ఏకాంతంగా శ్రీ సీతారాముల కల్యాణం

2 Apr, 2020 10:46 IST|Sakshi

సాక్షి, భద్రాచలం : శ్రీరామనవమి వేడుకలు భద్రాచలంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ప్రతినిధులుగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌లు హాజరై స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. కరోనా వైరస్‌ కారణంగా ఈ సారి భక్తజనం లేకుండానే సీతారామ కల్యాణం, పట్టాభిషేకం క్రతువులు జరగనున్నాయి. వైదిక పెద్దలు, అర్చకుల సమక్షంలో స్వామివారి కల్యాణం జరుగుతోంది. ఏటా మిథిలా స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించేవారు. ఈసారి ఆలయంలోని మండపంలోనే రాములవారి కల్యాణం జరగుతోంది. వేదపండితులు, అర్చకులు, పోలీసు, సాధారణ అధికారులు, ఆలయ ప్రతినిధులు ఈ వేడుకకి హాజరయ్యారు.

భక్తులు లేకుండానే కోదండరాముని బ్రహ్మోత్సవాలు
కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరాముని బ్రహ్మోత్సవాలు అత్యంత నిరాడంబరంగా, భక్తులు ఎవరూ లేకుండా ప్రారంభం అయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి భయంతో భక్తులకు అనుమతి నిరాకరించగా, అర్చకుల సమక్షంలో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఆలయ అధికారులు, తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు మాత్రమే పాల్గొన్నారు.ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని  గురువారం వేదపండితులు ధ్వజారోహనం నిర్వహించారు. 

మరిన్ని వార్తలు