గుడుంబాపై ఉక్కుపాదం మోపండి

30 Apr, 2020 01:53 IST|Sakshi

పీడీ యాక్టులు పెట్టి కేసులు నమోదు చేయండి

ఎక్సైజ్‌ అధికారులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశాలు

సాక్షి కథనంపై స్పందన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గుడుంబా తయారీని సహించేది లేదని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్పష్టం చేశారు. గుడుంబాపై ఉక్కుపాదం మోపాలని, తయారీదారులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని ఎక్సైజ్‌ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ‘గుడుంబా గుప్పు–పల్లెకు ముప్పు’ శీర్షికన రాష్ట్రంలో మళ్లీ కోరలు చాస్తున్న గుడుంబా తయారీపై బుధవారం ‘సాక్షి’మెయిన్‌ ఎడిషన్‌లో ప్రచురితమైన కథనానికి స్పందనగా, తాజా పరిస్థితి గురించి బుధవారం ఆయన ఎక్సైజ్‌ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టుదల, నిబద్ధతతో రాష్ట్రం గుడుంబా రహితంగా మారిందని, ఆ ఇమేజ్‌ పోతే సహించేది లేదని చెప్పారు. చదవండి: గుడుంబా గుప్పు.. పల్లెకు ముప్పు

గుడుంబా తయారీదారులను, బెల్లం అమ్మకందారులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. క్షేత్ర స్థాయిలో అధికారులు ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని, అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆబ్కారీ జిల్లాల అధికారులు ప్రతి రోజూ తమ సిబ్బంది నుంచి వివరాలు తీసుకుని, ఆ నివేదికలను తనకు పంపాలని ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు, పోలీస్, తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లతో కలసి తనిఖీలు నిర్వహించాలని సూచించారు. లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా ఊరుకోవద్దని, మద్యం అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే షాపుల లైసెన్సులు రద్దు చేయాలని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, అదనపు కమిషనర్‌ అజయ్‌రావు, టీఎస్బీసీఎల్‌ ఎండీ సంతోష్‌రెడ్డి, ఉన్నతాధికారులు ఖురేషీ, హరికిషన్‌లతో పాటు వివిధ జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.  

ఇప్పటివరకు 1,922 కేసులు నమోదు  
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గుడుంబా తయారీ, అమ్మకందారుల మీద ఇప్పటివరకు 1,922 కేసులు పెట్టి 8,091 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్‌ అధికారులు మంత్రికి వివరించారు. అక్రమ మద్యం అమ్మేవారిపై 743 కేసులు పెట్టి 777 మందిని అరెస్టు చేశామని, 6,223 లీటర్ల మద్యం, 4,525 లీటర్ల బీరును సీజ్‌ చేశామని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా చేస్తున్న 21 మందిపై కేసులు నమోదు చేసి 212 లీటర్ల మద్యం 22 లీటర్ల బీరు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. లాక్‌డౌన్‌ సందర్భంగా 45 మంది నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం అమ్ముతున్నారని గుర్తించి కేసులు పెట్టామని, 80 మందిని అరెస్టు చేశామని మంత్రికి వివరించారు.

మరిన్ని వార్తలు