మీపై ఎందుకు వేటు వేయకూడదు?

19 Jul, 2014 23:29 IST|Sakshi
మీపై ఎందుకు వేటు వేయకూడదు?

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ ఎన్నికల్లో గీతదాటిన జెడ్పీటీసీ సభ్యులకు ఉచ్చు బిగుస్తోంది. పార్టీ జారీ చేసిన విప్‌ను ధిక్కరించి టీఆర్‌ఎస్‌కు ఓటేసిన ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు సంజాయిషీ ఇవ్వాలని శనివారం జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీధర్ నోటీసులు జారీ చేశారు. పార్టీ నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిన ముంగి జ్యోతి (రాజేంద్రనగర్), కొంపల్లి యాదవరెడ్డి (నవాబ్‌పేట)ని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఆ పార్టీనేతలు ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ చట్టం-1994 రూల్ 22 కింద ‘మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని’ కలెక్టర్ శ్రీధర్ నోటీసులిచ్చారు.
 
విప్ ఉల్లంఘించారని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన ఆధారాలను కూడా నోటీసులతోపాటు జతపరిచారు. దీనిపై ఈనెల 25లోపు సమాధానమివ్వాలని గడువు విధించారు. ఇదిలావుండగా పార్టీకి వ్యతిరేకంగా ఓటేసిన ముంగి జ్యోతిని ఆరేళ్లపాటు సస్పెండ్ చేస్తున్నట్టు టీపీసీసీ ప్రకటించింది. విప్‌ను ధిక్కరించిన మరో జెడ్పీటీసీ యాదవరెడ్డిపై మాత్రం వేటు వేయకపోవడం గమనార్హం. ప్రస్తుత ం ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఆయనపై చర్య తీసుకునే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం అచితూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.
 
ఇక కుల్కచర్ల, ధారూర్, మోమిన్‌పేట, మర్పల్లి మండల పరిషత్ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించి ప్రత్యర్థి పార్టీలకు ఓటేసిన ఎంపీటీసీలపైనా చర్య తీసుకోవాలని ఆయా పార్టీల అధిష్టానాలు ప్రిసైడింగ్ అధికారులకు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో పార్టీ నిర్ణయాలను శిరసావహించకుండా ఇత ర పార్టీల్లోకి ఫిరాయించిన సభ్యులు వారం రోజుల్లో సమాధానమివ్వాలని అధికారులు తాఖీదులు పంపారు.

>
మరిన్ని వార్తలు