-

టీఆర్‌ఎస్ ఖాతాలోకే డీసీఎమ్మెస్..

5 Dec, 2014 02:22 IST|Sakshi
టీఆర్‌ఎస్ ఖాతాలోకే డీసీఎమ్మెస్..

అధ్యక్షుడిగా శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవం
పంతం నెగ్గించుకున్న తూర్పు ప్రాంత నేతలు


ఆదిలాబాద్ అగ్రికల్చర్ : అధికార పార్టీ టీఆర్‌ఎస్ ఖాతాలో మరో పదవి పడింది. జిల్లా సహకార మార్కెట్ సంఘం చైర్మన్ పదవి కోసం అధికార పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. గురువారం డీసీఎమ్మెస్ కార్యాలయంలో నిర్వహించిన చైర్మన్ ఎన్నికలో అధికార పార్టీకి చెందిన కె.శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతనెల 28న అవిశ్వాసం ద్వారా ఖాళీ అయిన చైర్మన్ పదవికి పది మంది డెరైక్టర్ల సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది. చైర్మన్ పదవి కోసం శ్రీనివాస్‌రెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు.

ఎనిమిది మంది డెరైక్టర్లు పాల్గొనగా ఏడుగురు ఆయనకు మద్దతుగా చేతులు లేపారు. డెరైక్టర్లు బి.వినోద్‌రెడ్డి, బిక్కు రాథోడ్, రాములు, దేవన్న, త్రయంబక్, లాలూనాయక్, దిలిప్ మద్దతు ప్రకటించారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసినట్లు జిల్లా సహకార అధికారి సూర్యచందర్‌రావు ప్రకటించారు. ఇప్పటివరకు వైస్ చైర్మన్‌గా కొనసాగిన ఆయన రాజీనామా చేసి చైర్మన్ పదవి బాధ్యతలు చేపట్టారు.

తూర్పు ప్రాంతానికే పదవి..

కాగా.. డీసీఎమ్మెస్ చైర్మన్ పదవి కోసం పశ్చిమ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు గట్టి ప్రయత్నాలే చేశారు. అయినా.. తూర్పు ప్రాంతమైన లక్సెట్టిపేట మండలం జెండావెంకటాపూర్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డికే ఆ పదవి లభించింది. ఇతర పార్టీల్లో కొనసాగిన ఆరుగురు డెరైక్టర్లు చైర్మన్ ఎన్నికకు ఒకరోజు ముందు టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో ఎలాంటి పోటీ లేకుండానే ఏకగీవ్రంగా ముగిసింది. శ్రీనివాస్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన వైస్‌చైర్మన్ పదవికి కమిషనర్ నుంచి ఆదేశాలు రాగానే ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో మళ్లీ ఆ పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. డెరైక్టర్ దేవన్న ఇందుకోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. చైర్మన్ ఎన్నికకు మాజీ చైర్మన్ ఐర నారాయణరెడ్డి, డెరైక్టర్ కోటేశ్వర్‌రావు హాజరు కాలేదు.

అవినితీపై విచారణ చేపడుతాం..
 - శ్రీనివాస్‌రెడ్డి, డీసీఎమ్మెస్ చైర్మన్
 
గత చైర్మన్ అవినితికి పాల్పడడంతోనే అతనిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని కొత్తగా చైర్మన్‌గా ఎన్నికైన శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడి పశువుల పథకంలో అక్రమాలకు పాల్పడ్డారని, గతంలో ఏ కుంభకోణాలకు పాల్పడ్డారో వాటన్నింటిపై విచారణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఏళ్ల తరబడి చైర్మన్‌గా కొనసాగుతూ.. రైతులను మోసం చేస్తూ అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. జిల్లాలో రైతులకు ఎరువులు, విత్తనాలు, ధాన్యం కొనుగోలుకు ఎలాం టి ఇబ్బంది కలగకుండా చేస్తానని, తానూ రైతు బిడ్డనేనని, తనకూ రైతుల కష్టాలు తెలుసునని అభిప్రాయపడ్డారు. తదుపరి డెరైక్టర్లు, టీఆర్‌ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి ఆయనకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, లక్సెట్టిపేట జెడ్పీటీసీ చిన్నయ్య, నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు