ఆర్టీఏ కార్యాలయం వద్ద హైడ్రామా

28 Dec, 2016 02:55 IST|Sakshi
మంగళవారం ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు

శ్రీనివాస్‌గౌడ్, జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య వివాదం
వేదికగా మారిన ఖైరతాబాద్‌ రవాణా కార్యాలయం
ప్రభాకర్‌రెడ్డి అరెస్టు, విడుదల
నిబంధనలకు విరుద్ధంగా ‘ప్రైవేట్‌’ బస్సుల రవాణా: శ్రీనివాస్‌గౌడ్‌
మమ్మల్నే టార్గెట్‌ చేసి మాట్లాడడం అన్యాయం: ప్రభాకర్‌రెడ్డి


సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేట్‌ బస్సుల అక్రమ రవాణా అంశంపై సవాళ్లు.. ప్రతి సవాళ్లకు మంగళవారం హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని రవాణా కార్యాలయం వేదికకగా మారింది. మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ ఇటీవల అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తిన సంగతి తెలిసిందే. ఆర్టీసీకి భారీ ఎత్తున నష్టం వాటిల్లుతోందని, ప్రైవేట్‌ బస్సుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని అసెంబ్లీలో ఆయన డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై అనం తపురంలో స్పందించిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తాము అక్రమ రవాణాకు పాల్పడడం లేదని దీనిపై మంగళవారం రవా ణా కార్యాలయం వద్ద చర్చకు రావాలని సవా ల్‌ విసిరారు. దీంతో ఉదయం శ్రీనివాస్‌గౌడ్‌ అక్కడకు చేరుకోవడం, తరువాత జేసీ ప్రభా కర్‌రెడ్డి రావడంతో ఉద్రిక్త వాతావరణం నెల కొంది. పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పా టు చేశారు. జేసీ అరెస్టు.. విడుదల, ఇరువురు నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హైడ్రామా నడిచింది.

జేసీని అరెస్టు చేసిన పోలీసులు...
జేసీ సవాల్‌ను స్వీకరించిన శ్రీనివాస్‌గౌడ్‌ ఉదయం 10 గంటలకే అనుచరులతో ఆర్టీఏ కార్యాలయానికి చేరుకొని బైఠాయించారు. ఇదే సమయంలో తన అనుచరులతో జేసీ ప్రభాకర్‌ ఆర్టీఏ కార్యాలయానికి చేరుకోవ డంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జేసీని పోలీ సులు గేటు వద్దనే అడ్డుకుని అరెస్ట్‌ చేసి గోషామహల్‌ స్టేషన్‌కు తరలించారు. అనం తరం 2 గంటల పాటు ఆర్టీఏ కార్యాల యంలోనే ఉన్న శ్రీనివాస్‌గౌడ్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత విడుదలై వచ్చిన ప్రభాకర్‌రెడ్డి.. నేరుగా ఆర్‌టీఏ కార్యాలయా నికి చేరుకోవడంతో హైడ్రామా చోటు చేసు కుంది. ఈ క్రమంలో కొందరు ప్రైవేటు బస్సు ల యజమానులు, ఆర్టీసీ సంఘాల నేతలు జేసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 
ప్రైవేటు ట్రావెల్స్‌ వల్ల ఆర్‌టీసీకి నష్టం: శ్రీనివాస్‌గౌడ్‌
ఏపీకి చెందిన ప్రైవేటు బస్సుల వల్ల తెలంగాణ ఆర్టీసీ తీవ్రంగా నష్టపోతుందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. ఆర్టీఏ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ.. పాలెం బస్సు దుర్ఘటనలో జేసీకి భాగముందని, దాన్నుంచి తప్పించుకోవడానికే ఆయన తప్పుడు తేదీలు నమోదు చేసి బస్సును ఘటనకు ముందుగానే అమ్మినట్లు దొంగ పత్రాలు సృష్టించాడని, తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. తాను అసలు దివాకర్‌ ట్రావెల్స్‌ పేరు ప్రస్తావించలేదని, మొత్తం ట్రావెల్స్‌ విషయం మాట్లాడితే అయనొక్కరే ఎందుకు స్పందిస్తున్నారని ప్రశ్నించారు. తనపై జేసీ చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ చేసారు.

నిబంధనల మేరకు బస్‌లు నడుపుతున్నాం: ప్రభాకర్‌రెడ్డి
నిబంధనల మేరకే ట్రావెల్స్‌ నడుపుతున్నామని తనపై అసత్య ఆరోపణలు మానుకోవాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శ్రీనివాస్‌గౌడ్‌ తన పేరు ప్రస్తావించడం వల్లనే ఇక్కడకు రావలసి వచ్చిందన్నారు. తాను శ్రీనివాస్‌గౌడ్‌తో మాట్లాడేందుకు సిద్ధమని.. పారిపోయే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. తాను ఏ సంవత్సరం పన్నులు చెల్లించకుండా బస్సులు తిప్పానో రికార్డులు చూపించాలని సవాల్‌ విసిరారు. చర్చలకు వస్తే తనను అడ్డుకొని అరెస్ట్‌ చేయడం దారుణమన్నారు. పాలెం బస్‌ ప్రమాదంలో మృతి చెందిన అందరికి నష్టపరిహారం అందించామని, ఒక్కరికి మాత్రమే అందించలేదన్నారు. శ్రీనివాస్‌ గౌడ్‌ ఆరోపణల వెనుక ఆరెంజ్‌ ట్రావెల్స్‌ యాజమాన్యం ఉందని ఆరోపించారు. తనకు ఎవరితో వ్యక్తిగత విభేదాలు లేవని.. గౌడ్‌ ఇంటికి వెళ్లి చర్చించడానికి సిద్ధమని చెప్పారు.


                                                జేసీ ప్రభాకర్‌రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు

>
మరిన్ని వార్తలు