రాజాధిరాజుగా రామయ్య.. 

16 Apr, 2019 06:47 IST|Sakshi
పూజారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న గవర్నర్‌ దంపతులు

కల్యాణ రాముడు పట్టాభి రాముడయ్యాడు. వేద పండితులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన పట్టాభిషేక మహోత్సవంలో రజత సింహాసనాన్నిఅధిష్టించారు. భక్తుల కరతాళధ్వనుల మధ్య.. రామనామ స్మరణ నడుమ.. రాజాధిరాజుగామురిసిపోయారు. వేడుకలను తిలకించేందుకువేలాదిగా వచ్చిన భక్తులు ఆ అపురూప ఘట్టాన్ని చూసి ధన్యులయ్యారు.  

చర్ల(భద్రాచలం): భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి పట్టాభిషిక్తుడయ్యారు. శిల్పకళా శోభితమైన మిథిలా స్టేడియం కల్యాణ మండపంలో సోమవారం కనుల పండువగా పట్టాభిషేక మహోత్సవం నిర్వహించారు. ప్రతి సంవత్సరం స్వామివారి కల్యాణం జరిగిన మరుసటిరోజు శ్రీరామ పట్టాభిషేం నిర్వహించడం ఆనవాయితీ. ముక్కోటి దేవుళ్లలో ఎవరికీ లేని ఆ భాగ్యం ఒక్క శ్రీరామచంద్రుడికే ఉందని, పట్టాభిషేకం జరిగితేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని వేద పండితులు తెలిపారు. అర్చక స్వాముల మంత్రోచ్ఛరణలు, దేవస్థానం ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ వేడుకను వీక్షించిన భక్తులు తన్మయత్వంతో పులకించిపోయారు.

కార్యక్రమం జరుగుతున్నంతసేపూ.. జై శ్రీ రాం.. జైజై శ్రీరాం.. అనే భక్తుల రామనామస్మరణతో మిథిలాస్టేడియం మార్మోగింది. తొలుత గర్భగుడిలో ప్రత్యేక పూజలందుకున్న తర్వాత భద్రగిరీశుని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిపై ఆశీనులను చేసి గిరి ప్రదక్షణ చేయించారు. అనంతరం రామభక్తుల జయజయ ద్వానాల నడు మ మాఢ వీధుల్లో ఊరేగించారు. పట్టాభిషేక ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు దంపతులు పట్టు వస్త్రాలను శిరస్సుపై పెట్టుకొని ఆలయం నుంచి స్వామి వారి ఊరేగింపులో పాల్గొని మిథిలా స్టేడియం వరకు నడుచుకుంటూ వచ్చారు. అక్కడ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన శిల్పకళా శోభితమైన మండపంపై స్వామి వారిని ఆశీనులను చేసి అర్చక స్వా ములు పట్టాభిషేక కార్యక్రమానికి నాంది పలికారు.
 
పట్టాభిషేకం... రామయ్యకే సొంతం ... 
ముక్కోటి దేవుళ్లలో ఒక్క శ్రీరాముడికి తప్ప మరెవ్వరికీ పట్టాభిషేక యోగం లేదని అర్చక స్వాములు తెలిపారు. తొలుత విశ్వక్సేన పూజ,  వేడుకకు వినియోగించే పూజా ద్రవ్యాలకు పుణ్యాహవచనం చేశారు. పట్టాభిషేకానికి హాజరైన భక్తుల హృదయాలు పవిత్రంగా ఉండాలంటూ పుండరీకాక్ష నామస్మరణ చేసి భక్తులకు సంప్రోక్షణ చేశారు. శ్రీరామనవమి మరుసటి రోజైన దశమిని దర్మరాజు దశమి అంటారని, ఈ రోజు మహాపట్టాభిషేకం జరిగితే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని వేదపండితులు గుదిమెళ్ల మురళీ కృష్ణమాచార్యులు వివరించారు.

పవిత్ర గోదావరి నదీ జలాలతో స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అష్టోత్తర, సహస్ర నామార్చన, సువర్ణ పుష్పాలతో స్వామి వారికి ప్రత్యేక పూజలు గావించారు. మండపంలో పంచ కుండాత్మక పంచేష్టి సహిత చతుర్వేద హవన పురస్కృతంగా  క్రతువును జరిపించారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్‌ ముహూర్తాన రజత సింహాసనంపై శ్రీ సీతారాముల వారిని పట్టాభిషిక్తుడిని చేశారు.
 
ఒక్కో ఆభరణాన్ని ధరింపజేస్తూ...  
పట్టాభిషేకం సందర్భంగా భక్తరామదాసు శ్రీ సీతారామచంద్రమూర్తులకు చేయించిన ఆభరణాలను ఒక్కొక్కటిగా భక్తులకు చూపిస్తూ వాటి  విశిష్టతను వివరిస్తూ స్వామి వారికి ధరింపజేశారు. స్వర్ణఛత్ర, స్వర్ణపాదుక, రాజదండ, రాజపట్ట, రాజముద్ర, బంగారు కిరీటాలను  అలంకరింపజేశారు. త్రేతాయుగంలో శ్రీరాముని పట్టాభిషేకం జరిగిన చైత్ర పుష్యమి ముహూర్తంలోనే భద్రాచలంలో కూడా పట్టాభిషేకం జరిపించడం ఆనవాయితీ అని వేదపండితులు వివరించారు. 60 ఏళ్లకు ఒకసారి మహా సామ్రాజ్య పట్టాభిషేకం, 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కర ప్రయుక్త సామ్రాజ్య పట్టాభిషేకం, ప్రతీ ఏటా కల్యాణం జరిగిన మరుసటి రోజు మహాపట్టాభిషేకం నిర్వహించడం ఆనవా యితీగా వస్తోందని, భక్త రామదాసు కాలం నుంచీ ఇదే సంప్రదాయం కొనసాగుతోందని తెలియజేశారు. పట్టాభిషేక మహోత్సవాన్ని  తిలకించిన వారికి అంతా మంచి జరుగుతుందని చెప్పారు. వేడుక పూర్తయిన తరువాత స్వామి వారి అభిషేకంలో ఉపయోగించిన పుణ్య జలాలను భక్తులపై చల్లారు.
 
పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్‌ దంపతులు... 
పట్టాభిషిక్తుడైన భద్రాద్రి రామయ్యకు గవర్నర్‌ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో భద్రాచలం చేరుకున్న ఆయన తొలుత రామాలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని పరివార దేవతలకు పూజలు చేశారు.
  
హాజరైన ప్రముఖులు వీరే ... 
మిథిలా స్టేడియంలో నిర్వహించిన శ్రీ సీతారామచంద్రస్వామి వారి మహాపట్టాభిషేక కార్యాక్రమానికి గవర్నర్‌ నరసింహన్‌ దంపతులతో పాటు గవర్నర్‌ కార్యాలయ కార్యదర్శి కె.సురేంద్రమోహన్, వెనుకబడిన తరగతుల కమిషన్‌ సభ్యులు డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ రజత్‌కుమార్‌శైనీ, ఎస్పీ  సునీల్‌దత్, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్‌ కనుమూరి బాపిరాజు, భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి పీవీ గౌతమ్‌ తదితరులు హాజరయ్యారు.

నేడు రామయ్యకు మహదాశీర్వచనం 
భద్రాచలంటౌన్‌: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీరామనవమి, పట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీసీతారాముల కల్యాణం జరిగిన రెండో రోజున రామయ్యకు దేశంలోని 508 మంది వేదపండితులచే మహదాశీర్వచనం చేస్తారు. తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన, బాలభోగ నివేదన, హవనం, సేవాకాలం, బలిహరణం, మంగళాశాసనం నిర్వహిస్తారు. 7 గంటల నుంచి 8 గంటల వరకు భద్రుని మండపంలో అభిషేకం, 12.30 నుంచి 1 గంట వరకు ఆరాధన, రాజభోగం జరుపుతారు. 3.30 నుంచి 6 గంటల వరకు వేదస్వస్తి,  సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మహదాశ్వీరచనం, వేద సాహిత్య సదస్సు, హంస వాహన సేవ నిర్వహిస్తారు. 

మరిన్ని వార్తలు