అనాథలు, అభాగ్యులకు కట్టింగ్, గడ్డాలు చేస్తారు..

12 Jun, 2018 10:52 IST|Sakshi
గాయాలపాలైన వ్యక్తికి ప్రాథమ చికిత్స చేస్తున్న సేవా సంస్థ యువకులు

అనాథలు, అభాగ్యులకు కట్టింగ్, గడ్డాలు చేస్తారు..

ఆకలి తీరుస్తారు.. అనాథ శవాలకు అండగా..  

ముగ్గురితో మొదలై మూడు వేల మందితో..  

ఉత్సాహంగా సాగుతున్న శ్రీరాజమాత సేవా సొసైటీ  

బంజారాహిల్స్‌: ముగ్గురితో మొదలైన ఓ సేవా ఉద్యమం.. దాదాపు మూడు వేల మంది యువతరాన్ని కదిలించేలా చేసింది.. తమ కళ్ల ముందు జరిగిన ఘటనకు చలించిన యువ హృదయాలు ఆపన్నులు, అనాథలు, వికలాంగులు, రోగులను ఇలా సేవ కోసం ఎదురుచూసే ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకొనేలా చేసింది.. నాలుగు రోజుల ఉద్యోగం.. మూడు రోజుల సేవా ఉద్యమం.. అదే ఆ యువతరం చేసే సామాజిక కార్యక్రమం.. ప్రమాదంలో గాయపడితే వైద్యం అందజేస్తారు. మృత్యువాతపడితే ముందుకొచ్చి మంచి మనసుతో సాయం చేస్తారు.. రోడ్డు పక్కన చెరిగిన జుత్తు, పెరిగిన గడ్డంతో ఎవరైనా కనిపిస్తే వారి రూపాన్ని మార్చేస్తారు.. ఆకలి అంటూ కనిపిస్తే వారి ఆకలి బాధను తీరుస్తారు.. యువతరాన్ని, విద్యార్థిలోకాన్ని సమాజసేవ వైపు నడిపించేందుకు వారంలో ఒకరోజు చైతన్య తరగతులు నిర్వహిస్తారు.. శ్రీరాజమాత సేవా సొసైటీ పేరుతో నగరంలోని చాలా మేర ప్రాంతాల్లో ఈ సామాజిక చైతన్య ఉద్యమం వేదిక ద్వారా ఆదుకుంటున్నారు. 

చెంగిచర్ల ప్రాంతానికి చెందిన ఆర్‌జే ఉదయ్‌రెడ్డి(ఒకప్పుడు రేడియో జాకీ) ఇంటర్‌ చదువుతున్న సమయంలో తనతోపాటు చదివే ముగ్గురు స్నేహితుల తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. దీంతో ఆ ముగ్గురు స్నేహితుల ఆర్థిక స్థోమత బాగోలేక చదువుకు దూరం కావల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటి వరకు అంతా కలిసి చదవుకున్న వారు ఒక్కసారిగా జరిగిన పరిణామంతో తమ స్నేహానికి, చదువుకు దూరం కావడంతో ఉదయ్‌రెడ్డి తట్టుకోలేకపోయారు. ఎలాగైనా కలిసి చదువుకోవాలని భావించారు. అదే తపన అతని స్నేహితులను కదిలించేలా చేసింది. అంతా కలిసి ముందుకొచ్చి వారి చదువుకు ఆర్థికంగా బాసటగా నిలిచారు. ‘తల్లిదండ్రులు లేకుంటే ఎంత కష్టం.. వారి పరిస్థితి ఎంత దుర్భరం.. ముగ్గురిని చదివిస్తేనే ఇంత ఆనందం.. ఇలాంటి వారికి సాయ పడితే...’ ఇదే ఆలోచన వారిని శ్రీరాజమాత సేవా సొసైటీ ఏర్పాటుకు ముందుకొచేలా చేసింది.  

మూడు వేల సైన్యం..  
ఉదయ్‌రెడ్డి ఒక్కడే కాకుండా తన సోదరుడు మనోజ్‌రెడ్డితోపాటు మరికొంతమందితో కలిసి ఈ సేవా సంస్థను ప్రారంభించాడు. తన ఆలోచనలను తాను చేసిన సేవా కార్యక్రమాలను సోషల్‌ మీడియా ద్వారా విస్తృతం చేశాడు. తెలిసిన వారందరికి తెలియజేశారు. ఇలా తన సేవా కార్యక్రమంలో అనేక కళాశాలల విద్యార్థులను కలుపుకొని ముందుకు వెళ్లాడు. కస్తూర్భా ఉమెన్స్‌ కళాశాల, రెడ్డి ఉమెన్స్‌ కాలేజ్, మధర్‌థెరిస్సా కాలేజ్, సిద్దార్థ కాలేజ్, శ్రీనిధి ఇంజనీరింగ్‌ కళాశాలతోపాటు మరికొన్ని కళాశాలలకు చెందిన విద్యార్థులు, పలువురు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఈ ఉద్యమంలో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చారు.  

సేవకు ముందుంటారు..
తల్లిదండ్రులు లేని అనాథలను అక్కున చేర్చుకోవడం, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, అనాథగా ఎవరూ మృతిచెందకుండా వారి ఖర్మకాండలు నిర్వహించడం, రోడ్డు పక్కన ఉన్న యాచకులకు, అనాథలకు, వికలాంగులకు, అవసరార్థులకు జుత్తు కత్తిరించడం, గడ్డం చేయడం, దేశంలో ఎక్కడ ఎవరికి అవసరమైనా రక్తం ఇవ్వడానికి నేరుగా తమ సొంత ఖర్చుతో వెళ్లడం, ప్రమాదాలలో గాయపడిన వారికి వైద్య సేవలందించడం ఇలా అనేక సేవా కార్యక్రమాలతో తమ సేవను విస్తృతం చేశారు. ఇలా ఇప్పటికీ రోడ్డు పక్కన ఉన్నవారికి దాదాపు 1500ల మందికి జుత్తు, గడ్డం కత్తిరించి అందంగా తీర్చిదిద్దారు. ఒక్కసారి చేసి వదిలేయడమే కాదు.. ప్రతి నెల చేస్తుంటారు.  

నగరంలో సగం..
నగరంలోని సగం ప్రాంతాల్లో ఈ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సికింద్రాబాద్‌ మదర్‌థెరిస్సా విగ్రహం, కిమ్స్‌ ఆసుపత్రి, రాణిగంజ్, బేగంపేట, ఉప్పల్‌క్రాస్‌ రోడ్, హబ్సీగూడ, మెట్టుగూడ, చిలకలగూడ చౌరస్తా, గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్, పద్మారావునగర్, పారడైజ్, పాట్నీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట, పంజాగుట్ట ఇలా నగరంలోని చాలా మేర ప్రాంతాల్లో పర్యటిస్తూ తమ సేవను కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతాలన్నింటిలో అన్నదానం చేస్తుంటారు. 

రామ్‌లక్ష్మణ్‌లు మెచ్చారు.  
శ్రీరాజమాత సేవా సొసైటీ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్న సినీ ఫైటర్స్‌ రామ్‌లక్ష్మణ్‌లు తమ వంతు సాయంగా వారు కూడా ముందుకొచ్చారు. సాయం చేయాలనే పెద్దమనసుతో అన్నదానానికి అవసరమైన మారుతీ ఓమ్నీ వాహనాన్ని కొనుగోలు చేసి వీరికి అందించారు. దీంతో ఈ సేవా సంస్థ సభ్యులు ఓమ్నీ వాహనం ద్వారా ప్రయాణించి అన్నదానం చేయడం, అనాథలకు, అభాగ్యులకు సేవ చేయడం చేస్తుంటారు. ఇక సోషల్‌ మీడియా ఆధారంగా తమ సేవకు సహకరించే వారి సాయం తీసుకుంటారు. అలాగని వీరు ఎవరి వద్ద నుంచి డబ్బులు ముట్టుకోరు. సేవకు అవసరమైన సామగ్రినే తీసుకుంటారు. 

అనాథ శవాలకు వీరే బంధువులు
ఒక్కోసారి ప్రమాదం జరిగితే అలాంటి ఘటనలో తీవ్రంగా గాయపడిన వారుంటారు. కొందరు మృత్యువాత పడతారు. మరికొన్ని అగ్నిమాపక ఘటనల్లో బాధితులు మంటలకు తీవ్రంగా గాయపడి కాలిపోతారు. ఈ తరహా ఘటనల్లో ఈ సేవా సంస్థ సభ్యులు చురుగ్గా ముందుకొస్తారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన రాంరెడ్డి కొద్ది నెలల క్రితం ఇలానే అగ్నికి దాదాపు 85 శాతం గాయాలపాలయ్యాడు. అతన్ని కొందరు గాంధీ ఆసుపత్రి వద్దకు తీసుకొచ్చి వదిలివెళ్లారు. ఉదయ్‌రెడ్డి బృందం రంగంలోకి దిగి దాదాపు 15 రోజులపాటు బాధితుడికి సాయం అందించింది. నాచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇలాంటి ఘటన జరిగితే అక్కడి ఇన్‌స్పెక్టర్‌ విఠల్‌ రెడ్డి ఈ సేవా సంస్థకు సమాచారం అందిస్తారు. ప్రాథమిక చికిత్స, బాధితుల తరలింపు, మృతదేహాల తరలింపు ఇలాంటి అన్ని అంశాల్లో వీరి సాయం కూడా తీసుకుంటున్నారు. కాగా సొసైటీకి చెందిన ఉదయ్‌రెడ్డితోపాటు మనోజ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నవీన్, కీర్తన, అఖిల్, లక్ష్మీనర్సింహారెడ్డి, సాయినిహాల్‌లు ప్రాథమిక చికిత్సకు సంబంధించి శిక్షణ సైతం పొందారు. ప్రమాద ఘటనల్లో వీరే ప్రాథమిక సాయం అందిస్తారు.  

అభాగ్యులకు అండగా నిలవడానికే..: ఉదయ్‌రెడ్డి, అధ్యక్షుడు
అభాగ్యులు, అనాథలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ఈ సంస్థను ప్రారంభించాం. తమ లక్ష్యసాధనలో చాలా మంది కలిసి వస్తున్నారు. సేవపై యువతలో మరింత ప్రోత్సాహాన్ని కల్పించడానికి వారంలో ఒకరోజు వివిధ కళాశాలలకు, పాఠశాలలకు వెళ్లి అక్కడ విద్యార్థులకు యువత, సమాజం, పెడదోవ పడితే కలిగే నష్టాలు, సామాజిక సేవ అంశాలపై అవగాహన కల్పిస్తాం. ఎవరూ అనాథలుగా చనిపోవద్దు. తమవారు లేక ఎవరూ వైద్యసేవలకు దూరం కావొద్దు.. ఆకలితో అలమటించవద్దు.. వీటినే నమ్మాం.. అందుకే ఆయా సేవలను అందిస్తున్నాం. వీటితోపాటు చదువుకు ప్రాధ్యాన్యమిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలకు అవసరమైన పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు ఇలా అవసరమైన ప్రతి సామగ్రిని ఈ సంస్థ అందజేస్తుంది. వారి చదువులకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. సేవకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఇందుకోసం వాట్సాప్‌ నంబర్‌ 9652752324లో సంప్రదిస్తే చాలని అంటున్నారు ఉదయ్‌రెడ్డి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా