పాతబస్తీలో ప్రారంభమైన శోభాయాత్ర!

14 Apr, 2019 11:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : శ్రీరామనవమి సందర్భంగా సీతారామ్‌ బాగ్‌, రాణి అవంతీబాయ్‌ ఆలయం నుంచి శ్రీ సీతారాముల శోభయాత్ర ఆదివారం ఉదయం ప్రారంభమైంది. గౌలిగూడలోని హనుమాన్ వ్యాయామశాల వరకు సాగనున్న ఈ శోభయాత్రలో శ్రీరామ ఉత్సవ సమితి, భజరంగ్‌దళ్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పురాన్‌పూల్, గౌలీగూడ, సుల్తాన్ బజార్ మీదుగా సాగే ఈ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో  అదనపు బలగాలను వినియోగిస్తున్నారు. సుమారు ఐదువేల మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారు.

శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ అధికారులను ఆదేశించారు. మరోవైపు ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకూ మద్యం దుకాణాలను సైతం మూసివేయించారు. శోభాయాత్రలో సుమారు లక్షన్నర మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.
 ప్రముఖ ఆలయాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో 24 గంటలు పనిచేసే కంట్రోల్‌రూంలను ఏర్పాటును చేశారు. అదనపు కమిషనర్‌ షిఖా గోయల్‌ ఆధ్వర్యంలో అదనపు డీసీపీలు-3, డీఎస్పీలు-4, ఇన్‌స్పెక్టర్లు-28, ఎస్సైలు-38, హెడ్‌కానిస్టేబుళ్లు-46, కానిస్టేబుళ్లు-86, అదనపు బలగాలు ప్లాటూన్‌-13, టీయర్‌గ్యాస్‌ స్క్వాడ్స్‌-2 బందోబస్తులో విధులు నిర్వహిస్తున్నారు. యాత్ర జరిగే ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు