ఆధ్యాత్మిక శోభ

29 Jun, 2014 00:01 IST|Sakshi
ఆధ్యాత్మిక శోభ
  •  జంట పండుగలతో అలరారనున్న మహానగరం
  •   ఓవైపు బోనాలు, మరోవైపు పవిత్ర రంజాన్ ప్రార్థనలు
  •   నేడు గోల్కొండ కోటలో బోనాలు
  •   మతసామరస్యం వెల్లివిరిసేలా నెలరోజుల పండుగలు
  • సాక్షి, సిటీబ్యూరో: జంట పండుగల వేళ మహానగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మతసామరస్యం వెల్లివిరిసేలా అన్ని వర్గాల వారు భక్తిపూర్వకంగా జరుపుకొనే పండుగలివి. భిన్న సంస్కృతుల మధ్య ఐక్యతకు చాటే సమయమిది. ఓ వైపు ఆనందం ఉట్టిపడేలా జరుపుకొనే ఆషాఢం బోనాల జాతర.. మరోవైపు ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే పవిత్ర రంజాన్ ప్రార్థనలు ఒకేసారి రావడంతో నగరం ప్రత్యేకంగా ముస్తాబైంది.

    ఆషాఢంలో అమ్మవారి బోనాలు, పోతరాజుల నృత్యాలు విశేషంగా ఆకట్టుకోనున్నాయి. ఆషాఢ మాసం ప్రవేశించడంతో ఆదివారం భక్తజనసందోహం నడుమ గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వందల ఏళ్లుగా భక్తుల ఆరాధ్యదైవంగా, కొంగుబంగారంగా వెలుగొందుతోన్న జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకోనున్నారు.

    ఓ వైపు బోనమెత్తుకొని బారులు తీరే మహిళలు, మరోవైపు గుగ్గిలం, మైసాక్షిల పరిమళాలు, పోతరాజుల విన్యాసాలు అమ్మవారిని వేనోల్లా కీర్తిస్తూ ఆలపించే పాటలతో నగరం పులకించిపోనుంది. గోల్కొండలో ప్రారంభమయ్యే జాతర వరుసగా పాతబస్తీ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, ఆ తరువాత నగరంలోని అన్ని ప్రాంతాల్లో జరిగే ఉత్సవాలతో నెల పాటు కొనసాగుతుంది.
     
    మరోవైపు రంజాన్ ప్రార్థనలు..


    మరోవైపు ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసం కూడా  ప్రారంభమవుతుంది. ఇది కూడా నెల పాటు కొనసాగనుంది. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు అల్లాను ఆరాధిస్తూ, ఉపవాసాలతో మసీదుల్లో ప్రార్థనలు చేస్తుంటారు. ప్రతి ఇంట్లోనూ ఆధ్యాత్మిక వాతావరణమే నెలకొంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటిల్లిపాది కఠోరమైన ఉపవాసదీక్షలు పాటిస్తారు. అన్ని వర్గాలతో కలిసి ఇఫ్తార్ విందుల్లో పాల్గొంటారు. పేద ముస్లింలను ఆదుకునేందుకు అందజేసే ఆర్థిక సహాయం రంజాన్ మాసంలోని గొప్పతనాన్ని ఆవిష్కరించనుంది.
     
    వరుస పండుగలు...


    ఆషాఢం తరువాత శ్రావణంలోనూ వరుగా పండుగలే వస్తున్నాయి. శ్రావణమాసం కూడా పవిత్రమైంది. ఆ నెలంతా భక్తులు, మహిళలు పూజలు, వ్రతాలు, నోములతో గడిపేస్తారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ పండుగ, దసరా ఉత్సవాలతో నగరంలో ఆధ్యాత్మికత ఉట్టిపడనుంది. ఈ వరుస పండుగలు మానసిక ప్రశాంతతను, ఆహ్లాదాన్ని, ప్రేమ, ఆప్యాయతలను పంచుతాయి. ఆధ్యాత్మిక భావాలను కలిగించడంతోపాటు, మానవ సంబంధాల్లోని మహోన్నతమైన విలువలను ఆవిష్కరిస్తాయి.
     

మరిన్ని వార్తలు