మాట్లాడే పుస్తకాలు!

18 Jun, 2018 14:24 IST|Sakshi

విద్యార్థులకు ఉపయోగం 

డాల్ఫియా ద్వారా పదాలు వినొచ్చు 

కథలోని పాత్రలను బట్టి పలికే విధానం

పఠనం సులభం..నైపుణ్యం మెరుగు

వనపర్తి జిల్లాలో రెండు పాఠశాలలకు పంపిణీ 

సాక్షి, పాన్‌గల్‌ (వనపర్తి) : కంటికి శ్రమ ఉండదు.. పెదవులు కదిలించాల్సిన అవసరం లేదు.. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఆ పుస్తకాల్లో అక్షరాలపై డాల్ఫియా పెడితే చాలు.. భావయుక్తంగా స్పష్టంగా అర్థమయ్యేలా మాటల రూపంలో వినిపిస్తాయి. ఇది కోడింగ్, డీకోడింగ్‌ ద్వారా ముద్రించిన మాట్లాడే పుస్తకాల (టాకింగ్‌ బుక్స్‌) ప్రత్యేకత. దీంతో విద్యార్థులకు పదాలను ఎలా ఉచ్చరించాలో స్పష్టంగా తెలియడంతోపాటు సులభంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సరికొత్త పరిజ్ఞానం తో చదువుపై విద్యార్థులకు ఆసక్తి పెరుగుతుంది. ప్రస్తుతం సీసీఈ పద్ధతిలో విద్యార్థులు బట్టీ పట్టి చద వుతున్నారు. ఈ విధానానికి స్వస్తి పలికేలా డిజిటల్‌ విద్యా విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

ఎలా మాట్లాడుతాయంటే.. 
యునిసెఫ్, సర్వశిక్ష అభియాన్‌ ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో కోడింగ్, డీకోడింగ్‌ విధానాన్ని అనుసరించి మాట్లాడే డాల్ఫియాను తయారు చేశారు. ఈ డాల్ఫియా లేదా డాల్ఫిన్‌ బొమ్మను ప్రతి పుస్తకం కవర్‌ పేజీపై ఉన్న గెట్‌ స్టార్‌ గుర్తుపై ఉంచాలి. తర్వాత పుస్తకంలోని పదాలపై డాల్ఫియాన్‌ కదిలిస్తూ ఉంటే డీకోడ్‌ విధానంలో పదాలు వినిపిస్తాయి. ఆ కథలో ఉన్న పాత్రలకు అనుగుణంగా మనకు మాటలు వినపడం వల్ల ఒక నాటికను చూస్తున్న అనుభూతిని విద్యార్థులు పొందుతారు.

మరిన్ని వార్తలు