కృష్ణమ్మ వస్తోంది..

19 Aug, 2018 11:02 IST|Sakshi
శ్రీశైలం జలాశయం నుంచి ఆరుగేట్ల ద్వారా దిగువకు వస్తున్న నీరు

రైతులు.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కృష్ణమ్మ పరవళ్లు మొదలయ్యాయి. శ్రీశైలం ప్రాజెక్ట్‌ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో సాగర్‌వైపు కృష్ణమ్మ పరుగులిడుతోంది. శ్రీశైలానికి ఎగువ నుంచి 3లక్షల క్యూసెక్కులకు పైగా నీరు వచ్చి చేరుతుండడంతో దిగువకు 2లక్షల క్యూసెక్కులకుపైగా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మరికొద్ది రోజుల్లో ఆశల సాగరం నిండనుందని ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

నాగార్జునసాగర్‌ (నల్గొండ) : శ్రీశైలం జలాశయం ఆరుగేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్‌ వైపుగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువనుంచి శ్రీశైలం జలాశయానికి  3,08,217 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో విద్యుదుత్పాదన కేంద్రాలతో పాటు ఆరుగేట్ల ద్వారా 2,32,912 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఒక్కోగేటును నాలుగు అడుగుల మేర ఎత్తి  దిగువకు నీటిని వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకునేందుకు మరో మూడు అడుగులు మాత్రమే ఉంది. సాగర్‌ జలాశయం నీటిమట్టం శనివారం ఏడుగంటలకు 532.20 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. గత రెండు రోజులతో పోలిస్తే జలాశయ నీటిమట్టం శరవేగంగా పెరుగుతోంది. కృష్ణాపరీవాహక ప్రాంతాలైన కర్నాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ఎగువనున్న ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. అదనంగా వచ్చే ప్రతినీటి బొట్టును దిగువకు వదులుతున్నారు. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్రతో పాటు శ్రీశైలం జలాశయం నిండుకుండలా తొణికిసలాడుతున్నాయి. ఎగువనుంచి అన్ని ప్రాజెక్టులకు సగటున నిత్యం లక్షన్నర క్యూసెక్కులకు పైచిలుకు నీరు వచ్చి చేరుతుండగా అంతేమోతాదులో దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ జలాశయానికి గత యేడాదితో పోలిస్తే ముందస్తుగానే నీరు వచ్చి చేరుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

సాగర్‌ ప్రస్తుత పరిస్థితి..
ప్రస్తుతం సాగర్‌లో 172.4730 టీంసీల నీరుంది. గరిష్ట నీటిమట్టానికి చేరుకుంటే జలాశయంలో 312.24టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవాలంటే మరో 140టీఎంసీల నీరు వచ్చి చేరాల్సి ఉంటుంది. నిత్యం రెండు లక్షల క్యూసెక్కుల నీరు 8రోజులపాటు వస్తే సాగర్‌ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోనుంది.  
జాలరులు, రైతులు అప్రమత్తంంగా ఉండాలి
జలాశయంలోకి నీరు వచ్చి చేరుతుండడంతో జలాశయంతీరం వెనుకభాగంలో ఉండే జాలరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని డ్యాం అధికారులు హెచ్చరిస్తున్నారు.  జలాశయంలో నీరు లేని సమయంలో రైతులు పంటలు వేస్తారు. నీటిగుంతల్లో మోటార్లు పెట్టి నడుపుతారు. ఒకేసారి నీరు పెరగడంతో పంటచేలు మునగడంతో పాటు మోటార్లు నీటిమునగనున్నాయి. వాటిని వెంటనే ఒడ్డుకు చేర్చుకోవాలని అధికారులు హెచ్చరించారు. అలాగే జాలరులు నీటికి అడ్డంగా వలలు వేయ వద్దని కొట్టుకుపోయే అవకాశలున్నాయని, నివాసాలను జలాశయంలోనుంచి ఒడ్డుపైకి మార్చుకోవాలని సూచించారు. ఏదిఏమైనా శ్రీశైలం గేట్లు ఎత్తడం.. సాగర్‌ వైపు కృష్ణమ్మ పరుగులు పెట్టడంతో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
 
22నుంచి నీటి విడుదల
ఖరీఫ్‌ పంటల సాగుకు ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో..
ఆరు విడతలుగా 69 రోజులపాటు మొదటి, రెండో జోన్లకు విడుదల
40 టీఎంసీల నీరు కేటాయింపు

మిర్యాలగూడ : నాగార్జునసాగర్‌ ఎడమ కాలు వకు 2018 ఖరీఫ్‌ పంటల సాగుకు గాను విడతల వారీగా నీటిని విడుదల చేయనున్నట్లు ఎన్‌ఎస్‌పీ మిర్యాలగూడ ఒ అండ్‌ ఎం సర్కిల్‌ ఎస్‌ఈ నర్సింహ వెల్లడించారు. శనివారం స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఖరీఫ్‌లో నీటి లభ్యత ఆధారంగా ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో ఎడ మ కాలువకు 40 టీఎంసీల నీటిని కేటాయించినట్లు తెలిపారు. మిర్యాలగూడ, ఖమ్మం సర్కిల్‌ పరిధిలో మొత్తం 6.25 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని, నల్లగొండ జిల్లాలో 1,45,720 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 2,29,961 ఎకరాల ఆయకట్టు ఉన్నట్లు పేర్కొన్నారు. ఖరీఫ్‌లో విడుదల చేసే నీరు మొదటి జోన్, రెండో జోన్‌కు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 510 అడుగుల కంటే తక్కువగా నీరుంటే సాగు అవసరాలకు ఇవ్వవద్దని ఉన్నందున ఇప్పటివరకు విడుదల చేయలేదని తెలిపారు. కానీ ప్రస్తుతం సాగర్‌ జలాశయంలో 531.30 అడుగుల మేర 170.696 టీఎంసీ నీరుందన్నారు. దాంతో ఖరీఫ్‌లో ఎడమ కాలువకు సాగు అవసరాలకు గాను 40 టీఎంసీలు కేటాయించామని, ఆరు విడతలుగా నీటిని 69 రోజుల పాటు విడుదల చేయనున్నట్లు వివరించారు.

నవంబర్‌ 28 వరకు..
ఈ నెల 22వ తేదీనుంచి నవంబర్‌ 28వ తేదీ వరకు ఆరు విడతలుగా ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో విడుదల చేయనున్నట్లు ఎస్‌ఈ నర్సింహ పేర్కొన్నారు. మొదటి విడుతలో వరినాట్లు వేసుకునే వీలు కోసం 24రోజుల పాటు నిరంతరంగా నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఆరు రోజుల పాటు నీటిని నిలిపివేసి తొమ్మిది రోజులపాటు విడుదల చేయనున్నామన్నారు.  చివరి ఆయకట్టు వరకు నీటిని అందించడానికి గాను నీటి పారుదల శాఖ అధికారులు టెయిల్‌ టు హెడ్‌ పద్ధతి ద్వారా నీటిని అందించనున్నట్లు తెలిపారు. ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతికి రైతులంతా సహకరించాలని ఆయన కోరారు. కాలువకు గండ్లు పెట్టకుండా నీటిని వినియోగించుకోవాలని, నీటిని వృథా చేసి చివరి దశలో ఇబ్బందులు పడవద్దని కోరారు. 

20న సమావేశం..
సాగర్‌ ఎడమ కాలువకు ఖరీఫ్‌ నీటి విడుదల ప్రణాళికపై వర్క్‌షాప్‌ నిర్వహించనున్నట్లు ఎన్‌ఎస్‌పీ ఎస్‌ఈ నర్సింహ తెలిపారు. 20వ తేదీన మధ్యాహ్న రెండు గంటలకు లక్ష్మి కల్యాణమండపంలో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, రైతు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్లు, మాజీ డీసీ, నీటి వినియోగదారుల సంఘ సభ్యులు పాల్గొనాలని కోరారు.    

మరిన్ని వార్తలు