రాజాధి'రాజ'..

4 Apr, 2020 12:32 IST|Sakshi
స్వామి వారికి బంగారు కిరీటాన్ని ధరింపజేస్తున్న అర్చకులు

పట్టాభిషిక్తుడైన భద్రాద్రి రామయ్య

మొదటిసారి భక్తులు లేకుండా మహా పట్టాభిషేకం

పట్టువస్త్రాలు సమర్పించిన ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి రామయ్య పట్టాభిషిక్తుడయ్యాడు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాచలం రామాలయంలో శుక్రవారం ఈ వేడుక నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలు, దేవస్థానం ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల నడుమ క్రతువు జరిపారు. ప్రతియేటా శ్రీ సీతారామచంద్ర స్వామివారికి కల్యాణం జరిగిన మరుసటి రోజే, అదే వేదికపై పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. కోవిడ్‌–19 లాక్‌డౌన్‌ కారణంగా ఈసారి కల్యాణ మహోత్సవం మిథిలా స్టేడియంలో నిర్వహించకుండా.. బేడా మండపంలోనే నిర్వహించారు. పట్టాభిషేకం కూడా అక్కడే జరిపారు. భక్తులు లేకుండానే ఈ వేడుక సాగింది. ఉదయం యాగశాలలో చతుస్థానార్చన హోమం నిర్వహించారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన ప్రత్యేక పల్లకీపై వేంచేయింపజేసి బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఆశీనులను చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ఆలయం నుంచి పట్టు వస్త్రాలను శిరస్సుపై «పెట్టుకుని మండపంలోని స్వామివారికి సమర్పించారు. ఆ తదుపరి అర్చకులు జగదభిరాముడికి పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణం శ్రీరామ నామ సంకీర్తనలతో మార్మోగింది.

పట్టాభిషేకం భద్రాద్రి రామయ్యకే ప్రత్యేకం
ముక్కోటి దేవుళ్లలో ఎవరికీ లేని పట్టాభిషేక యోగం ఒక్క శ్రీరాముడికే సొంతమని పట్టాభిషేక క్రతువు నిర్వహించిన అర్చకులు, వేద పండితులు తెలిపారు. మొదటగా విశ్వక్సేనుడి పూజతో మహా పట్టాభిషేకం ప్రారంభించారు. వేడుకకు వినియోగించే పూజా ద్రవ్యాలకు పుణ్యాహవచనం చేశారు. పట్టాభిషేకానికి హాజరైన ప్రముఖుల హృదయాలు పవిత్రంగా ఉండాలని పుండరీకాక్ష నామస్మరణ చేసి భక్తులకు సంప్రోక్షణ జరిపారు. శ్రీరామ నవమి మరుసటి రోజైన దశమిని ధర్మరాజు దశమి అంటారని, ఈ రోజున పట్టాభిషేకం జరిగితే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని వేదపండితులు పేర్కొన్నారు. పవిత్ర నదీజలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత అష్టోత్తర, సహస్రనామార్చన, సువర్ణ పుష్పార్చనలతో స్వామివారికి పూజలు జరిపారు. మండపంలో పంచకుండాత్మక–పంచేష్టిసహిత చతుర్వేద హవన పురస్కృతంగా వేదపండితులు క్రతువు నిర్వహించారు. సరిగ్గా మధ్యాహ్నం 12గంటలకు రజిత సింహాసనంపై శ్రీసీతారాముల వారిని పట్టాభిషిక్తుడిని చేశారు.

సకల రాజలాంఛనాలతో..
పట్టాభిషేకం సమయాన భక్త రామదాసు చేయించిన దివ్యాభరణాలను శ్రీసీతారామచంద్రస్వామి వారికి అలంకరించారు. ఒక్కో ఆభరణాన్ని భక్తులకు చూపిస్తూ, వాటి విశిష్టతను వివరిస్తూ స్వామివారికి ధరింపజేశారు. స్వర్ణఛత్రం, స్వర్ణపాదుక, రాజదండం, రాజముద్రిక, కత్తి, డాలు, మహా సామ్రాట్‌ కిరీటాన్ని స్వామివారికి అలంకరింపజేశారు. నాటి మహర్షులు, అష్టదిక్పాలకులు, శ్రీరాముని సేనను గురించి వివరించారు. త్రేతాయుగంలో శ్రీరాముని పట్టాభిషేకం జరిగిన చైత్ర పుష్యమి ముహూర్తంలోనే భద్రాచలం దివ్యక్షేత్రంలో కూడా పట్టాభిషేకం జరిపించడం ఆనవాయితీ అని వేద పండితులు తెలిపారు. 60ఏళ్లకు ఒకసారి మహా సామ్రాజ్య పట్టాభిషేకం, 12 ఏళ్లకు ఒకసారి పుష్కర ప్రయుక్త పట్టాభిషేకం, ప్రతి ఏటా కల్యాణం మరుసటి రోజు మహా పట్టాభిషేకం నిర్వహించే సంప్రదాయం భక్త రామదాసు కాలం నుంచి కొనసాగుతోందని వేద పండితులు మురళీకృష్ణమాచార్యులు వివరించారు. పట్టాభిషేకం వీక్షించినవారికి విజయాలు సిద్ధిస్తాయని, అందరికీ మంచి జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా రామాలయ ప్రాంగణం జై శ్రీరామ్, జైజై శ్రీరామ్‌ అనే నినాదాలతో మార్మోగింది.పట్టాభిషేకం పూర్తైన తర్వాత స్వామివారి అభిషేకంలో ఉపయోగించిన పుణ్యజలాలను భక్తులపై చల్లారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్, ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన్, అర్చకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు