ఏక్‌ ‘నిరంజన్‌’..!

16 Feb, 2019 11:01 IST|Sakshi

రెండు నెలల ఉత్కంఠకు తెర 

మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసిన సీఎం 

ఉమ్మడి జిల్లా నుంచి ఒకరికే చోటు దక్కే అవకాశం 

వనపర్తి ఎమ్మెల్యేపైనే అందరి దృష్టి 

సాక్షి, వనపర్తి: ఎట్టకేలకు తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. దీంతో రెండు నెలలకు పైగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లయింది. సీఎం కేసీఆర్‌ శుక్రవారం గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి మంత్రివర్గ విస్తరణపై చర్చించడంతో పాటు ఈనెల 19న మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే, మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకుంటారో ఇంకా తేలకున్నా.. కేవలం 10 మందికి మాత్రమే అవకాశం కల్పించనున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే, ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి గెలిచిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది మంత్రి పదవులు ఆశిస్తున్నట్లు తెలుస్తుండగా జాబితాలో ఎవరి పేరు ఉంటుందనేది సస్పెన్స్‌గా మారింది. 

సింగిరెడ్డి ఖాయం !? 
వనపర్తి ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి మంత్రి పదవి దక్కడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఇదే ప్రచారం సాగుతుండగా.. తొలి విస్తరణలో పది మందికే స్థానం కల్పించనున్నట్లు తెలుస్తుండడంతో ఆయన ఒక్కరికే పదవి దక్కుతుందని చెప్పొచ్చు. ఇక గత ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డికి ప్రస్తుత కేబినెట్‌లో చోటు దక్కుతుందా, లేదా అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడవగా కేసీఆర్‌ కేబినెట్‌లో కేవలం హోంమంత్రిగా మహమూద్‌ అలీ ఒక్కరికే అవకాశం కల్పించారు. రెండో సారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌.. మంత్రివర్గ విస్తరణపై రేపు, మాపంటూ ప్రచారం జరిగినా సీఎం కేసీఆర్‌ మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తాజాగా కేసీఆర్‌ గవర్నర్‌ను కలిసి మంత్రివర్గ విస్తరణపై చర్చించడంతో సస్పెన్స్‌ తొలిగిపోయినా మంత్రులుగా ఎవరికి అవకాశం దక్కుతుందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. 

ఆశావాహులు అధికం 
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 13 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలిచారు. కొల్లాపూర్‌ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాత్రమే ఓడిపోయిన విషయం విదితమే. దీంతో మంత్రి పదవి రేసులో జూపల్లి లేనట్లయింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వనపర్తి, నాగర్‌ కర్నూల్, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ 50 వేల పైచిలుకు భారీ మెజార్టీ సాధించారు. దీంతో మంత్రి పదవుల ఆశించే వారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో పాటు సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటే మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ పేర్లు ఎక్కువగా వినిపించాయి.  

విధేయుడికే అవకాశం 
2001 సంవత్సరంలో కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ను స్థాపించిన నాటి నుంచి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఆయనకు విధేయుడిగా కొనసాగుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గులాబీ జెండాను ముందుగా భుజాన వేసుకుంది ఆయనే. పార్టీ బలోపేతం కోసం విశేష కృషి చేశారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ వెంట నడిచిన ఆయన 2014 ఎన్నికల్లో స్వల్ఫ తేడాతో ఓడిపోయారు. లేదంటే టీఆర్‌ఎస్‌ మొదటి ప్రభుత్వంలోనే నిరంజన్‌ రెడ్డికి చోటు దక్కేది. అయితే, కేసీఆర్‌కు విధేయుడు కావడంతో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించి కేబీనేట్‌ హోదా కల్పించాడు. ఈ సందర్భంగా ఆయన మంత్రుల నియోజకవర్గాలకు ఏ మాత్రం తగ్గకుండా నిధులను రాబట్టి పలు అభివృద్ధి పనులను పూర్తి చేయించారు. దీంతో 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 51 వేల మెజార్టీతో ఆయన గెలుపొందారు. దీంతో ఈసారి ఆయనను మంత్రి పదవి వరించే అవకాశం ఎక్కువగా ఉంది.  

ఆ తర్వాత మరొకరికి.. 
ఈసారి మంత్రివర్గ విస్తరణలో కేవలం పది మందికే అవకాశం కల్పించి పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత జరిగే మలి విడత మంత్రివర్గ విస్తరణలో ఇంకొందరికి స్థానం కల్పిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ప్రస్తుతం సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి మాత్రమే మంత్రిగా అవకాశం కల్పిస్తారని సమాచారం. ఆ తర్వాత మరో విడతలో మాజీ మంత్రి లక్షారెడ్డితో పాటు ఇతరుల పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.   

మరిన్ని వార్తలు