పరుగెత్తడమూ విద్యే..

13 May, 2019 11:41 IST|Sakshi

వరంగల్‌ స్పోర్ట్స్‌ : ‘విద్య అంటే చదవడం, రాయడం.. ర్యాంకుల కోసం వెంపర్లాడడం కాదు.. ఉదయం, సాయంత్రం మైదానాల్లో పరుగెత్తడం.. ఇష్టమైన ఆటల్లో శిక్షణ పొందడమూ విద్యే’ అని బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి, భారత జట్టు కోచ్‌ పుల్లెల గోపిచంద్‌ అన్నారు. ఆదివారం హన్మకొండ అశోకా కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ జనరల్‌ బాడీ సమావేశానికి హాజరైన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
 
ఇష్టమైన ఆటల్లో శిక్షణ ఇప్పించాలి
తల్లిదండ్రులు వారి ఆలోచనలను పిల్లలపై బలవంతంగా రుద్దుతూ తరగతి గదులకే పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులకు మైదానాలను పరిచ యం చేసి వారికి ఇష్టమైన ఆటల్లో శిక్షణ ఇప్పించాలి. అలా చేయడం వల్ల క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం అలవడుతుంది. విద్యార్థులకు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ తప్పనిసరి.

ప్రతిభకు కొదువలేదు.. 
తెలంగాణలో ప్రతిభ గల క్రీడాకారులకు కొదువలేదు. పట్టణ, గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అసోసియేషన్‌ పాటుపడుతోంది. క్రీడలు, క్రీడాకారుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్, కేటీఆర్‌లు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారు. ప్రతిభ ఉండి ఆర్థికంగా, ఇతర కారణాలతో వెనుకబడిన క్రీడాకారుల వివరాలను మా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా వారికి మెరుగైన శిక్షణ అందజేస్తాం.

ఫిట్‌నెస్‌ పెంపునకు ఒప్పందం
టోర్నమెంట్ల సమయంలో క్రీడాకారులకు తెలియకుండా చిన్న చిన్న ఒత్తిళ్లు వారి మెదడులోకి చొచ్చుకుపోతుం టాయి. తద్వారా క్రీడలపై దృష్టి పెట్టలేక చాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరచలేని పరిస్థితులు ఉన్నాయి. క్రీడాకారుల్లో సైకాలజికల్‌గా ఫిట్‌నెస్‌ పెంపొందించేందుకు ఖరగ్‌పూర్‌ ఐఐటీతో ఒప్పందం కుదుర్చుకున్నాం.

మెరికల్లాంటి కోచ్‌లను తయారు చేస్తాం..
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కోచ్‌ల కొరత ఉంది. కోచ్‌లు ఉన్న కొన్ని చోట్ల నైపుణ్యం కలిగిన వారు తక్కువగా ఉన్నట్లు గుర్తించాం. అందుకే రానున్న రోజుల్లో క్రీడాకారులనే కాదు మెరికల్లాంటి కోచ్‌లను తయారు చేయాలని సిద్ధమవుతున్నాం. అందుకోసం జూలై 1 నుంచి ప్రత్యేక శిక్షణ తరగుతులు నిర్వహించనున్నాం. ఇప్పడికే కోచ్‌లుగా కొనసాగుతున్న వారితోపాటు కొత్త వారికి ప్రత్యేక శిక్షణ అందించడమే తమ లక్ష్యం. 

వరంగల్‌లో త్వరలో బ్యాడ్మింటన్‌ అకాడమీ..
హైదరాబాద్‌లో మాదిరిగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో బ్యాడ్మింటన్‌ అకాడమీ ఏర్పాటు చేయాలన్న ఆకాంక్షను క్రీడాకారులు మా ముందుకు తీసుకొస్తున్నారు. అయితే అకాడమీ ఏర్పాటు చేయడం అంత సులువు కాదు. సాంకేతిక ఇతర కారణాలు అనేకం అడ్డొస్తుంటాయి. వరంగల్‌ కేంద్రంగా త్వరలోనే అకాడమీ ఏర్పాటు చేసేందుకు పలువురి సలహాలు, సూచనలు తీసుకుంటున్నాం. వీలైనంత త్వరలోనే ఏర్పాటుకు కృషి చేస్తున్నాను.

మరిన్ని వార్తలు