10వేల ఎకరాలు హాంఫట్!

22 Nov, 2014 01:07 IST|Sakshi
10వేల ఎకరాలు హాంఫట్!

* విలువ రూ.20 వేల కోట్ల పైనే!
* సర్వేలో విస్మయపరిచే నిజాలు
* నగర శివార్లలోనే ఏకంగా 8 వేల ఎకరాలు అన్యాక్రాంతం
* ప్రాథమిక నివేదిక సమర్పించిన రంగారెడ్డి జిల్లా యంత్రాంగం

 
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: ప్రభుత్వ భూములకు రెక్కలొచ్చాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.20 వేల కోట్ల విలువైన సర్కారీ భూములు కబ్జాదారుల కబంధహస్తాల్లో చిక్కుకుపోయాయి. భూముల ఆక్రమణలపై రంగారెడ్డి జిల్లా యంత్రాంగం జరిపిన సర్వేలో విస్మయకర నిజాలు వెలుగు చూశాయి. ప్రభుత్వ భూముల్లో ఎంతమంది పాగా వేశారో లెక్క తీయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో రంగంలోకి దిగిన అధికారగణం.. జిల్లాలో 10,366.14 ఎకరాల భూమి అన్యాక్రాంతమైనట్లు గుర్తించింది. మరికొన్ని మండలాల నుంచి సమాచారం రావాల్సి ఉండడంతో ఈ గణాంకాలు పెరిగే అవకాశం లేకపోలేదు.
 
  పరిశ్రమలకు, వివిధ సంస్థలకు బదలాయించిన స్థలాలతోపాటు ఇంకా ఎవరికీ కేటాయించని భూముల వివరాలను పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలోనే 64,671.39 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు నిర్ధారించిన రెవెన్యూ యంత్రాంగం.. ఇందులో కేవలం 3,395.07 ఎకరాలు మాత్రమే వివాదరహితంగా ఉందని తేల్చింది. పోరంబోకు, సీలింగ్, కారీజ్ ఖాతాలుగా వర్గీకరించిన భూములు అక్రమార్కుల చెరల్లో చిక్కుకున్నాయని పసిగట్టిన యంత్రాంగం.. గ్రామీణ ప్రాంతాల్లో వీటిని సాగుకు వినియోగించుకుంటున్నట్లు గుర్తించింది. నగర శివార్లలో మాత్రం ల్యాండ్ మాఫియా గుప్పిట్లో వేలాది ఎకరాలు మగ్గుతున్నట్లు లెక్క తేల్చింది. అయితే, ఈ భూముల హక్కుల కోసం కోర్టుల్లో కేసులు నడుస్తుండడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటోంది.
 
మల్కాజిగిరిలో 6,248 ఎకరాలు హాంఫట్
 స్థిరాస్తి రంగం పుంజుకోవడంతో శివార్లలోని విలువైన స్థలాలు కైంకర్యమవుతున్నాయి. మరీ ముఖ్యంగా మల్కాజిగిరి, సరూర్‌నగర్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 7,783 ఎకరాలు ఆక్రమణకు గురైంది. రాజేంద్రనగర్ డివిజన్‌లో 2,127 ఎకరాల మేర ఆక్రమించినట్లు జిల్లా యంత్రాంగం తేల్చింది. ఇక్కడ ఎకరా సగటున రూ.3 కోట్లు పైమాటే. ఈ లెక్కన ఈ మూడు డివిజన్లలోనే సుమారు రూ.15 వేల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమైనట్లు అంచనా. బాలానగర్ మండలంలో 537.28, శేరిలింగంపల్లి 850.20, రాజేంద్రనగర్ 345, శంషాబాద్ 394, కుత్బుల్లాపూర్ 1913, ఉప్పల్ 121, శామీర్‌పేట 2993, మల్కాజిగిరి 162, మేడ్చల్ 340 ఎకరాలు కబ్జా అయినట్లు తేలింది. దీంట్లో అధికశాతం వ్యవసాయేతర భూములు కావడంతో వీటి విలువ రూ.కోట్లలో పలుకుతోంది. రెవెన్యూ అధికారులు భూ ఆక్రమణలపై క్షేత్రస్థాయిలో సర్వే జరపడమే కాకుండా రికార్డులను కూడా పరిశీలిస్తుండడంతో కబ్జా చిట్టా మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.
 
 18,476 మంది కబ్జాదారులు!
 జిల్లావ్యాప్తంగా ఆక్రమణకు గురైన పది వేల ఎకరాల్లో 18,476 మంది పాగా వేసినట్లు అధికార యంత్రాంగం తేల్చింది. ఇందులో అధికంగా మల్కాజిగిరి డివిజన్ పరిధిలో 17,590 మంది కబ్జాదారులు ఉన్నట్లు గుర్తించింది. చిన్నచిన్న బిట్లుగా ఉన్న స్థలాలపై కన్నేసిన అక్రమార్కులు.. వాటిని సొంతం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. స్థానిక రెవెన్యూ సిబ్బంది అండదండలు కూడా ఉండడంతో రికార్డులు తారుమారు చేయడం ద్వారా స్థలాల హక్కుల కోసం కోర్టుకెక్కుతున్నారు. ఇంటిదొంగలు హస్తం ఉండడంతో ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం ప్రభుత్వానికి తలకుమించిన భారంగా పరిణమించింది. ఆక్రమణదారుల్లో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, బడాబాబులు ఉండడంతో అన్యాక్రాంతమవుతున్న జాగాలపై పట్టు బిగించలేకపోతోంది.
 
 ల్యాండ్ బ్యాంక్ సిద్ధం!
 ఐటీ కంపెనీలు, బహుళ జాతి సంస్థల పెట్టుబడులను ప్రోత్సహించేలా నూతన పారిశ్రామిక విధానాన్ని తేవాలని భావిస్తున్న ప్రభుత్వం.. అందుకనుగుణంగా కంపెనీల స్థాపనకు ల్యాండ్ బ్యాంక్‌ను సిద్ధం చేసింది. గతంలో టీఐఐసీ, హెచ్‌ఎండీఏ, రాజీవ్ స్వగృహ, దిల్ తదితర సంస్థలకు బదలాయించిన భూముల్లో వినియోగంలోకిరాని భూములతోపాటు, పారిశ్రామిక అవసరాలకు పోను అట్టిపెట్టుకున్న భూముల వివరాలను కూడా సేకరించింది. ఈ నేపథ్యంలో తాజాగా 30 వేల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. అగ్రశ్రేణి సంస్థలు, ఫార్మా రంగం కంపెనీలు రాజధాని శివార్లలోనే పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపే అవకాశం ఉండడంతో అక్ర మార్కుల చేతుల్లోని భూములను కూడా రాబట్టుకునే దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగా ప్రభుత్వ భూముల వివరాలు, ఆక్రమణలకు సంబంధించి సర్వే నంబర్ల వారీగా వివరాలను సేకరిస్తోంది.

మరిన్ని వార్తలు