేల మందిఇంటర్‌ విద్యార్థులు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై తెలంగాణ ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది. పరీక్షలు రాసే విద్యార్థులకు ఏ విషయంలోను ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా విద్యార్థుల హాల్‌టికెట్లలో జరిగే లోపాల సవరణకు ్టటbజ్ఛీ.ఛిజజ.జౌఠి.జీn వెబ్‌సైట్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. సైట్‌లోకి వెళ్లి తమ హాల్‌టికెట్‌లో తప్పులు ఏవైనా ఉంటే.. వాటిని సరి చూసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. లోపాల సవరణకు ఆదివారం వరకు మాత్రమే వెబ్‌సైట్‌ను అందుబాటులో ఉంచనున్నారు. ముఖ్యంగా గత సంవత్సరం ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో నెలకొన్న గందరగోళంలో అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో తప్పులు మరో సారి పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది  ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా మొత్తం 35,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 

తప్పొప్పుల సవరణ ఇలా..
ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు బోర్డు సూచించిన వెబ్‌సైట్‌లోని వెళ్లి పదో తరగతి హాల్‌టికెట్‌ నంబర్‌తో ప్రథమ సంవత్సరం హాల్‌టికెట్‌ సరిచూసుకోవచ్చు. ఇక రెండో సంవత్సరం విద్యార్థులు ఇంటర్‌ మొదటి సంవత్సరం హాల్‌టికెట్‌ నంబర్‌తో హాల్‌టికెట్‌ను సరిచూసుకునేందుకు బోర్డు వెసులుబాటు కల్పిస్తుంది. ఆన్‌లైన్‌లో వచ్చిన హాల్‌టికెట్‌లో విద్యార్థి పేరు, తండ్రి, తల్లిపేరు, గ్రూప్, మీడియం, సెకండ్‌ లాంగ్వేజ్, పీహెచ్‌ కేటగిరి, సబ్జెక్టులు కట్టిన పరీక్ష ఫీజు వంటి తçప్పులు ఏవైనా ఉంటే వెంటనే విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్‌ దృష్టికి తీసుకెళ్లాలి. ప్రిన్సిపాల్‌ కళాశాల లాగిన్‌లోకి వెళ్లి తప్పుల వివరాలను ఉన్నతాధికారులకు వివేదిస్తారు. ఈనెల 15వరకు బోర్డు అధికారులు తప్పుల వివరాలను సేకరించి, తర్వాత వాటిని సరిచేస్తారు. ఈ క్రమంలో అధికారులు తీసుకున్న చర్యల వల్ల హాల్‌టికెట్‌ల్లో తప్పులు ఉంటే విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు ప్రశాంతంగా రాసేందుకు అవకాశం ఉంది. 

దృష్టి సారించని విద్యార్థులు
ఇదిలాఉండగా, ఇంటర్మీడియెట్‌ బోర్డు పరీక్షలకు ముందే హాల్‌టికెట్లు, వాటిపై వివరాలను సరిచూసుకునేందుకు, తప్పొప్పులను సరిచేసేందుకు ఈ అవకాశం ఇవ్వగా.. విద్యార్థులు మాత్రం అంతగా ఆసక్తి చూపడంలేదు.  ఏవైనా తప్పులు ఉన్నట్లయితే సరిచేసుకోని యెడల పరీక్షల అనంతరం సర్టిఫికెట్‌పై సైతం అవే తప్పులు అచ్చయ్యే అవకాశం ఉంది. గతంలో ఇలా  జరగగా.. ఇప్పటికీ చాలా మంది విద్యార్థులు తప్పుల సవరణ కోసం ఇంటర్‌ బోర్డు చుట్టూ నెలల తరబడి తిరుగుతున్న సంఘటనలు ఉన్నాయి.  విద్యార్థులు ముందుకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.  

విద్యార్థులు సరిచూసుకోవాలి
జిల్లాలోని వివిధ ఇంటర్మీడియెట్‌ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు తప్పకుండా తమ హాల్‌టికెట్, వివరాలు సరిచూసుకుని తప్పులు ఏవైనా ఉంటే వెంటనే కళాశాల ప్రిన్సిపాల్‌కు సమాచారం ఇవ్వాలి. వాటిని సరిచేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒకవేళ తర్వాత తప్పులు వస్తే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.  – వెంక్యానాయక్, జిల్లాఇంటర్మీడియెట్‌ శాఖ అధికారి,మహబూబ్‌నగర్‌

మరిన్ని వార్తలు