వర్గీకరణపై తీర్మానం  చేయని బాబుతో పొత్తా?

30 Nov, 2018 01:48 IST|Sakshi

వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగ

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీల వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేయమని కోరితే మాదిగలను లాఠీదెబ్బలు కొట్టించి, దండోరా కార్యకర్తలను జైలుకు పంపిన టీడీపీ అధినేత చంద్రబాబుతో మందకృష్ణ పొత్తు ఎలా పెట్టుకున్నాడని ఎమ్మార్పీస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగ విమర్శించారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మందకృష్ణది అవకాశవాద వ్యక్తిగతస్వార్థ వైఖరని మండిపడ్డారు. తెలంగాణ మందకృష్ణకు ఆంధ్రాలో ఏంపని అని నాడు చంద్రబాబు అనలేదా అంటూ గుర్తు చేశారు. కురుక్షేత్ర మీటింగ్‌కు అనుమతివ్వకుండా కార్యకర్తలందరినీ జైల్లో పెట్టలేదా? అని ప్రశ్నించారు.

ఆంధ్రాలో పర్యటిస్తుంటే అరెస్టు చేసి మెడలు పట్టి జీపులో ఎక్కించి తెలంగాణలో వదిలిపెట్టిన చంద్రబాబుతో మందకృష్ణమాదిగ పొత్తుపెట్టుకోవడం సిగ్గుచేటని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తనను చంపాలని చూస్తుందని, తనను కారు వెంబడించిందన్న మందకృష్ణ మాటలు బూటకమేనా అని ప్రశ్నించారు. మాదిగ జాతి ఆత్మగౌరవం కలిగినదని, అలాంటి జాతిలో పాలల్లో విషం చుక్కలాంటి వాడు మందకృష్ణ అని ఆయన ధ్వజమెత్తారు. ముగ్గురు జాతి యువకిశోరాలను కాంగ్రెస్‌ పార్టీ పొట్టన పెట్టుకుంటే అమరుల త్యాగాలను మరిచి వారి ఆత్మఘోషించేలా మందకృష్ణ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. 

మరిన్ని వార్తలు