ఎన్నికల రోజూ తరగతులా..?

7 Dec, 2018 10:32 IST|Sakshi
విద్యార్థిని చేతిపై గాట్లు

సెలవు ఇచ్చేందుకు శ్రీచైతన్య యాజమాన్యం నిరాకరణ

విద్యార్థినుల మనస్తాపం చేతులపై గాట్లు పెట్టుకుని నిరసన

సీపీకి బాలల హక్కుల సంఘం ఫిర్యాదు

మా క్యాంపస్‌లో ఎలాంటి ఘటన చోటు చేసుకోలేదు:

శ్రీచైతన్య యాజమాన్యం  

సాక్షి, సిటీబ్యూరో:  అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఈ నెల 6, 7 తేదీల్లో అధికారికంగా సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా ఎల్బీనగర్‌లోని శ్రీ చైతన్య రెసిడేన్షియల్‌ కాలేజీ ఏసీ క్యాంపస్‌ యాజమాన్యం యథావిధిగా హాస్టల్‌ను కొనసాగించింది. ఎన్నికల సందర్భంగా తమ ఊరికి వెళ్లి ఓటు వినియోగించునేందుకు అనుమతి ఇవ్వాలని పలువురు విద్యార్థులు కోరినా నిర్వాహకులు అంగీకరించకపోవడంతో వారు మనస్తాపానికి లోనయ్యారు. 

చేతిపై గాట్లు పెట్టుకుని నిరసన...
ఎల్బీనగర్‌లోని శ్రీచైతన్య రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీలో 800 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. వీరిలో చాలా మందికి ఓటు హక్కు ఉండటంతో ఓటును వినియోగించుకునేందుకు సెలవు ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరగా నిర్వాహకులు అందుకు నిరాకరించారు. ప్రజాప్రాతినిథ్య చట్టం 1951 సెక్షన్‌ 135(బి) ప్రకారంఎన్నికల తేదీల్లో విధిగా ఆయా సంస్థలకు వేతనంతో కూడిన అధికారిక సెలవు ప్రకటించాలని ఇటీవల ఎన్నికల కమిషన్‌ స్వయంగా ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు కాలేజీలు, విద్యాలయాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినా సదరు యాజమాన్యం లెక్కచేయకపోగా గురువారం  యథావిథిగా తరగతులు నిర్వహించడంతో మనస్థాపానికి గురైన ఆరుగురు విద్యార్థినులు స్కేళ్లతో తమ చేతులపై గాట్లు పెట్టుకుని నిరసన తెలిపారు. తమ పట్ల యాజమాన్యం అమానుషంగా ప్రవర్తిస్తోందని ఆరోపిస్తూ వాయిస్‌ రికార్డులను మీడియాకు పంపారు. దీంతో మీడియా ప్రతినిధులు హాస్టల్‌ కు చేరుకోగా, విద్యార్థినులను కలిసేందుకు యాజమాన్యం నిరాకరించింది. తమ హాస్టల్లో ఎలాంటి ఘటన చోటు చేసుకోలేదని, ఆ వాయిస్‌ రికార్డ్‌ కూడా తమ హాస్టల్‌ విద్యార్థులది కావని డీన్‌ జగదీష్‌ పేర్కొన్నారు.

ఏసీపీ విచారణ...
దీనిపై బాలల హక్కుల సంఘం రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌కు ఫిర్యాదు చేయగా, సీపీ ఆదేశాల మేరకు ఎల్బీనగర్‌ ఏసీపీ పృధ్వీధర్‌రావు కాలేజీకి వెళ్లి విచారణ చేపట్టారు. కాగా దీనిపై ఫిర్యాదు చేసేందుకు విద్యార్థినులు  ముందుకు రాలేదు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.  

చర్యలు తీసుకుంటాం...
‘జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలకు రెండు రోజుల పాటు సెలవు ఇవ్వాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. నేనే స్వయంగా ఆయా కార్పొరేట్‌ కాలేజీల యాజమాన్యాలకు ఫోన్‌ చేశాను. ఎన్నికల విధుల్లో ఉన్నందున దాన్ని ఫాలో అప్‌ చేయలేక పోయాం. ఇప్పటి వరకు ఈ విషయం నా దృష్టికి రాలేదు. నిబధనలను ఉల్లగించిన సదరు కాలేజీపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం’
–సుధారాణి, ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారిణి, రంగారెడ్డి జిల్లా 

మరిన్ని వార్తలు