భద్రాద్రి రామయ్యకు పట్టాభిషేకం

29 Mar, 2015 23:39 IST|Sakshi
భద్రాద్రి రామయ్యకు పట్టాభిషేకం

పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్ దంపతులు  
తిలకించి, పులకించిన భక్తజనం

 
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామివారి పట్టాభిషేక మహోత్సవం ఆదివారం కన్నుల పండువగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. మిథిలా స్టేడియంలోని శిల్పకళాశోభితమైన కల్యాణమండపంలో వైభవోపేతంగా జరిగిన ఈ  వేడుకను కనులారా వీక్షించిన భక్తజనం తన్మయత్వం చెందారు. తొలుత ఉదయం యాగశాలలో చుతాస్థానార్చన హోమం నిర్వహించి, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో ఉత్సవ మూర్తులతో గిరిప్రదక్షిణ చేశారు. మంగళవాయిద్యాలు, సన్నాయి మేళాలు,భక్తుల జయజయధ్వానాలు, మహిళల కోలాటాలతో కల్యాణమండపం వరకు స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆలయం నుంచి మాడవీధుల మీదుగా ఈ ఊరేగింపు కల్యాణ మండపానికి చే రుకుంది. గవర్నర్ దంపతులు పట్టువస్త్రాలతో పల్లకి ముందు నడిచారు.
 
పట్టాభిషేకం జరిగిందిలా...

వేడుకలో భాగంగా స్వామివారికి ముందుగా ఆరాధన జరిపారు. సకల విఘ్నాలు తొలిగేందుకు విష్వక్సేన పూజ నిర్వహించారు. పట్టాభిషేకంలో వినియోగించే ద్రవ్యాలకు పుణ్యహవచనం గావించారు. ఆ తరువాత కలశాలలో ఉన్న చతుస్సముద్రాలు, పంచ నదుల తీర్థజలాలకు ప్రోక్షణ చేశారు. ప్రాంగణానికి అన్ని దిక్కులు, భక్తులపై పుణ్యజలాలను చిలకరించారు. అభిషేకానికి వీలుగా కలశ స్థాపన చేశారు. రామదాసు కాలం నాటి ఆభరణాలు, బంగారు పాదుకలు, రాజదండం, రాజముద్రిక, ఛత్రం సమర్పించి కిరీటధారణ గావించారు. ప్రధాన కలశంతో ప్రోక్షణ అనంతరం స్వామివారిని పట్టాభిషిక్తుడను చేశారు. అభిషేకంతో పట్టాభిషేక తంతు ముగిసింది.

రామయ్య పాలన ఆదర్శం

అనంతరం ఆలయ స్థానాచార్యులు కేఈ స్థలశాయి పట్టాభిషేకాన్ని నిర్వహించే వేదపారాయణులు, అష్టదిక్పాలకులను పరిచయం చేశారు. పట్టాభిషేకంలో వారి పాత్రను వివరించారు. భద్రాచలంలో మహా పట్టాభిషేకం విశిష్టతను ఆలయ వేదపండితులు గుదిమెళ్ల మురళీ కృష్ణమాచార్యులు వివరించారు. శ్రీరాముడు లోక కల్యాణం కోసం చేసిన త్యాగం గురించి వర్ణించారు. శ్రీరాముడి పాలన నేటి తరాలకు ఆదర్శం కావాలని చెప్పారు. పట్టాభిషేకం పూర్తయ్యాక పుణ్యజలాలను భక్తులపై చల్లారు.

 రెండు రాష్ట్రాలూ సుభిక్షంగా ఉండాలి:  గవర్నర్ నరసింహన్ ఆకాంక్ష

భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో ఆదివారం నిర్వహించిన మహాపట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సతీసమేతంగా హాజరయ్యూరు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు ఆయన రామాలయూన్ని దర్శించుకొని ప్రత్యేక  పూజలు చేశారు. లక్ష్మీతాయారు అమ్మవారు, భద్రమహర్షి ఆలయాలను కూడా దర్శించుకున్నారు. పట్టాభిషేకం పూర్తి అయిన తరువాత కూడా ఆయన సతీసమేతంగా ఆలయానికి వెళ్లి మరోమారు స్వామివారిని దర్శించుకున్నారు. ‘రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని భద్రాద్రి రామయ్యను కోరుకున్నాను’ అని గవర్నర్ నర్సింహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వెంట తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ఇలంబరితి, జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జ్ పీవో దివ్య, ఆర్‌డీవో అంజయ్య, దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి ఉన్నారు.
 

మరిన్ని వార్తలు