‘నీరా.. గౌడ సోదరుల ఆత్మగౌరవారనికి ప్రతీక’

22 Jul, 2020 18:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నెక్లెస్‌ రోడ్డులో నిర్మించనున్న నీరా కేఫ్‌ నిర్మాణ ప్రాంతానికి రేపు(గురువారం) మంత్రి కేటీఆర్‌ భూమి పూజ చేయనున్నారు. నిర్మాణ స్థలాన్ని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ బుధవారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... వేల సంవత్సరాలుగా గీత వృత్తిని నమ్ముకున్న వారికి ఈ రోజు మంచి రోజు వచ్చిందన్నారు. మంత్రి కేటీఆర్‌ చొరవతోనే నెక్లెస్‌ రోడ్డులో నీర స్టాల్‌ను నిర్మించబోతున్నామని తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు కేటీఆర్‌ నీరా‌ కేఫ్‌కు శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. నీరా కేఫ్‌ అనేది గౌడ సోదరుల ఆత్మగౌరవారనికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

కరోనా నేపథ్యంలో తక్కువ మందితోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ గ్రామంలోనూ ఈత, తాటి వనాలు అభివృద్ధి చేసి కుల వృత్తులను ఆదుకుంటామని చెప్పారు. కోకాపేటలో 150 కోట్ల రూపాయల విలువైన భూమిని సీఎం కేసీఆర్ గౌడ భవనానికి కేటాయించారని తెలిపారు. అన్ని కులాలను ప్రభుత్వం అదుకుంటుందని, కల్లు ఆరోగ్యానికి ప్రమాదకరమైనదిగా గతంలో చిత్రీకరించారన్నారు. నీరా తాగటం వల్ల ప్రోటీన్ అందుతుందని చెప్పారు. సంక్షేమ పథకాలు అన్ని కులాలకు అందుతున్నాయని తెలిపారు. రాజకీయ లబ్ది కోసం కొందరు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి మండిపడ్డారు.

మరిన్ని వార్తలు