ఫణిగిరి బుద్ధప్రతిమను పరిశీలించిన శ్రీనివాస్‌గౌడ్‌ 

30 Apr, 2019 01:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సూర్యాపేట జిల్లాలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రమైన ఫణిగిరిలో వెలుగుచూసిన అరుదైన బుద్ధ విగ్రహాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ పరిశీలించారు. రాష్ట్ర పురావస్తు శాఖ మ్యూజియంలో భద్రపరిచిన భారీ గార ప్రతిమను (డంగు సున్నంతో రూపొందించిన) సోమవారం మ్యూజియానికి వెళ్లి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో చరిత్ర ఉందని, ఆదిమానవుని అవశేషాలు రాష్ట్రంలో చాలా చోట్ల వెలుగు చూశాయని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతో పురావస్తు శాఖ రాష్ట్రంలోని చారిత్రక ప్రదేశాల్లో తవ్వకాలు జరిపి చరిత్ర అవశేషాలను వెలికితీయటం అభినందనీయమన్నారు. దేశంలో ఇప్పటివరకు రెండు అడుగుల పరిమాణంలో ఉండే సున్నం ప్రతిమలు లభించాయని, ఆరు అడుగుల పొడవుతో డంగు సున్నంతో రూపొందించిన ప్రతిమ వెలుగుచూడడం క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దానికి చెందినట్లుగా భావిస్తున్నామని శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడించారు.  

మరిన్ని వార్తలు