మహాపిరమిడ్‌ పిలుస్తోంది!

21 Dec, 2019 08:47 IST|Sakshi

సాక్షి, కడ్తాల్‌(రంగారెడ్డి): మహేశ్వర మహాపిరమిడ్‌ .. మహిళా ధ్యాన మహాచక్రాలకు సర్వం సిద్ధమైంది. శనివారం నుంచి ప్రారంభమయ్యే  వేడుకల కోసం మహా పిరమిడ్‌ను  సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కడ్తాల్‌ –ఆన్మాస్‌పల్లి గ్రామాల సమీపంలో ఆహ్లాదభరితమైన వాతావరణంలో నిర్మితమైన అద్భుత కట్టడం ఇది. ధ్యాన జనులకు స్వర్గ ధామంగా పిలవబడుతున్న   మహా పిరమిడ్‌లో ఈసారి ప్రత్యేకంగా మహిళా ధ్యాన మహా చక్రాలను నిర్వహిస్తున్నారు. ఈ మహా పిరమిడ్‌లో  ప్రతి సంవత్సరం డిసెంబర్‌ మాసంలో ధ్యాన చక్రాలను నిర్వహిస్తుంటారు. ఈసారి కూడా వేడుకలు నిర్వహించేందుకు  ఏర్పాట్లు పూర్తి చేశారు.  ప్రతి సంవత్సరం దేశ విదేశాల్లోని ధ్యానులు అంతా కలిసి ఒకే చోట  ధ్యానం నిర్వహించే కార్యక్రమమే ధ్యాన మహాచక్రాలు అంటారు.  ప్రతి సంవత్సరం  ఇక్కడ  లక్షలాది జనుల  మధ్య వైభవంగా ధ్యాన సంబరాలు  నిర్వహిసుంటారు.  ఈ సంవత్సరం ది ఇండియన్‌ పిరమిడ్‌ స్ప్రిచ్యువల్‌ సొసైటీస్‌ మూవ్‌మెంట్‌ వ్యవస్థాపకుడు బ్రహ్మర్షీ సుభాష్‌ పత్రీజీ ఆధ్వర్యంలో  11 రోజుల పాటు  మహాపిరమిడ్‌లో మహిళా ధ్యాన మహాచక్రాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.  పిరమిడ్‌  ట్రస్ట్‌ సభ్యులు ప్రత్యేక వసతి, వైద్యం, రవాణా సౌకర్యం, ఉచిత భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఎత్తయిన పిరమిడ్‌ నిర్మాణం..
32,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 113.6 మీటర్ల ఎత్తుగా, 6 వేలకు పైగా ధ్యానులు ఒకే సారి ధ్యానం చేసేందుకు వీలుగా  బండరాళ్లు, ఇనుముతో  నిర్మించారు. పిరమిడ్‌ నలువైపులా పచ్చని చెట్లతో అందంగా ముస్తాబైంది. ఈ నిర్మాణం ఒక అద్భుతమని ఇండియన్‌ బుక్‌ అఫ్‌ రికార్డ్‌ వారు గతంలోనే  గుర్తించి రికార్డును అందజేశారు. ఆదే విధంగా పిరమిడ్‌ మధ్యలో కింగ్‌ చాంబర్‌ పాటు క్వీన్‌ చాంబర్‌ ఉన్నాయి. కింగ్‌ చాంబర్‌పై  500 మంది వరకు,  క్వీన్‌ చాంబర్‌పై  250 మంది వరకు  ధ్యానం చేయవచ్చు. పిరమిడ్‌లో ధ్యానం చేస్తే ప్రాణ శక్తి మూడురెట్లు అధికంగా శరీరంలోకి ప్రవేశిస్తుందని ధ్యానులు నమ్మకం.

వలంటీర్ల నియామకం
ధ్యానులకు సేవలందించేందుకు వలంటీర్లను నియమించారు. పిరమిడ్‌ పరిసరాలలో వైద్య సేవల కోసం ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేశారు.  చిన్న పిల్లల కోసం బాలకేంద్రంతో పాటు అఖంఢ ధ్యాన కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ధ్యానులకు  వసతి గృహాలు, కుటీరాలు ఏర్పాటు చేశారు. ప్రతి రోజు 30 వేల మంది ధ్యానం చేసేందుకు వీలుగా భారి ప్రాంగాణం, ప్రత్యేకంగా అలంకరించిన పెద్ద వేదిక తయారు చేశారు. సమాచార వ్యవస్థ కోసం ప్రత్యేకంగా తాత్కాలిక టవర్లు ఏర్పాటు చేస్తున్నారు.

ప్రముఖుల రాక..
ధ్యాన మహా చక్రాలకు విశాఖ శారదా పీఠాధి పతి, స్వరూపానంద సరస్వతీ, సత్యసాయి ధ్యాన మండలి గురూజీ భిక్షమయ్య, కుండలిని యోగి శేష్‌బట్టర్, సుదర్శనాచార్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ డీజీపీ అరవింద్, సిద్ధయోగి అంతర్ముఖానందా, స్వరయోగి మహామాతాజీ రుషికేశ్‌ పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

రోజూ జరిగే  కార్యక్రమాలివే..
రోజూ ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు పత్రీజీ వేణుగాన సంగీతం, అనంతరం సాముహిక ధ్యానం, సందేశం, వివిధ సాంస్కృతిక కళా ప్రదర్శనలతో పాటు, ధ్యాన గురువుల, ఆధ్యాత్మిక, ధ్యాన సందేశాలు 11 రోజులపాటు జరుగుతాయి.

ముమ్మర ఏర్పాట్లు 
మహిళా ధ్యాన మహాచక్రాల కోసం మహేశ్వర పిరమిడ్‌ వద్ద ఏర్పాట్లు   వేగంగా జరుగుతున్నాయి. దేశం నలువైపులా నుంచే కాక  విదేశాల నుంచి ధ్యానులు రానుండటంతో, వారికి కావలసిన వసతులు కల్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి రోజూ వేలాదిగా ధ్యానులు   పాల్గొననుండటంతో వారికి ఉచిత వసతితోపాటు భోజన సౌకర్యం కల్పిస్తున్నారు.

మరిన్ని వార్తలు