తొలి ఫలం శ్రీరాముడికే!

29 May, 2019 07:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసి ఆయకట్టుకు నీరందించే ప్రక్రియ శరవేగంగా సాగుతుండగా, దీని తొలిఫలం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) ఆయకట్టుకు అందనుంది. జూలై చివరి నుంచి ప్రారంభం కానున్న గోదావరి ఎత్తిపోతల పథకం ద్వారా ఆగస్టు నుంచి ఎస్సారెస్పీ స్టేజ్‌–1 కింద నిర్ణయించిన 9 లక్షల ఎకరాలకు నీరు అందించనున్నారు. దీనికి అనుగుణంగా ఇప్పటికే పంప్‌హౌజ్, బ్యారేజీ, కాల్వ ల పనులు శరవేగంగా కొనసాగుతుండగా, కొత్తగా ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు వరకు నీరందేలా కాల్వల ఆధునీకరణ, తూముల నిర్మాణం చేసి చెరువులను నింపే ప్రణాళిక శరవేగంగా అమలవుతోంది.

60 టీఎంసీలు.. 9 లక్షల ఎకరాలు..
ఎస్సారెస్పీ స్టేజ్‌–1 కింద 9.68 లక్షలు, స్టేజ్‌–2 కింద మరో 4 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికింద ఉన్న కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాల్వల ద్వారా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల రైతులకు ప్రయోజనం చేకూరుతోంది. గడిచిన కొన్నేళ్లుగా ఎగువ నుంచి ఎస్సారెస్పీకి వరద తగ్గడం, వచ్చినా ఆగస్టు తర్వాత వరద ఉంటుండటంతో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందట్లేదు. గరిష్టంగా 4.5 లక్షల ఎకరాలకు మించి నీరు చేరట్లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే కాళేశ్వరం ద్వారా ఆయకట్టుకు సమృద్ధిగా నీరు అందుబాటులో ఉంచేందుకు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి ప్రభు త్వం శ్రీకారం చుట్టింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను దాటుకొని ఎల్లంపల్లి మీదుగా వరద కాల్వ ద్వారా నీరు మిడ్‌మానేరు చేరుతుంది.

మిడ్‌మానేరుకు చేరకముందే వరద కాల్వ మీద 3 పంప్‌హౌజ్‌లు నిర్మించి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా రోజుకు 1 టీఎంసీ నీటిని వరద ఉండే 60 నుంచి 120 రోజుల పాటు ఎస్సారెస్పీకి పంపిస్తారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలోని మూడు పంప్‌హౌజ్‌లకు రెండు పంప్‌హౌజ్‌లలో సిద్ధం అవుతున్నాయి. ఈ రెండు పంప్‌హౌజ్‌లలో 6.5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న నాలుగు చొప్పున పంపులను జూన్‌ చివరికి పూర్తి చేసి, జూలై నుంచి ఖరీఫ్‌లో కనిష్టంగా 60 టీఎంసీల నీటిని ఆయకట్టుకు తరలిస్తారు. ఈ నీటికి ఎస్సారెస్పీకి సహజ ప్రవాహాలతో వచ్చే మరో 30 నుంచి 40 టీఎంసీల నీరు తోడైతే పూర్తి ఆయకట్టుకు నీరందించడం సాధ్యం కానుంది. లేదంటే 60 టీఎంసీల నీటినే ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిన 9 లక్షల ఎకరాలకు సరఫరా చేయనున్నారు.

ఆధునీకరణ చేపడుతూనే..
కాళేశ్వరం నీళ్లతో తొలి ప్రయోజనం ఎస్సారెస్పీ ఆయకట్టుకే అందనుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లు గా నిల్వ, సరఫరా చేసందుకు వీలుగా ఓ పక్క చెరువులను నింపేలా తూముల నిర్మాణం, మరోపక్క కాల్వల ఆధునీకరణకు సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఎస్సారెస్పీ పరిధిలో మొత్తం 775 తూముల నిర్మా ణం చేసి 1,192 చెరువులకు నీరు మళ్లించాలని నిర్ణయించి తూముల పనులు మొదలు పెట్టారు.  ఇప్పటికే ఎస్సారెస్పీ కాల్వల ఆధునీకరణను రూ.వెయ్యి కోట్లతో చేపట్టగా వీటిలో 60 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు వేగిరం చేయడంతో పాటు వారి పరిధిలోని డిస్ట్రిబ్యూటరీలను మరో రూ.420 కోట్లతో చేపట్టేందుకు నిర్ణయించారు. దీనికి అదనంగా ఎస్సారెస్పీ స్టేజ్‌–2లో 220 కాల్వల లైనింగ్‌ పనులను చేపట్టాలని నిర్ణయించారు. వీటికి రూ.653 కోట్లతో అంచనాలు సిద్ధం చేసి పరిపాలన అనుమతుల కోసం నివేదించారు.

మరిన్ని వార్తలు