కొక్కో‘రూకో’!

19 Aug, 2019 10:20 IST|Sakshi

తగ్గిపోయిన చికెన్, కోడి గుడ్ల ధరలు

గ్రేటర్‌లో కిలో చికెన్‌ రూ.160, గుడ్డు రూ.4.25

ఈ మాసంలో భారీగా తగ్గిన వినియోగం

శ్రావణ మాసం ఎఫెక్ట్‌ గుడ్డు ధరలపైనా పడింది. సాధారణ రోజుల్లోగుడ్డు ధర రూ.5 ఉండగా..ప్రస్తుతం రూ.4.25కి తగ్గింది.హోల్‌సేల్‌లో డజన్‌గుడ్ల ధర రూ.45 ఉండగారిటైల్‌లో రూ.52గా ఉంది.

సాక్షి,సిటీబ్యూరో: గత నెలలో పరుగులు పెట్టిన చికెన్‌ ధరలు వారం రోజులుగా తగ్గుముఖం పట్టాయి. గత నెలలో కిలో చికెన్‌ రూ.280 వరకు వెళ్లిన ధర ఇప్పుడు రూ.160కి(స్కిన్‌లెస్‌) దిగివచ్చింది. గతంలో భారీగా ధరలు పెరిగాన సరే మాంసాహార ప్రియులు దుకాణాల ముందు క్యూ కడితే.. ప్రస్తుతం ధరలు సగానికి తగ్గినా కొనేవారు పెద్దగా కనిపించడం లేదు. శ్రావణ మాసం కావడంతో మాంసాహారానికి అత్యధిక మంది నగరవాసులు దూరంగా ఉన్నారు. ఆదివారం వచ్చిందంటే చికెన్‌ ప్రియులకు కోడి కూర లేకుంటే ముద్ద దిగనివారు సైతం ఈ ఏడాది శ్రావణ మాసంలో మాత్రం అందుకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోపక్క గ్రేటర్‌లో  కోడిమాంసం డిమాండ్‌ కంటే సప్లయ్‌ అధికం కావడం వల్ల కూడా చికెన్‌ ధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల నుంచి 5 లక్షల కిలోల వరకు చికెన్‌ విక్రయాలు జరుగుతాయి. అదివారం మాత్రం అది 70 లక్షల కిలోకు పెరుగుతుంది. కానీ శ్రావణ మాసంలో విక్రయాలు గత నెలలో జరిగి వ్యాపారంలో సగం కూడా ఉండడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.  

ఇంకా తగ్గే అవకాశం
శ్రావణ మాసం నేపథ్యంలో ఈ నెల మొదటివారం నుంచే చికెన్‌ వినియోగం గణనీయంగా తగ్గింది. నగరంలో లక్ష కిలోలకు అటు, ఇటుగా విక్రయాలు జరుగుతాయి. ఇతర రోజులతో పోల్చితే శ్రావణంలో వినియోగం సగానికి సగం తగ్గింది. సాధారణ రోజుల్లో 80 కిలోల వ్యాపారం జరిగితే ఈ నెలలో మాత్రం 30 కిలోలు కూడా విక్రయించడం కష్టంగా ఉందని ఓ రిటైల్‌ వ్యాపారి పేర్కొన్నాడు. ఆదివారం రోజు కనీసం 150 కిలోలకు తగ్గకుండా విక్రయిస్తానని, గత ఆదివారం మాత్రం వ్యాపారం 60 కిలోలే జరినిట్టు నాంపల్లికి చెందిన ఓ వ్యాపారి పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు