కమనీయం.. సీతారాముల కల్యాణం..

15 Apr, 2019 07:50 IST|Sakshi

శ్రీరామనవమి వేడుకలు ఆదివారం జిల్లాలో కనులపండువగా సాగాయి. రామాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. బాజాభజంత్రీలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. జగదభిరాముడి కల్యాణాన్ని భక్తులు కనులారా వీక్షించి తరించారు. జిల్లా కేంద్రంలోని రామగిరిలో గల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో రామయ్య కల్యాణం అంగరంగ వైభవంగా సాగింది. కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

నల్లగొండ కల్చరల్‌ : రెండో భద్రాచలంగా పేరుగాంచిన జిల్లా కేంద్రంలోని రామగిరి శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయం ఆవరణలో ఆదివారం శ్రీ సీతారాముల కల్యాణ కమనీయంలా సాగింది. మందుగా సేవపై స్వామివారి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఉంచి ఆలయం నుంచి కల్యాణ వేదిక వద్దకు తోడ్కొని వచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీటలపై ప్రతిష్టింపజేశారు. ముందుగా విశ్వక్సేనారాధన నిర్వహించి కల్యాణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగింపజేయాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. అర్చక స్వాములు రక్షాబంధనాలను సీతా అమ్మవారి, రాముల వారి ముంజేతికి అలంకరింపజేశారు.

సుముహూర్తం ప్రారంభం కాగానే అర్చకులుల అమ్మవారి, స్వామివారి తలలపై జీలకర్రబెల్లం అలంకరించారు. మంగళసూత్రాన్ని భక్తులకు దర్శింపజేసి రాములవారి చేతులకు తాకించి సీతాదేవి మెడలో అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు జయజయధ్వానాలు పలికారు. చివరగా తలంబ్రాలను సీతారాముల తలలపై ఉంచి కల్యాణోత్సవ కార్యక్రమాన్ని ముగింపజేశారు. అంతకుముందు ఉదయం అమ్మవారికి, స్వామివారికి కలెక్టర్‌ డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ నివాసం, నల్లగొండ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్‌రెడ్డి నివాసావాల నుంచి పట్టువస్త్రాలను మంగళవాద్యాలతో తోడ్కొని వచ్చి అమ్మవారికి, స్వామివారికి అలంకరించారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి–రమాదేవి దంపతులు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ జగదీశ్‌రెడ్డి, ఆలయ ఈఓ ముకిరాల రాజేశ్వరశర్మ, ఆలయ స్థానాచార్యులు శ్రీరంగాచార్యులు, భక్తులు చకిలం వేణుగోపాల్‌రావు, సంధ్యారాణి, అక్కెనెపల్లి పద్మ, బుక్కా ఈశ్వరయ్య, మునాస వెంకన్న, జీనుగు జ్యోతి, ప్రధాన అర్చకులు సముద్రాల యాదగిరియాచార్యులు, శఠగోపాలాచార్యులు, రఘునందన భట్టాచార్‌ పాల్గొనగా కార్యక్రమాన్ని భక్తులకు తన వ్యాఖ్యానంతో కన్నులకు కట్టినట్లు శ్రీరంగంలోని శ్రీ రంగనాథుడి ఆలయం స్థానాచార్యులు పరాశర లక్ష్మీనర్సింహాచార్యులు వివరించారు.

భక్తులకు మంచినీటి సౌకర్యం..
కల్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులు నల్ల గొండ గీతా విజ్ఞాన్‌ పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో చల్లటి మజ్జిగ, మంచినీరు సరఫరా చేశారు. రామాలయం వలంటీర్లు భక్తుల వద్దకు వెళ్లి గోత్ర నామాలను రాసుకుని, వారందించే కట్నకానుకలను నమోదు చేసుకున్నారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో భక్తులకు ఓఆర్‌హెచ్‌ ప్యాకెట్లను, జ్వరం మాత్రలను, ఇతర మందులను అందజేశారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎం ధనలక్ష్మి, ఆశా వర్కర్‌ విజయలక్ష్మి తదితరలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు